Share News

MovieDuration: ముచ్చటగా మూడు గంటలు

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:53 AM

ఒకప్పుడు సినిమా నిడివి ఎక్కువైతే నిర్మాతలు భయపడేవారు. సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించేవారు.

MovieDuration: ముచ్చటగా మూడు గంటలు

ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు. ‘అమ్మో...! ఇంత నిడివా’ అంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అక్కడ ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. మూడు గంటలు దాటితేనేం... సినిమా విజయవంతంగా నడుస్తోంది. ఆ మేరకు వసూళ్లు కూడా ‘తగ్గేదేలే’ అంటున్నాయి. వాస్తవానికి ఇంతటి రన్‌ టైమ్‌ టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. నాటి ‘దాన వీర శూర కర్ణ’ మొదలు నేటి ‘పుష్ప’ వరకు... 3 గంటలు, అంతకంటే ఎక్కువ నిడివితో వచ్చి... ఘన విజయం సాధించాయి.

కప్పుడు సినిమా నిడివి ఎక్కువైతే నిర్మాతలు భయపడేవారు. సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించేవారు. అందుకే తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని సీన్లను కట్‌ చేసి రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ మధ్యకాలంలో మూడు గంటల నిడివి కంటే ఎక్కువ ఉన్న సినిమాలు ఎన్నో వచ్చాయి. సూపర్‌ హిట్‌ అయ్యాయి. మరికొన్ని వస్తున్నాయి.

సాధారణంగా సినిమా నిడివి రెండున్నర నుంచి మూడు గంటలు ఉండటం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘దాన వీర శూర కర్ణ’ 3 గంటల 46 నిమిషాలు.

‘లవకుశ’ 3 గంటల 28 నిమిషాలు. పాతాళభైరవి 3 గంటల 15 నిమిషాలు, మిస్సమ్మ 3 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న సినిమాలే. ఆ తర్వాత పాండవ వనవాసం 3 గంటల 18 నిమిషాలు, అల్లూరి సీతారామరాజు 3 గంటల 7 నిమిషాలు, నిజం 3 గంటల 7 నిమిషాలు,

ఆర్‌ఆర్‌ఆర్‌ 3 గంటల 7 నిమిషాలు, అర్జున్‌ రెడ్డి 3 గంటల 6 నిమిషాలు. ఇప్పుడు ‘పుష్ప-2’ 3 గంటల 20 నిమిషాలతో విడులైంది.

బాలీవుడ్‌లోనూ...

హిందీలో సైతం ఎక్కువ నిడివితో విడుదలై విజయం సాధించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో మేరానామ్‌ జోకర్‌ ఒకటి. ఈ సినిమా రన్‌టైం 4 గంటల 15 నిమిషాలు. అప్పట్లో ఈ సినిమాకు రెండు ఇంటర్వెల్స్‌ ఇచ్చారు. కార్గిల్‌ యుద్ధం నేపథ్యంగా తీసిన ‘ఎల్‌ఓసీ- కార్గిల్‌’ నాలుగు గంటల నిడివిని దాటింది. అదేవిధంగా అమీర్‌ఖాన్‌ నటించిన ‘లగాన్‌’ మూవీ రన్‌టైమ్‌ 3 గంటల 44 నిమిషాల నిడివితో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రేక్షకులు బోర్‌గా ఫీలవకుండా చేయగలిగితే చాలు..నిడివి ఎంతున్నా వారు పట్టించుకోరు అని ఈ చిత్రాలు నిరూపించాయి. ఆ తరవాత కారణాలు ఏమైతేనేమీ సినిమాల నిడివి సాధారణ స్థాయికి చేరుకున్నాయి.

తెలుగులో రంగస్థలం, మహానటి, అర్జున్‌ రెడ్డి, ఆదిపురుష్‌ వంటి సినిమాలతో మళ్లీ మూడు గంటల నిడివి గల చిత్రాలు విడుదలవసాగాయి. ఈ చిత్రాలన్నింటిలో చక్కటి విజువలైజేషన్‌, ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌, గ్రాఫిక్‌ ఎఫెక్ట్స్‌ని హాలివుడ్‌ స్థాయిలో వినియోగించారు. తద్వారా ఆడియన్స్‌కు మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించగలిగారు. అందువల్ల ఈ సినిమాల నిడివి కాస్త ఎక్కువగానే ఉంటోందని దర్శకనిర్మాతలు అంటున్నారు. నేటి ట్రెండింగ్‌కు తగ్గట్టు క్వాలిటీలో గానీ, క్వాంటిటీలో గానీ ఎక్కడా రాజీ పడకుండా తీసిన సినిమాలకే ఇటు థియేటర్లలో, అటు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లలో డిమాండ్‌ ఉంటుందని వారు చెబుతున్నారు.


ఓటీటీల రాకతో...

ఓటీటీల రాకతో చలన చిత్ర నిర్మాణ స్వరూపం పూర్తిగా మారిపోయింది. గ్లోబల్‌ కంటెంట్‌ లోకల్‌ అయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఎన్నో చిత్రాలు ప్రేక్షకుడి అరచేతిలో ఆవిష్కృతమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వెబ్‌సిరీ్‌సలే ఎక్కువగా బ్లాక్‌బస్టర్‌ అవుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్‌, మీర్జాపూర్‌, స్కామ్‌ 1992 నుంచి మొదలుకుని రీసెంట్‌గా రీలిజైన సిటాడెల్‌ వరకు చెప్పుకుంటూ పోవచ్చు.

ఈ వెబ్‌ సిరీ్‌సలతో ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులొచ్చాయి. సినిమా నిడివి పెరిగినా సరే...తమకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటేనే ఆదరిస్తున్నారు. స్టార్‌ పవర్‌ కంటే కంటెంట్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కంటెంట్‌ బాగుండి, తెరపై కథను ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంటే మూడు గంటలైనా సరే... ప్రేక్షకులు ముచ్చపడి చూస్తారని చాలా సందర్భాల్లో రుజువైంది.

అలా ప్రేక్షకుడిని థియేటర్‌లో మూడు గంటలు ముచ్చటగా కూర్చుండగలిగేలా చేయడం దర్శకుడి శైలి, అతని విజన్‌పై ఆధారపడి ఉంటుంది.


తెలుగు చిత్రాలు

తెలుగులో రంగస్థలం, మహానటి, అర్జున్‌రెడ్డి, ఆదిపురుష్‌ నుంచి ఇటీవల

విడుదలైన పుష్ప-2 సినిమాలు రెండున్నర గంటల నిడివిని దాటాయి. నిడివి పెరిగినంత మాత్రాన ప్రేక్షకులు ఆస్వాదించలేరనే వాదన సరైంది కాదని ఈ సినిమాలు నిరూపించాయి.

అర్జున్‌రెడ్డి

2017లో విడుదలైన ఈ మూవీ నిడివి 3 గంటల

2 నిమిషాలు. విజయ్‌ దేవరకొండ

కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రమిది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.

గద్దలకొండ గణేశ్‌

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ మూవీ 2019లో విడుదలైంది. హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో 2.52 నిమిషాలతో తెరకెక్కింది.

రంగస్థలం

రామ్‌ చరణ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. 2 గంటల 54 నిమిషాల నిడివితో బ్లాక్‌బస్టర్‌ అయ్యింది.

RRR

రామ్‌చరణ్‌, ఎన్టీయార్‌ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. 3 గంటల 6 నిమిషాల నిడివిగల ఈ సినిమా 2022లో విడుదలైంది.

ఆదిపురుష్‌

ప్రభాస్‌ నటించిన ఈ సినిమా 2023లో విడుదలైంది. దీని నిడివి 2 గంటల 59 నిమిషాలు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు.

పుష్ప

అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా. 2021లో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 59 నిమిషాలు.

Updated Date - Dec 08 , 2024 | 06:11 AM