Share News

Hair Tips : జుట్టు నెరుస్తోందా!

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:39 AM

చిన్న వయసులోనే జుట్టు నెరవడం సర్వ సాధారణమవుతోంది. దీనికి జన్యు పరమైన కారణాలున్నప్పటికీ వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, నిద్రలేమి వల్ల కూడా జుట్టు సహజత్వాన్ని కోల్పోయి రంగు మారుతోంది.

Hair Tips :  జుట్టు నెరుస్తోందా!

చిన్న వయసులోనే జుట్టు నెరవడం సర్వ సాధారణమవుతోంది. దీనికి జన్యు పరమైన కారణాలున్నప్పటికీ వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, నిద్రలేమి వల్ల కూడా జుట్టు సహజత్వాన్ని కోల్పోయి రంగు మారుతోంది. రసాయనాలతో పని లేకుండా ఇంటి వద్ద లభించే వాటితోనే జుట్టుని నల్లగా మార్చుకొనే చిట్కాల గురించి తెలుసుకుందాం!

తేయాకు: ఇందులో అధిక మొత్తంలో టానిన్లు ఉంటాయి. ఇవి వెంట్రుకలను సహజ రీతిలో నల్లబరుస్తాయి. ఒక బౌల్‌లో రెండు గ్లాస్‌ల నీళ్లు, రెండు చెంచాల టీ పొడి వేసి బాగా మరిగించండి. ఈ తేనీటిని చల్లార్చి ఒక స్ర్పే బాటిల్‌లో పోసి తల మొత్తం వెంట్రుకలకు పట్టేలా స్ర్పే చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే వెంట్రుకలు క్రమంగా నలుపు రంగులోకి మారతాయి.

రోజ్‌మేరీ: ఇందులో రక్త ప్రసరణను మెరుగు పరిచే లక్షణాలు ఉన్నాయి. ఒక గిన్నెలో మూడు చెంచాల రోజ్‌మేరీ ఆయిల్‌ వేసి దానికి రెండు చెంచాల కొబ్బరి నూనె లేదా జోజోబా ఆయిల్‌ లేదా ఆముదం కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడు మీద, తల చూట్టూరా రాసి వెంట్రుకల కుదుళ్లకు చేరేలా వ్రేళ్లతో మర్దన చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే వెంట్రుకల కుదుళ్లు బలంగా మారి నలుపు రంగుని ఉత్పత్తి చేస్తాయి.

ఉసిరి: తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో ఉసిరిని మించిన ఔషధం లేదు. ఇందులో ఇరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఉసిరిని ఆహారంలో చేర్చుకున్నా సౌందర్య సాధనంగా వాడినా మంచి ఫలితాలు వస్తాయి. నాలుగు చెంచాల ఉసిరి పొడికి తగినంత కొబ్బరి నూనె కలిపి పేస్టులా చేయాలి. దీనిని తలంతా పట్టించి వెంట్రుకల కుదుళ్లకు చేరేలా మర్దన చేయాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే వెంట్రుకలకు మంచి పోషణ అంది నల్లగా మారతాయి. ఇది చిన్న పిల్లల్లో కనిపించే బాల నెరుపుకు అద్భుతంగా పనిచేస్తుంది.


  • హెన్నా: ఇది మంచి ఆయుర్వేద ఔషధం. తలలో వేడిని తగ్గిస్తుంది. వెంట్రుకలకు అందమైన రంగునిస్తుంది. ఒక బౌల్‌లో అయిదు చెంచాల గోరింటాకు పొడి, తగినంత టీ డికాషన్‌, రెండు చుక్కల కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు కుదుళ్లనుంచి చివరి దాకా పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపూ లేదా కుంకుళ్లు ఉపయోగించకూడదు. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు రంగు మారతాయి.

  • మందారం: నిర్జీవంగా ఉండి చిక్కులు పడే వెంట్రుకలకు పోషణని, మృదుత్వాన్ని, మెరుపుని ఇస్తుంది మందారం. గుప్పెడు కుంకుడు కాయలను కొన్ని మందారం ఆకులతో కలిపి రుబ్బి ఆ మిశ్రమంతో తలస్నాం చేస్తూ ఉంటే వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి. ఒక కప్పు కొబ్బరి నూనె లేదంటే ఆముదంలో అయిదు మందారం పూలు వేసి బాగా కాచి వడకట్టాలి. ఈ నూనెని చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు కొంచెం నూనెను తీసుకొని తల వెంట్రుకలకు పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

Updated Date - Nov 17 , 2024 | 12:40 AM