అలాగైతేనే జీవితం పరిపూర్ణం
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:51 AM
ధ్యానం ఒక క్రియ కాదు, ‘ఏదీ చేయకపోవడం’ అనే కళనే ధ్యానం అంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ధ్యానం తాలూకు అనుభూతి కలుగుతుంది.
ధ్యానం ఒక క్రియ కాదు, ‘ఏదీ చేయకపోవడం’ అనే కళనే ధ్యానం అంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ధ్యానం తాలూకు అనుభూతి కలుగుతుంది. ఏదైనా పనిలో మనం నిమగ్నమైనప్పుడు మనస్సు అలిసిపోతుంది. ఎందుకంటే ఏకాగ్రత, ఆలోచన లేదా ఎలాంటి మానసిక కార్యకలాపమైనా... మన శారీరక శక్తిని హరించి, అలసట కలిగిస్తాయి. ధ్యానం మిమ్మల్ని అలసిపోనివ్వదు. అంతేకాదు. గాఢమైన విశ్రాంతిని కూడా అందిస్తుంది. ధ్యానం చేసే సమయంలో... మనం పంచేంద్రియాల ప్రభావానికి దూరంగా ఉంటాం. అంటే చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం లాంటి పనులు చేయం. ధ్యానం నుంచి మనకు లభించే విశ్రాంతి... గాఢ నిద్రలా ఉంటుంది. కానీ ధ్యానం అనేది నిద్ర కాదు. అన్ని పనులను విడిచిపెట్టి విశ్రాంతి తీసుకోవడమే ధ్యానం.
ఆ తత్త్వమే చైతన్యశక్తి...
మనిషి చైతన్య శక్తిలో నాలుగు స్థితులు ఉంటాయి. అవి: జాగ్రదావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, ధ్యానావస్థ. నిద్రలో ఉన్నప్పుడు మీరు మేలుకొనే ఉంటారు, కానీ గాఢమైన విశ్రాంతిలో ఉంటారు. మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే మీరు ధ్యానం చేయగలరు. శబ్దం నుంచి మౌనం వరకు, కదలిక నుంచి నిశ్చలత వరకూ చేసే ప్రయాణమే ధ్యానం. పనులు, ధ్యానం... ఈ రెండూ ఒకదానికొకటి భిన్నంగా అనిపించినప్పటికీ, అవి ఒకదానికి ఒకటి పూరకాలు. ఈ ప్రపంచంలో అన్నీ మారుతున్నాయని మనం గమనిస్తూ ఉంటాం. మనలో మారనిది ఏదో ఉంది. మనలో స్థిరంగా ఉండే తత్త్వాన్నే ‘ఆత్మ’ లేదా ‘చైతన్యశకి’్త ఉంటారు. మన చైతన్య శక్తిలో ఎప్పుడూ స్థిరంగా ఉండే ఆ తత్త్వం వైపు మనం చేసే ప్రయాణమే ధ్యానం.
దేన్నీ వ్యతిరేకించకండి...
మనసులో కోరికలు ఉంటే మనం ధ్యానం చెయ్యలేం. అందుకే ‘‘అన్ని రకాల సంకల్పాలను విడిచిపెట్టేవరకూ మనస్సు శాంతించదు’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఉదాహరణకు... మీరు నిద్రపోయేముందు లైటు ఆపాలని అనుకున్నారు. కానీ ఆపలేదు. మీరు నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా... లైటు ఆపనిదే నిద్రపోలేరు. మీ మనస్సు లైటు ఆపడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ఇసుక రేణువు మీ కంటిలో పడితే మీరు పూర్తిగా కళ్ళు మూసుకోలేరు, అలాగని కళ్ళు పూర్తిగా తెరిచి ఉంచలేరు. అదే విధంగా మనసులో ఉండే ఆలోచన మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. అందుకే మనస్సును శాంతిపజేయడానికి వైరాగ్యం అవసరం. ఏదో ఒక రోజు మృత్యువు రావడం అనివార్యం. మృత్యువుపట్ల జ్ఞానం మనసును శాంతింపజేస్తుంది, వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. వైరాగ్యం గాఢమైన ధ్యానంలోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం, సమతుల్యమైన ఆహారం, వివేకం... ఇవన్నీ ధ్యానం చక్కగా జరగడానికి సాయపడతాయి. చాలామంది ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి శబ్దాలు ఉండకూడదని అనుకుంటారు. ఇది సరైన అవగాహన కాదు. ధ్యానం చేసేటప్పుడు శబ్దాలు వినిపిస్తే... వాటిని జాగ్రత్తగా వినండి. మీరు దేనినైతే ఎక్కువగా వ్యతిరేకిస్తారో... అది మరింత ప్రబలమై మిమ్మల్ని బాధపెడుతుంది. కాబట్టి ధ్యానం చేసే సమయంలో దేనినీ వ్యతిరేకించకండి.
ఆహారాల్లో మూడు రకాలు
ధ్యానం బాగా జరగాలంటే ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం మనసును స్థిరంగా ఉంచుతుంది. ధ్యానాన్ని సులభతరం చేస్తుంది. మనం తీసుకొనే ఆహారం కూడా ధ్యానంపై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో మూడు రకాలు ఉంటాయి, అవి: సాత్విక, రాజసిక, తామసిక ఆహారం. తామసిక ఆహారం శరీరంలో అలసటను, మగతను, జడత్వాన్ని కలిగిస్తుంది. శరీరంలో తమస్సు ఎక్కువగా ఉంటే... మీకు ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తుంది. శరీరంలో రజస్సు ఎక్కువగా ఉంటే మనసు స్థిరంగా ఉండదు. చిన్న విషయాలకే ఎక్కువ బాధ లేదా అతిగా సంతోషం కలుగుతాయి. రజస్సు అసమతుల్యంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు వస్తాయి. మనసు శాంతంగా ఉండదు. శరీరం స్థిరంగా ఉండదు. అలా ఉంటే ధ్యానం సరిగ్గా జరగదు. దీని అర్థం మీరు రాజసిక ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని కాదు. మనం ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఒకే స్థితిలో ఉంటే జీవితాన్ని ఆస్వాదించలేం. కొంచెం రజస్సు ఉండే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ రజస్సు ఎక్కువైతే సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తేలికగా ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. త్రిదోషాల నుంచి శరీరానికి విముక్తి కలిగించి, ధ్యానం బాగా కొనసాగడానికి సహాయపడుతుంది. ధ్యానం వల్ల జీవితంలో... భౌతిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో పరిపూర్ణత వస్తుంది. అంటే జీవితం పరిపూర్థం అవుతుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానాలకు సంబంధించిన జ్ఞానం భారతదేశంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం మన అదృష్టం. ధ్యానాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి.
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
మనం నడవడం, పని చేయడం, మాట్లాడడం, చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, ఆలోచించడం మానేసినప్పుడు మాత్రమే నిద్ర వస్తుంది. అయితే శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం. ఆహారం జీర్ణం కావడం, రక్త ప్రసరణ తదితర కొన్ని అసంకల్పిత కార్యకలాపాలు నిద్రలో కూడా కొనసాగుతాయి. అందుకే నిద్రలో సైతం మనకు పూర్తి విశ్రాంతి కలగదు.