Makeup : అందమైన అతిథుల్లా కనిపించాలంటే...
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:57 AM
వేడుకలకు అతిధిగా హాజరయ్యే సమయంలో మేకప్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
వేడుకలకు అతిధిగా హాజరయ్యే సమయంలో మేకప్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అటు ఎబ్బెట్టుగా ఉండకుండా, ఇటు పేలవంగా ఉండకుండా తగు మాత్రం ఆకర్షణీయంగా కనిపించేలా మేకప్ చేసుకోవాలి.
సన్‌స్ర్కీన్: మేకప్ ముందు మాయిశ్చరైజర్, సన్‌స్ర్కీన్‌లను అప్లై చేసుకోవాలి. ఈ రెండింటితో చర్మం పొడిబారకుండా ఉండడంతో పాటు, వేడుకల్లో లైట్ల వెలుగుకు కమిలిపోకుండా చర్మానికి రక్షణ దక్కుతుంది.
రెండు ఫౌండేషన్లు: వేడుకల్లో తీసే ఫొటోల్లో ముఖం అవసరానికి మించి వెలిగిపోకుండా ఉండాలంటే, రెండు భిన్నమైన ఫౌండేషన్లు వేసుకోవాలి. ఇందుకోసం మ్యాట్, సాఫ్ట్ గ్లోయీ రకాలకు చెందిన ఫౌండేషన్లను కలిపి వేసుకోవాలి. జిడ్డు చర్మమైతే, నుదురు, ముక్కు, చుబుకం మీద మ్యాట్ ఫౌండేషన్, మిగతా ముఖం మొత్తం డ్యూయీ ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. తర్వాత పౌడర్ అద్దుకోవాలి.
బ్లష్ కీలకం: పగటి వేళ వేడుకలకు హాజరయ్యేటప్పుడు ముదురు రంగు బ్లష్‌లకు బదులుగా, సహజసిద్ధంగా కనిపించే లేదా గులాబీరంగు బ్లష్ ఎంచుకోవాలి. బుగ్గలతో పాటు, కొద్దిగా ముక్కు, చుబుకం మీద కూడా బ్లష్‌ను అద్దుకోవాలి.
ఐ షాడో ఇలా: అందరి చూపులూ ముఖం మొత్తంలో కళ్లూ, పెదవుల మీదే ఉంటాయి. కాబట్టి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. పగలైనా, రాత్రైనా ముదురు రంగు షాడోలకు దూరంగా ఉండాలి. పేస్టెల్, సాఫ్ట్ మెటాలిక్ ఐ షాడోలనే ఎంచుకోవాలి. ముడతలు పడకుండా ఉండడం కోసం క్రీమ్‌కు బదులుగా పౌడర్ రూపంలోని ఐ షాడోలనే ఎంచుకోవాలి. పౌడర్ ఐ షాడోలు మేక్‌పలో చక్కగా కలిసిపోయి, ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయి.
లవ్లీ లిప్‌స్టిక్: ఎరుపు, ప్లమ్, మెరూన్ మొదలైన రంగు లిప్‌స్టిక్స్ వేడుకలకు బాగుంటాయి. అలాగే ఐ షాడోకు నప్పే లిప్‌స్టిక్ ఎంచుకోవడం మర్చిపోకూడదు. గ్లిట్టర్, పేస్టెల్, మోనోటోన్ రంగు లిప్‌స్టిక్స్ పగటి వేడుకులకు సూటవుతాయి. మెటాలిక్, ముదురు రంగు షేడ్స్ రాత్రి వేడుకలకు బాగుంటాయి.