Share News

ఆమె ‘కృషి’... నేలకు రక్ష..!

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:31 AM

నర్సుగా రోగులకు సేవ చేయాలనుకుంది మహారాష్ట్రకు చెందిన కావ్య ధోబలే. కానీ కొవిడ్‌ మరణాలతో కలత చెందిన ఆమె ప్రభుత్వోద్యోగాన్ని వదిలి సొంతూర్లో సేంద్రియ ఎరువు తయారీ సంస్థను ప్రారంభించింది. వినూత్నమైన ఆలోచనతో రైతులకు ఆదర్శంగా నిలిచిన కావ్య ధోబలే ప్రయాణం ఇది.

ఆమె ‘కృషి’...  నేలకు రక్ష..!

నర్సుగా రోగులకు సేవ చేయాలనుకుంది మహారాష్ట్రకు చెందిన కావ్య ధోబలే. కానీ కొవిడ్‌ మరణాలతో కలత చెందిన ఆమె ప్రభుత్వోద్యోగాన్ని వదిలి సొంతూర్లో సేంద్రియ ఎరువు తయారీ సంస్థను ప్రారంభించింది. వినూత్నమైన ఆలోచనతో రైతులకు ఆదర్శంగా నిలిచిన కావ్య ధోబలే ప్రయాణం ఇది.

కావ్యకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సేవ చేయడమంటే చాలా ఇష్టం. నర్సుగా శిక్షణ పొంది తన ఆశయం నెరవేర్చుకోవాలనుకుంది. జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో డిప్లొమా పూర్తి చేసి ముంబయిలోని లోకమాన్య తిలక్‌ మునిసిపల్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ జనరల్‌ హాస్పిటల్‌ (సియాన్‌ హాస్పిటల్‌)లో నర్సుగా చేరింది. తరవాత టాటా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తూ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసింది. ఓ ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరింది. కొన్నాళ్లకు తిరిగి సియాన్‌ హాస్పిటల్‌లో స్టాఫ్‌ నర్స్‌గా చేరింది. అదే సమయంలో దేశమంతటా కొవిడ్‌ వ్యాప్తి చెందింది. ఆసుపత్రికి ఎంతోమంది బాధితులు వచ్చేవారు. వారికి సేవ చేస్తూ తను కూడా కొవిడ్‌ బారిన పడింది. చావు అంచుల దాకా వెళ్లి బతికింది. అయినా రోగులకు సేవ చేయడం ఆపలేదు కావ్య. రోజుల వ్యవధిలో పెరుగుతున్న మరణాలు చూసి చలించిపోయింది. ఈ సంఘటనలన్నీ ఆమెను ఆలోచనలో పడవేశాయి.

కొవిడ్‌తో కలత చెంది...

ఆసుపత్రికి వస్తున్న కొవిడ్‌ బాధితులంతా బలహీనంగా ఉండడం గమనించింది కావ్య. శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ సరిగా పని చేయకపోవడంవల్లనే మరణాలు సంభవిస్తున్నాయని తెలుసుకుని దానికి కారణాలు అన్వేషించింది. తీసుకునే ఆహారంలో పోషకాలు లేకుండా రసాయన భరితంగా ఉండడంవల్లే శరీరానికి రోగనిరోధకశక్తి లభించడంలేదని తెలుసుకుంది. రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్దతులు అనుసరిస్తే ప్రజలకు రసాయన రహిత పోషకాహారం అందించవచ్చని గ్రహించింది కావ్య. వెంటనే తను చేస్తున్న ప్రభుత్వోద్యోగం వదిలి భర్తతో కలసి సొంత గ్రామానికి వచ్చేసింది.


నర్స్‌ ఉద్యోగాన్ని వదిలి...

కావ్య భర్త రాజేష్‌. సొంతూరు పుణెలోని దత్‌ఖిలేవాడి. వీరికి అక్కడ అయిదు గుంటల ఖాళీ స్థలం ఉంది. అక్కడ కావ్య స్థానిక రైతులందరినీ సమావేశపరచి సేంద్రియ వ్యవసాయ పద్దతులను అనుసరించాలని, అందులో ప్రధానంగా వర్మీ కంపో్‌స్టను ఉపయోగిస్తే నేల సారవంతమవడంతోపాటు పంట మొక్కలకు పోషకాలు అందుతాయని చెప్పడం ప్రారంభించింది. దాంతో రైతులందరూ ముక్త కంఠంతో ‘అదేదో మీరే చేసి చూపించండి’ అనడంతో కావ్య వర్మీ కంపోస్ట్‌ తయారీని ఆరంభించాలని నిర్ణయించుకుంది.

గత ఏడాది ‘కృషి కావ్య బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు ప్రారంభించింది కావ్య. రైతులకు వీటిని నేరుగా అందించడమే కాకుండా ప్రీ బుకింగ్‌ సర్వీస్‌ కూడా అందుబాటులో కి తెచ్చింది. రైతులందరూ వీటిని ఉపయోగించి, సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలన్నదే ఆమె ఆశ. వ్యాపారం ప్రారంభించిన మొదటి ఏడాదే ఆమె 24 లక్షల టర్నోవర్‌ సాధించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది.

శిక్షణ ఇస్తూ

వర్మీ కంపోస్ట్‌ తయారీకి సంబంధించి ట్రెయినింగ్‌ సెంటర్‌ను ప్రారంభించింది కావ్య. ఇందులో ఔత్సాహికులకు ఒక రోజు శిక్షణ ఉంటుంది. తనవద్ద శిక్షణ పొందిన 200 మంది ఇప్పటికే వర్మీ కంపోస్ట్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారని ఇది తనకెంతో ఆనందాన్నిస్తుందని చెప్పుకొచ్చింది. వ్యవసాయ పద్దతులను వివరిస్తూ యూ ట్యూబ్‌ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తోంది. పలువురు రైతులతో మాట్లాడి వారి అనుభవాలను ఈ ఛానెల్‌ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతోంది.

ఐదు వందలతో మొదలై...

‘వర్మీ కంపోస్ట్‌ తయారు చేయాలనుకున్నపుడు నేను పెద్దగా పెట్టుబడి పెట్టలేదు. ఒక చిన్న బెడ్‌లో ఒక కేజీ వానపాములను ఆవు పేడలో కలిపి పెట్టాను. దీనికి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఖర్చయింది. రెండు నెలల్లో వర్మీ కంపోస్ట్‌ తయారైంది. క్రమంగా పది బెడ్ల వరకు పెంచాం. మరో రెండు నెలల్లో అయిదు టన్నుల వర్మీ కంపోస్ట్‌ సిద్దమైంది. దీనిని ఉపయోగించిన స్థానిక రైతులు మంచి దిగుబడి సాధించడంతో క్రమంగా డిమాండ్‌ కూడా పెరిగింది. అప్పుడే ఈ పరిశ్రమను మరింత పెంచాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం మావద్ద 70 బెడ్లు ఉన్నాయి. ఒక్కో బెడ్‌లో 500 నుంచి 600 కేజీల వర్మీ కంపోస్ట్‌ సిద్దమవుతుంది. అలాగే వానపాములను కూడా విరివిగానే పెంచుతున్నాం.’

Updated Date - Nov 13 , 2024 | 06:31 AM