Share News

లైబ్రరీ రెస్టారెంట్‌

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:56 PM

‘‘నాకు వివాహం జరిగేనాటికి ఆరో తరగతి చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పరిశీలనాశక్తి ఎక్కువ. పుస్తకాలు చదవడం ఇష్టం. స్కూల్‌ లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేశాను. కాలేజీకి వెళ్ళాలన్నది నా కోరిక... కానీ హైస్కూల్‌ దాటలేదు. అత్తవారింట్లో అడుగుపెట్టగానే నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా భర్త తాగుబోతు.

లైబ్రరీ రెస్టారెంట్‌

ఆజీచమ్‌ పుస్తకాంచమ్‌ హోటల్‌...

మహారాష్ట్రలోని ఓఝర్‌లో...

ముంబయి, ఆగ్రా నేషనల్‌ హైవేలో ఉన్న ఈ హోటల్‌లో...

ఆకలి తీర్చే వేడివేడి ఆహార పదార్థాలే కాదు, విజ్ఞాన దాహాన్ని తీర్చే పుస్తకాలూ సందర్శకుల్ని ఆహ్వానిస్తాయి.

ఆరో క్లాసుతో చదువు ఆపేసినా...

అక్షరాన్ని ప్రేమించే భీమ్‌బాయి జోంధాలే ఆలోచనకు ప్రతిబింబం ఇది.

ఆ హోటల్‌ గురించి, దాని ప్రారంభం వెనుక కథ గురించి డెబ్భై నాలుగేళ్ళ భీమ్‌బాయి చెబుతున్నారిలా...

‘‘నాకు వివాహం జరిగేనాటికి ఆరో తరగతి చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పరిశీలనాశక్తి ఎక్కువ. పుస్తకాలు చదవడం ఇష్టం. స్కూల్‌ లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేశాను. కాలేజీకి వెళ్ళాలన్నది నా కోరిక... కానీ హైస్కూల్‌ దాటలేదు. అత్తవారింట్లో అడుగుపెట్టగానే నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా భర్త తాగుబోతు. ఏ పనీ చేయకుండా ఊరకే తిరుగుతూ ఉండేవాడు. దాంతో ఇంటి పనులే కాదు, మాకున్న కొద్దిపాటి పొలం బాధ్యతలు కూడా నా మీద పడ్డాయి. మాకొక అమ్మాయి, తరువాత అబ్బాయి. నాకెలాగూ సరైన చదువులేదు... పొలాన్ని తాకట్టుపెట్టయినా పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనుకున్నాను. కానీ తాగుడుకూ, జూదానికీ నా భర్త ఆ పొలంలో చాలా భాగం అమ్మేశాడు. దాంతో మేము నడిరోడ్డున నిలబడాల్సి వచ్చింది. వేరే వాళ్ళ పొలంలో కొంతకాలం పనిచేశాను. బంధువులెవరూ మా వైపు చూసేవారు కాదు. మా అబ్బాయి న్యూస్‌ పేపర్లు వేస్తూ... చదువుకు ఫీజులు కట్టుకొనేవాడు. మా ఊళ్ళో మేము గొప్పగా బతకకపోయినా... గౌరవంగానే బతికాం. కానీ రోజురోజుకూ పరిస్థితులు దుర్భరంగా మారడంతో... వేరే చోటికి మారిపోదామని నిర్ణయించుకున్నాం. మిగిలిన కాస్త పొలాన్నీ అమ్మేసి... నాసిక్‌ నగరానికి వచ్చేశాం. కొన్నాళ్ళకు మా అబ్బాయి డిగ్రీ పూర్తి చేశాడు. కొందరు స్నేహితులతో మరాఠీ పుస్తకాల ప్రచురణ కంపెనీ పెట్టాడు. నేను చిన్నచిన్న పనులు చేస్తూ ఉండేదాన్ని. దానివల్ల పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. నేను, మా అమ్మాయి ఆలోచించి... చిన్న టీస్టాల్‌ ప్రారంభించాం. ‘‘ఆడవాళ్ళు ఇళ్ళలో ఉండాలి. వీధుల్లో టీలు అమ్ముకోడానికా సిటీకి వెళ్ళారు?’’ అంటూ బంధువులు ఎత్తిపొడిచారు. ‘‘మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కనీసం పలకరించలేదు. మా బతుకు మేం బతుకుతున్నాం. మీ సలహాలు అవసరం లేదు’’ అని గట్టిగా చెప్పాను. నా పిల్లలు నాకు అండగా నిలిచారు. కొద్దికొద్దిగా పొదుపుచేసిన డబ్బుతో... మా టీ స్టాల్‌ను టిఫిన్‌ సెంటర్‌గా మార్చాం. వంటకాలు రుచిగా, శుచిగా ఉండడంతో ఆదరణ పెరిగింది.

తింటున్నదేంటో తెలియనంతగా...

మా హోటల్‌కు వచ్చిన కస్టమర్లు ఏదైనా ఆర్డర్‌ ఇచ్చాక... అది వచ్చే లోపల వాళ్ళ ఫోన్‌లో నిమగ్నమైపోయేవారు. ఒక్కోసారి ఏం తింటున్నారనేది కూడా వాళ్ళు గమనించనంతగా మమేకం అయిపోయేవారు. అన్ని చోట్లా జరిగేది ఇదే! ‘ఇది చాలా చెడ్డ అలవాటు. కనీసం నా హోటల్‌లోనైనా ఈ అలవాటు మార్చడానికి ఏదైనా చెయ్యాలి’ అని ఆలోచించాను. ఈలోగా మా అబ్బాయి పబ్లిషింగ్‌ కంపెనీ మూతపడింది. చాలా పుస్తకాలు మిగిలిపోయాయి. వాటిని కట్టలు కట్టి తెచ్చి, మా హోటల్లో పెట్టాడు. తీరిక సమయాల్లో వాటిని చదువుతూ ఉంటే... ఎంతో హాయిగా అనిపించింది. పుస్తకాలు మనకు మంచి స్నేహితులు, ప్రతి సందర్భంలోనూ మనకు చక్కటి సహచరులు. కానీ జనం ఫోన్లలో కూరుకుపోవడంతో పుస్తకాలు చదివే అలవాటు బాగా తగ్గిపోయింది. దాన్ని మా హోటల్‌ ద్వారా ప్రోత్సహిస్తే బాగుంటుందనే సలహా నా పిల్లలకు నచ్చింది. హోటల్‌లో ఒక మూల స్టాండ్‌ ఏర్పాటు చేసి... వాటి మీద పుస్తకాలు పేర్చాం. వాటిని ఉచితంగా చదువుకోవచ్చని కస్టమర్లను ప్రోత్సహించాం. క్రమంగా పుస్తకాల సంఖ్య, వాటిని చదివే వారి సంఖ్య పెరిగింది. ఆర్డర్‌ చేసిన పదార్థాలు వచ్చేలోగా... పుస్తకంలో రెండో మూడో అధ్యాయాలు చదివేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఏర్పాటును చాలామంది మెచ్చుకున్నారు. ఇది ఆనోటా ఈనోటా విని... పుస్తక ప్రియుల రాక పెరిగింది. రెగ్యులర్‌ కస్టమర్లు కూడా ఎందరో. వారిలో కొందరు పుస్తకాలను విరాళంగా కూడా ఇస్తూ ఉంటారు.

పాతిక నుంచి అయిదు వేలకు...

ఒక స్థిరమైన బతుకు కోసం ఎంతో పోరాడాను. నా పిల్లలు బాగుండాలనే తపన నన్ను నడిపించింది. నా పిల్లలను చదివించుకోగలిగాను. గత పధ్నాలుగు ఏళ్ళలో... మా హోటల్‌ బాగా అభివృద్ధి చెందింది. పాతికతో మొదలైన పుస్తకాల సంఖ్య అయిదు వేలకు చేరింది. వాటిలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్‌ పుస్తకాలు ఉన్నాయి. దీనితోపాటు... పుస్తక పఠనం మీద ఆసక్తిని పెంచడానికి మహిళా దినోత్సవం, రిపబ్లిక్‌ డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో... ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. రోగులకు, వారితో వచ్చేవారికి కాలక్షేపం కోసం ఆసుపత్రుల్లో పుస్తకాలను బహుమతులుగా అందజేస్తున్నాం. ఇదంతా మా అబ్బాయి ఆలోచన. మందులు శరీరానికి స్వస్థత కలిగిస్తే... పుస్తకాలు మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. మా హోటల్లో ఎవరైనా పుస్తకాలు చదవడం చూస్తే... ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నేను చేసిన చిన్న ప్రయత్నం విజయవంతమయిందనే సంతృప్తి కలుగుతుంది. నాకు అంతకన్నా ఇంకేం కావాలి?’’

Updated Date - Apr 21 , 2024 | 11:56 PM