Makeup : కనువిందైన అందం
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:13 AM
మేక్‌పలో భిన్నమైన పోకడలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కాలానుగుణంగా మారిపోతున్న ఈ పోకడలను సందర్భానికి తగ్గట్టు అనుసరిస్తూ ఉండాలి.
మేక్‌పలో భిన్నమైన పోకడలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కాలానుగుణంగా మారిపోతున్న ఈ పోకడలను సందర్భానికి తగ్గట్టు అనుసరిస్తూ ఉండాలి. ప్రస్తుతం వాడుకలో ఉన్న మేకప్ పోకడలు ఇవే!
గ్లామర్ మేకప్
మందపాటి పెదవులు, మెరుపులీనే చర్మం, తీర్చిదిద్దిన కళ్లు ఈ మేకప్ రహస్యాలు. ప్రత్యేకించి సంప్రదాయ వస్త్రధారణకు అద్భుతంగా నప్పే ఈ తరహా మేక్‌పలో ఐషాడోల కోసం భిన్నమైన రంగులను ఎంచుకుంటూ ఉంటారు. ఎమరాల్డ్ గ్రీన్, శాఫైర్ బ్లూ, రూడీ రెడ్ రంగుల ఐషాడోలు ఈ తరహా మేక్‌పలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే కళ్లలోని లోపలి కొలకులకు బంగారం లేదా రాగి రంగు ఐషాడో అద్దుకోవడం వల్ల గ్లామర్ రెట్టింపవుతుంది.
లిప్ కలర్స్
ముదురు రంగు లిప్‌స్టిక్స్ ఊపందుకున్నాయి. డీప్ ప్లమ్, క్లాసిక్ రెడ్, వైబ్రెంట్ కోరల్ రంగుల లిప్‌స్టిక్‌లతో మేక్‌పకు రెట్టింపు ఆకర్షణ దక్కుతుంది. సంప్రదాయ వేడుకలకు బోల్డ్ లిప్‌స్టిక్స్ చక్కగా నప్పుతాయి. అంతకంటే సున్నితమైన రంగులను ఇష్టపడేవారు టింటెడ్ లిప్‌బామ్ లేదా గ్లాస్ వాడుకోవచ్చు.
కోల్ రిమ్మ్‌డ్ ఐస్
నల్లని కాటుక కళ్లకు రోజులు చెల్లాయి. టీల్, పర్పుల్, గోల్డ్ లైనర్ల హవా మొదలైంది. ఈ లైనర్లకు మందపాటి కృత్రిమ కనురెప్పలను జోడించి కవ్వించే కళ్లను తీర్చిదిద్దుకునే ధోరణి మొదలైంది. అయితే ఈ లైనర్ల అందం చెక్కుచెదరకుండా ఉండడం కోసం తడికి కారిపోకుండా ఉండే ఐలైనర్స్‌నే ఎంచుకోవాలి.