Naba Natesh: నిరీక్షణ తప్పదని అర్థమైంది
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:00 AM
హీరోయిన్ అంటే కేవలం అందంగా ఉంటే చాలనుకొనే రోజులు పోయాయి. సోషల్ మీడియా యుగంలో అందంతో పాటు చదువు, వ్యక్తిత్వం లాంటి వాటిని కూడా ప్రేక్షకులు అంచనా వేసేస్తున్నారు.
హీరోయిన్ అంటే కేవలం అందంగా ఉంటే చాలనుకొనే రోజులు పోయాయి. సోషల్ మీడియా యుగంలో అందంతో పాటు చదువు, వ్యక్తిత్వం లాంటి వాటిని కూడా ప్రేక్షకులు అంచనా వేసేస్తున్నారు. అందుకే బాగా చదువుకున్నవారు కూడా సినీరంగంలోకి రావటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి వారిలో నభా నటేష్ ఒకరు. ‘స్వయంభూ’, ‘నాగబంధం’ అనే రెండు భారీ సినిమాల్లో నటిస్తున్న నభా నటేష్‌ను ‘నవ్య’ పలకరించింది.
మీరు టాలీవుడ్‌లో ప్రవేశించి ఐదేళ్లు అవుతున్నట్లుంది.
మీ సినిమా ప్రయాణం ఎలా సాగుతోంది? బాగా సాగుతోంది.?
ప్రస్తుతం ‘స్వయంభూ’, ‘నాగబంధం’ అనే రెండు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నా. ఈ రెండు సినిమాల్లోను నాకు చాలా మంచి పాత్రలు లభించాయి. ఇవి నేను ఇప్పటిదాకా చేసిన పాత్రల కన్నా భిన్నమైనవి. ఈ రెండూ విడుదలయిన తర్వాత నా కెరీర్ వేరే విధంగా ఉంటుందని ఆశిస్తున్నా.
ఈ ప్రయాణంలో సక్సెస్ ఫార్ములా ఏమిటో తెలుసుకున్నారా?
లేదు. తెలిస్తే బావుండేదని నాకూ అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరికీ తెలియదు. అయితే నా గత అనుభవాల నుంచి నేర్చుకున్నా. నా ఉద్దేశంలో భిన్నమైన పాత్రలలో, మంచి ఎనర్జీతో కనిపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు. ప్రేక్షకులకు నచ్చితే మంచి పాత్రలు వాటంతట అవే వస్తాయి. ఉదాహరణకు ‘నన్ను దోచుకుందువటే..’ సినిమాలో నాది చాలా మంచి పాత్ర. దానిలో అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. ఈ భావోద్వేగాలు మన చుట్టుపక్కల వాళ్లలో మనం చూడగలుగుతాం. అందుకే ఆ పాత్రకు అంత పేరు వచ్చింది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’లో నాది మాస్ పాత్ర. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటాను. ‘డార్లింగ్’లో ఏడు కోణాలు కనిపిస్తాయి. అప్పటి దాకా అలాంటి పాత్ర నేను చేయలేదు. దానికి కూడా మంచి పేరు వచ్చింది. ‘భిన్నమైన పాత్రలు చేస్తేనే మంచి నటిగా పేరు వస్తుంది’ అనే విషయాన్ని ఈ అనుభవాల నుంచి తెలుసుకున్నా!
ఒక స్ర్కిప్ట్‌ను మీరు ఎలా ఎంచుకుంటారు?
ఒక కథ సినిమాగా మారాలంటే అనేక విషయాలు దోహదపడతాయి. మంచి నిర్మాణ సంస్థ కావాలి. మంచి దర్మకుడు కావాలి. మంచి సినిమా బృందం కావాలి. మంచి సహనటులు కావాలి.. ఇవన్నీ ఉంటే- సినిమా ఆడుతుందనే విషయం మనకు ముందుగానే తెలిసిపోతుంది. నా కెరీర్‌కు పనికొస్తుందని అర్థమవుతుంది. అంతేకాకుండా ‘ఒక ప్రేక్షకురాలిగా చూస్తే నాకు నచ్చుతుందా?’ అనే విషయాన్ని కూడా ఆలోచిస్తా. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని స్ర్కిప్ట్‌లను ఎంచుకుంటా!
సినీ రంగంలో విజయం సాధించటానికి ప్రతి రోజూ కష్టపడుతూ ఉండాలి. అలాంటప్పుడు అసహనంగా అనిపించదా?
ఓపికగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ‘మనకు కూడా ఒక రోజు వస్తుంది. మంచి పాత్ర లభిస్తుంది.. అది విడుదల అవుతుంది’ అనే నమ్మకంతో వేచి చూస్తూ ఉండాలి. పెద్ద సినిమాలు పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా వేచి ఉండాల్సిందే! మొదట్లో చాలా అసహనంగా అనిపించేది. ‘నా సినిమా ఎప్పుడు విడుదలవుతుందా?’ అనిపించేది.. తర్వాత నిరీక్షణ తప్పదనే విషయం అర్థమయింది.
మిమ్మల్ని చాలా చిరాకు పెట్టే విషయం ఏమిటి?
నేను సెట్‌లో ఉన్నప్పుడు... ఎక్కువ పని లేకుండా ఖాళీగా ఉండాలంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. 48 గంటలు విరామం లేకుండా పనిచేయమన్నా చేస్తాను. కానీ నా సీన్స్ లేకుండా సెట్‌లో ఖాళీగా కూర్చోవాలంటే చాలా చిరాకు వస్తుంది. కెమెరా ముందుకు వచ్చి పనిచేస్తుంటే ఉత్సాహంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ చిరాకును కూడా అఽధిగమించటానికి ప్రయత్నిస్తున్నా!
మీ చిన్నతనం ఎక్కడ ఎలా గడించింది?
మాది చిక్‌మగళూరు పక్కన ఉన్న శృంగేరీ. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శారద పీఠం ఇక్కడే ఉంటుంది. శ్గృంగేరీ చాలా అందమైన పట్టణం. శారద పీఠం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ పరిఢవిల్లుతూ ఉంటాయి. అలాంటి చోట పుట్టి పెరిగాను కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం, భరతనాట్యం నేర్చుకున్నా. నా ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత ఒక థియేటర్ గ్రూపులో చేరాను. మొత్తం దేశమంతా తిరిగాను. ఇంగ్లీషులోని పేరు మోసిన నాటకాలన్నీ వేశాను. డైరెక్షన్, లైటింగ్... ఇలా అన్ని విభాగాల్లో పనిచేశాను. ఈ నాటకాలు వేస్తున్న సమయంలోనే సినిమా ఆడిషన్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇలా కొన్ని వందల ఆడిషన్స్ చేశాను. దానిలో ‘వజ్రకాయ’ అనే సినిమా ఆడిషన్ ఫలించింది. తొలిసారి సినిమా అవకాశం వచ్చింది. నాకు వచ్చిన పాత్రలన్నీ ఆడిషన్స్ ద్వారా వచ్చినవే!
మీ జీవితంలో ఆనందకరమైన విషయాలేమిటి?
ప్రతిరోజూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తా. చిన్నా, పెద్ద అనేవి మనం ఏర్పరుచుకున్న గోడలు అనిపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే ప్రతి రోజూ, ప్రతి విషయంలోనూ ఆనందం ఉంటుంది. నేను పెయింటింగ్ వేస్తా... దాంట్లో ఆనందం దొరుకుతుంది. డ్యాన్స్ చేస్తా... దాంట్లో ఆనందం దొరుకుతుంది. ప్రకృతిలో మమేకమై ప్రయాణాలు చేస్తూ ఉంటా... దాంట్లో ఆనందం దొరుకుతుంది. చివరకు మబ్బుల్లేని నీలి ఆకాశంలో నక్షత్రాలను చూడటంలో కూడా ఆనందం లభిస్తుంది. అందువల్ల నా ఆనందం సంఘటనల మీద ఆధారపడి ఉండదు.
సివిఎల్‌ఎన్ ప్రసాద్