Share News

సూర్య నమస్కారం చేద్దాం

ABN , Publish Date - Dec 26 , 2024 | 06:28 AM

సూర్యుడు నమస్కార ప్రియుడు. కేవలం అయిదు నిమిషాలు నమస్కరిస్తే చాలు శరీరం, మనసు ఉత్తేజితం అవుతాయని పెద్దలు చెబుతుంటారు. సూర్యుడు ఉదయించగానే తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారం చేయాలి....

సూర్య నమస్కారం చేద్దాం

సూర్యుడు నమస్కార ప్రియుడు. కేవలం అయిదు నిమిషాలు నమస్కరిస్తే చాలు శరీరం, మనసు ఉత్తేజితం అవుతాయని పెద్దలు చెబుతుంటారు. సూర్యుడు ఉదయించగానే తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారం చేయాలి. అలాగే సాయంత్రం పూట పశ్చిమ దిక్కుకు నిలబడి సాధన చేయవచ్చు. యోగాలో సూర్య నమస్కారాన్ని పన్నెండు ఆసనాల ద్వారా చేస్తుంటారు. వీటిలో కనీసం మూడింటిని ప్రతిరోజూ సాధన చేస్తూ ఉంటే అనారోగ్యం దరిచేరదు. సూర్య నమస్కారంతో దినచర్య ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం!

జీర్ణ వ్యవస్థకు

సూర్య నమస్కారంలో భాగంగా శరీరాన్ని ముందుకు వంచడం, సాగదీయడం వల్ల పొత్తికడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. దీనితో కడుపులో పేరుకున్న వాయువులు బయటికి వెళ్లిపోతాయి. పేగుల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. పొట్టలో వేడి ఉత్పత్తి కావడం వల్ల ఆహారపదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం లాంటి సమస్యలు రావు.


బరువు తగ్గేందుకు

ఏ భంగిమలో సూర్య నమస్కారం చేసినప్పటికీ శరీరంలో శక్తి ఖర్చయిపోతుంది. జీవక్రియలు వేగవంతమవుతాయి. దీనివల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వులు పూర్తిగా కరిగిపోతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం మూడు భంగిమల్లో సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

శిరోజాలకు

సూర్య నమస్కారాల్లో భాగంగా తల వంచడం, తిప్పడం, ఎత్తడం వంటివి చేస్తాం. దీనివల్ల తల మీద ఉన్న చర్మానికి వేగంగా రక్తప్రసరణ జరిగి వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. దీంతో వెంట్రుకలు రాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలు తీరిపోతాయి. మంచి పోషణ అంది శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.


చర్మానికి

సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తున్నపుడు చెమట ద్వారా చర్మంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వచ్చేస్తాయి. దీంతో చర్మం తాజాగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తే చర్మానికి తగిన పోషణ అంది ముడతలు, గీతలు రావు. అంతగా తీవ్రతలేని సూర్యకిరణాల వేడివల్ల చర్మం మీద కొత్త కణాలు ఉత్పత్తి అయి మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. సాయంత్రం సమయాల్లో సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం అలసిపోయి మంచి నిద్ర పడుతుంది. తగినంత విశ్రాంతి పొందడం వల్ల శరీరం, మనసు ఉత్సాహంగా ఉండి ముఖానికి కొత్త కాంతి వస్తుంది.

నెలసరి సమస్యలకు

మహిళలు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల లిపిడ్‌ ప్రొఫైల్‌ మెరుగుపడి నెలసరి సమస్యలు తగ్గుతాయి. నీరసం, బలహీనత, పొత్తి కడుపు నొప్పి బాధించవు. ప్రతిరోజూ కనీసం పావుగంట శరీరానికి ఎండ తగిలేలా సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

Updated Date - Dec 26 , 2024 | 06:28 AM