Share News

మోడ్రన్‌ మంగళసూత్రాలు

ABN , Publish Date - Dec 15 , 2024 | 09:48 AM

‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’... వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టమిది. మంగళసూత్రం... భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం క్రమక్రమంగా ఆధునికతను అద్దుకుంటోంది.

మోడ్రన్‌ మంగళసూత్రాలు

‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’... వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టమిది. మంగళసూత్రం... భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం క్రమక్రమంగా ఆధునికతను అద్దుకుంటోంది. మిగతా ఆభరణాల్లాగే మంగళసూత్రాలు కూడా మోడ్రన్‌గా మారుతున్నాయి. నవతరానికి నచ్చేట్టుగా రూపు మారుతున్న నల్లపూసల నయా ట్రెండ్‌ విశేషాలివి...

కొత్తతరానికి మంగళసూత్రం కూడా ఓ ఆభరణం లాగే కనిపిస్తోంది. చాలామంది వివిధ కారణాల వల్ల మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడుతుంటే... మరికొందరు వివిధ రూపాల్లో దాన్ని ధరించేందుకు ఇష్టపడుతున్నారు. మగువల మనసును అర్థం చేసుకుని మార్కెట్‌ వర్గాలు మొత్తానికి మంగళసూత్రాన్ని కూడా మోడ్రన్‌గా మార్చేశాయి. కేవలం బంగారం, నల్లపూసలతోనే కాకుండా రకరకాల మోడల్స్‌, మెటల్స్‌తో వీటిని తయారుచేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను కొందరు విమర్శిస్తున్నప్పటికీ, మార్కెట్లో రూపుమార్చుకుంటున్న మంగళసూత్రాల హవా కొనసాగుతోంది.


- మగువలు మంగళసూత్రాన్ని మెడలో ధరిస్తారనే తెలుసు. కానీ మోడ్రన్‌ వివాహితల కోసం బ్రేస్‌లెట్లు, చెవి దుద్దులు, ఉంగరాలు, లాకెట్ల కాంబినేషన్‌ కూడా వచ్చేసింది. బంగారం లేదా వెండి, నల్ల పూసలతో బ్రేస్‌లెట్‌ చేయించుకొని, లక్కీస్టోన్‌, భర్త పేరు లేదా పేరులోని మొదటి అక్షరం, లవ్‌ సింబల్‌, స్టోన్స్‌ లేదా ముత్యాలు పొదిగినవి, అదృష్ట సంఖ్య, రాశి చక్రం.. ఇలా కావాల్సిన విధంగా విభిన్న రకాల లాకెట్స్‌ను దానిని జత చేసుకోవచ్చు.

- బ్రేస్‌లెట్‌ నల్లపూసల్లో... సింగిల్‌ చైన్‌, రెండు మూడు చైన్లున్నవి, బ్రేస్‌లెట్‌ చుట్టూ మువ్వలు వేలాడేలా ఉన్నవి తదితర డిజైన్లు కూడా మార్కెట్లో కొలువుదీరాయి.


book7.jpg

- మంగళసూత్ర బ్రేస్‌లెట్లే కాదండోయ్‌... వాటికి కొనసాగింపుగా నల్లపూసల చెవిపోగులు, ఉంగరాలు నయా ఫ్యాషన్‌గా అలరిస్తున్నాయి. ఫ్యాషన్‌ ట్రెండ్‌కు అనుగుణంగా వజ్రాలు, ముత్యాలు లేదా ప్లాటినమ్‌తో వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

- ప్రస్తుతం ‘ఎవిల్‌ ఐ’ మంగళసూత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. ఇది చెడు శక్తి నుంచి రక్షించడమే గాక, అదృష్టం కూడా తెస్తుందని నమ్ముతున్నారు. ఇక ‘ఇన్ఫినిటీ’ మంగళసూత్రం... ఏడు జన్మల బంధాన్ని సూచిస్తుంది. భర్తపై ప్రేమను వ్యక్తపరచడానికి దీన్ని ధరిస్తున్నారు.


- మంగళసూత్రం అంటే కేవలం కొంగుచాటున దాచుకునేలా కాకుండా... సంప్రదాయం, ఆధునిక మేళవింపుగా తయారవుతున్న వీటిని మిగతా ఆభరణాల్లానే స్టయిల్‌గా ప్రదర్శిస్తున్నారు. పైగా భాగస్వాముల మధ్య నిబద్ధత, ఐక్యత, ప్రేమకు చిహ్నాలుగా తయారవు తున్నాయి. ఎంచుకునే మంగళసూత్రం... వ్యక్తిత్వాన్ని, అభిరుచిని ప్రతిబింబిస్తుంది. క్లాసిక్‌ నుంచి కాంటెంపరరీ వరకు అనేక రకాల డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే మహిళలకు పూర్తిగా అనుకూలమైనవిగా చెబుతున్నారు.

- సాధారణ మంగళసూత్రం ధర, అందులో ఉపయోగించిన బంగారాన్ని బట్టి రూ. 2 లక్షలకు పైగా ఉంటుంది. అదే బ్రాస్‌లెట్‌ మంగళసూత్రం అయితే రూ. 15 వేల నుంచి లక్ష వరకు ఉంటున్నాయి. కమ్మలు, ఉంగరం నల్లపూసల ధర సుమారు రూ. 10 వేలున్నాయి. అయితే ఈ ధరలు ఆయా బ్రాండ్లు, అందులో ఉపయోగించిన లోహాన్ని (మెటల్‌) బట్టి మారుతుంటాయి.


- ఉంగరం మంగళసూత్రాలు... రాజ్‌వాడి, మినిమిలిస్టిక్‌, ఆర్ట్‌ డెకో, విక్టోరియన్‌, మోడరన్‌- రెట్రో, ఆర్నేట్‌ వంటి మోడల్స్‌లో లభిస్తున్నాయి.

- సాధారణ నల్లపూసలు అయితే జుట్టు లేదా బట్టలకు చిక్కుకుని తెగిపోతుంటాయి. కానీ వీటితో ఆ ఇబ్బందేమీ ఉండదు. పైగా సింపుల్‌గా, సౌకర్యవంతంగా ఉంటాయి. కావాల్సిన విధంగా కస్టమైజ్డ్‌ చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి వివాహ వేడుకల్లో అనూహ్య మార్పులు వచ్చినట్టే, మంగళసూత్రాలు కూడా మోడ్రన్‌గా మారడం మార్కెట్‌ మాయే అనడంలో సందేహం లేదు.

Updated Date - Dec 15 , 2024 | 09:48 AM