Share News

సమదృష్టి, సమతుల్యత

ABN , Publish Date - May 16 , 2024 | 11:48 PM

బంగారాన్ని, రాయినీ, మట్టినీ ఒకే మాదిరిగా చూడాలని, అటువంటి వాడే జ్ఞాని, యోగి అని ‘జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా...’ అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించాడు. అపరిచితులను, స్నేహితులను, శత్రువులను, బంధువులను, ద్వేషించేవారినీ, మంచివారినీ, చెడ్డవారినీ ఒకే విధంగా చూసేవాడే యోగీశ్వరుడని ‘సుహృన్మిత్రా ర్యుదాసీనా...’ అనే శ్లోకంలో చెప్పాడు.

సమదృష్టి, సమతుల్యత

గీతాసారం

బంగారాన్ని, రాయినీ, మట్టినీ ఒకే మాదిరిగా చూడాలని, అటువంటి వాడే జ్ఞాని, యోగి అని ‘జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా...’ అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించాడు. అపరిచితులను, స్నేహితులను, శత్రువులను, బంధువులను, ద్వేషించేవారినీ, మంచివారినీ, చెడ్డవారినీ ఒకే విధంగా చూసేవాడే యోగీశ్వరుడని ‘సుహృన్మిత్రా ర్యుదాసీనా...’ అనే శ్లోకంలో చెప్పాడు. మొదట ఆయన వస్తువులతో ప్రారంభించాడు. వాటిని సమానంగా చూడమన్నాడు. తరువాత మన జీవితాల్లో తటస్థపడే మనుషుల దగ్గరకు వచ్చాడు.

మిత్రులను, విరోధులను, మంచివారినీ, చెడ్డవారినీ, అపరిచితులనూ, స్నేహితులనూ తేడాలు లేకుండా చూడాలన్నాడు.

మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, వారి మీద మనం వేసిన ముద్రలు... మంచిగానో, చెడ్డగానో మనం పరిగణించేవారిపట్ల మన ప్రవర్తనలు... వీటన్నిటినీ సూచిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనకు మిత్రుడైన వ్యక్తి వేరొకరికి శత్రువవుతాడు, ఈ రోజు మనకు స్నేహితుడైన వాడే రేపు శత్రువుగా మారుతాడు.

‘‘ఆ మనుషులతో నాకు చేదు అనుభవం ఉంది, వారు గౌరవానికి ఏమాత్రం తగినవాళ్ళు కాదు. అందుకే వారితో సంబంధ బాంధవ్యాలు తెంచుకున్నాను’’ అనే ఫిర్యాదు మనకు పదే పదే వినిపిస్తూ ఉంటుంది. వేరొకరిపై మనం ఏర్పరచుకొనే అభిప్రాయాలకు... వారికీ, మనకు మధ్య ఎదురైన సంఘటనలు లేదా పక్షపాతాలు కారణమవుతాయి.


ఎదుటివారిపై ముద్రలు వేయడం మానాలనీ, వారిని మనతో సమానంగా పరిగణించాలని శ్రీకృష్ణుడు సూచించాడు. దీనిలో వ్యక్తులు, వారి మధ్య సంబంధాల విషయంలో ఒక స్పష్టమైన సందేశం ఉంది. అది ఏమిటంటే... మనుషులను, వారితో సంబంధాలను వినిమయ వస్తువులుగా పరిగణించకూడదు.

పై శ్లోకాలలో ‘సమదృష్టి’ గురించి చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ‘సమతుల్యత’ గురించి వివరిస్తూ... ‘‘అపరిమితంగా తినేవాడికీ, ఏమాత్రం తిననివాడికీ, అతిగా నిద్రపోయేవాడికీ, నిద్రపోని వాడికీ ‘యోగం’ సిద్ధించదు’’ అని ‘నా త్యశనతస్తు యోగోస్తిః’ అనే శ్లోకంలో హెచ్చరించాడు.

ఇక్కడ తినడం, నిద్ర తదితరాలను ఇంద్రియ మార్గాలకు ఉపమానంగా తీసుకోవచ్చు. మనం మనస్సును, నాలుకను సంతృప్తి పరచడానికి తింటాం తప్పితే శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రం కాదు. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.

అదే విధంగా ఇతరుల గురించి పరుషంగా, చెడ్డగా మాట్లాడడం, ఇంద్రియ జ్ఞానాలను విపరీతంగా ఉపయోగించడం దుఃఖానికి కారణం అవుతుంది.

అందుకే... ‘‘ఇంద్రియాల విషయంలో సమతుల్యత ప్రధానం’’ అని కృష్ణుడు తెలియజేశాడు. పరిమితమైన ఆహారం, పరిమితమైన నిద్ర, మితమైన జాగరణ, మితమైన కర్మ, మితమైన సంచారం... వీటిని అనుసరించే వ్యక్తి యోగమార్గంలో దుఃఖాన్ని పోగొట్టుకోగలడని బోధించాడు.

కె. శివప్రసాద్‌

ఐఎఎస్‌

Updated Date - May 16 , 2024 | 11:48 PM