Kasturi: అంతా మంచే జరిగింది...
ABN , Publish Date - Dec 08 , 2024 | 06:07 AM
నా అరెస్ట్‌కు దారి తీసిన ఘటనలు ఈనాటివి కాదు. రెండేళ్ల క్రితమే నన్ను ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు. సనాతన ధర్మాన్ని, ‘వసుదైవ కుటుంబకం’ అనే సూత్రాన్ని నేను గాఢంగా నమ్ముతాను. ఏ మతానికి, కులానికి వ్యతిరేకిని కాదు.
కస్తూరి...
తెలుగు సినిమాలు, సీరియల్స్ చూసేవారికి సుపరిచితమైన పేరు. తెలుగువారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆమెను హైదరాబాద్‌లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వృత్తిరీత్యా మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన కస్తూరిని ‘నవ్య’ పలకరించింది.
నా అరెస్ట్‌కు దారి తీసిన ఘటనలు ఈనాటివి కాదు. రెండేళ్ల క్రితమే నన్ను ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు. సనాతన ధర్మాన్ని, ‘వసుదైవ కుటుంబకం’ అనే సూత్రాన్ని నేను గాఢంగా నమ్ముతాను. ఏ మతానికి, కులానికి వ్యతిరేకిని కాదు. కానీ డీఎంకే విధానాలను మాత్రం వ్యతిరేకిస్తా. రెండేళ్ల క్రితం ఉదయనిధి మారన్ సనాతన ధర్మంపె చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా విమర్శించా. అప్పుడు నన్ను అరెస్ట్ చేయటానికి ఆ ప్రభుత్వం వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. అందువల్ల అప్పుడు నన్ను వదిలేశారు. కానీ ఎప్పుడో అప్పుడు కస్తూరికి గుణపాఠం నేర్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత రెండేళ్లలో నామీద అనేకసార్లు దాడులు జరిగాయి. కానీ నేను భయపడలేదు. నన్ను తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ చేస్తే నాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని వారికి తెలుసు. అందుకే హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
మళ్లీ హైదరాబాద్ వచ్చారు... ఎలా అనిపిస్తోంది?
గత రెండు వారాలు చెన్నైలో హడావిడిగా గడిచిపోయింది. ఇక్కడకు వస్తే భద్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ‘ఇది నా ఇల్లు. ఇది సొంత ఊరు కదా! నేను అరెస్ట్ అయిన తర్వాత- తెలుగు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో?’ అనేబెంగ ఉండేది. ‘నన్ను అపార్థం చేసుకున్నారా?’ అనే అనుమానం కూడా తలెత్తింది. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలయిపోయాయి.
మీరు అరెస్ట్ అవుతారని ఎప్పుడైనా ఊహించారా?
నేరం చేస్తే ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాం. నేరం చేయకపోతే ఆ ఆలోచనే రాదు కదా! నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆలోచన నాకు రాలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసులు మా ఇంటికి వస్తే షాక్ అయిపోయాను. వాస్తవానికి ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. ఈ వివాదం చెలరేగినప్పుడు - తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి ఫోన్ చేశాను. ఆయన నన్ను తెలుగు వారికి క్షమాపణ చెబుతూ ప్రెస్‌నోట్ ఇవ్వమన్నారు. నేను చేయని తప్పునకు ఎందుకు క్షమాపణ అడగాలని ఆయనతో వాదన వేసుకున్నా. తప్పు చేసినా, చేయకపోయినా.. సమస్యలు జటిలం కాకుండా ఉండటానికి క్షమాపణ చెప్పాల్సి వస్తుందని ఆయన నచ్చచెప్పారు. అప్పుడు తెలుగు ప్రజలకు వివరణ ఇచ్చాను. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా ఉందనుకున్నా. నన్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని నేను పట్టించుకోలేదు.
మీ నిర్మాతలు ఎలా స్పందించారు?
నా నిర్మాతలు ఆందోళన చెందారు. అది సాధారణమైన విషయమే! ఎందుకంటే నేను ఒకసారి జైలుకు వెళ్లిన తర్వాత ఎప్పుడు వస్తానో వారికి తెలియదు కదా! ఇదే విధంగా మళ్లీ జైలుకు వెళ్తానేమో కూడా తెలియదు కదా! అందువల్ల అందరికీ భయంగానే ఉంది. అంతేకాదు, సాధారణంగా సినీ రంగంలోని వారు ఎటువంటి వివాదాల జోలికి వెళ్లరు. ప్రస్తుతం నేను తెలుగులో ‘ఝాన్సీ’ అనే సీరియల్‌లో నటిస్తున్నా. ఆ నిర్మాణ సంస్థ వాళ్లు ‘ఇప్పుడు ఏం చేయాలా?’ అని ఆలోచిస్తున్నారు. వాళ్ల ఆందోళన నాకు అర్థమవుతోంది. నా తమిళ సినిమా షూటింగ్ మాత్రం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.
మూడు రోజుల జైలు జీవితం ఎలా ఉంది..?
ఆదివారం అరెస్ట్ చేశారు. బుధవారం బయటకు వచ్చేసా. నేను జైలు లోపలికి వెళ్లక ముందే అక్కడున్న వారందరికీ నేను వస్తున్నానని తెలిసిపోయింది. ‘‘స్టాలిన్ ఈమెను లోపలికి పంపాడట’’ అని వాళ్లు అనుకుంటూ ఉంటే విన్నా. అక్కడ నాకు ఒక స్పెషల్ సెల్ ఇచ్చారు. తొలిసారి వచ్చిన ఖైదీలందరూ దానిలోనే ఉంటారట. నాకు కొత్త పళ్లెం, కొత్త లోటా ఇచ్చారు. జైలు సిబ్బంది బాగా చూసుకున్నారు. ఇక్కడో విషయం చెప్పాలి. జైలు జీవితం సినిమాలో చూపించినట్లు ఉండదు. నేను అనేక సినిమాల్లో, సీరియల్స్‌లో జైలు సీన్లు చేశాను. కానీ నిజమైన జైలు వేరుగా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే... తమిళ ‘బిగ్‌బా్‌స’లోకి నేను ఒకసారి స్పెషల్ ఎంట్రీగా వెళ్లాను. ఆ సమయంలో ‘బిగ్‌బాస్ జైలు’లో ఉండాల్సి వచ్చింది. వాస్తవానికి అక్కడ కన్నా నిజమైన జైలులోనే బాగుంది. అక్కడ ప్రమాదకరమైన వారు ఉంటారు. అమాయకులు కూడా ఉంటారు. భర్తలు చేసిన నేరాలకు జైలుకు వచ్చిన భార్యలు కూడా ఉన్నారు. జైలుకు వెళ్తున్నప్పుడు మొదట్లో నాకు అవమానంగా అనిపించింది. కానీ స్నేహితులు... ‘‘నువ్వు నేరం చేసి జైలుకు వెళ్లలేదు.. ఒక సిద్ధాంతం కోసం వెళ్తున్నావు.. అన్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. నేను జైలుకు వెళ్లకపోతే నా తెలుగు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో తెలిసేది కాదు. ఆ విధంగా చూస్తే నాకు మంచే జరిగింది.
మీ కుటుంబ సభ్యుల స్పందనేమిటి?
వాళ్లకు నేను ఎలాంటి తప్పు చేయలేదని తెలుసు. అయితే వాళ్లను ఇబ్బంది పెట్టాననే భావన నన్ను ఇబ్బంది పెడుతోంది. హఠాత్తుగా నన్ను అరెస్ట్ చేయటంతో- నా దగ్గర ఉన్న ఖరీదైన కొన్ని వస్తువులు మా పక్కింటి వాళ్లకు ఇచ్చి దాచమన్నాను. మా అబ్బాయిని స్నేహితుల ఇంట్లో ఉంచాల్సి వచ్చింది. వాడు నన్ను- ‘‘నువ్వు ఏం చేయకపోతే నిన్ను పోలీసులు ఎందుకు తీసుకువెళ్లారు?’’ అని అడిగాడు. ‘‘కొన్ని విషయాల్లో అలా కూడా జరుగుతుంది’ అని సమాధానం చెప్పాను. కానీ జైలులో ఉన్న సమయంలో నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారనే ఆలోచనలు మనసులో తిరుగుతూనే ఉండేవి. వచ్చిన తర్వాత మా అబ్బాయి స్కూలుకి వెళ్తే అక్కడ వాళ్లు నా వ్యాఖ్యల గురించి అడిగారు. వాళ్లకు వివరణ ఇచ్చాను. ఇక్కడ ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పాలి. మా కుటుంబ సభ్యులను మీడియా మాత్రం వేధించలేదు. కేవలం నా గురించి వార్తలు ప్రచురించారంతే!
CVLN ప్రసాద్