Navya : అజ్రక్ అదరహో
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:38 AM
మోడాల్ సిల్క్ మీద అజ్రక్ ప్రింట్లు అద్దుకున్న చీరలే అజ్రక్ మోడాల్ చీరలు.
అజ్రక్ మోడాల్ చీరలు తాజాగా అతివల మనసులను దోచుకుంటున్నాయి. మిలమిల మెరిసిపోతూ, మృదువుగా ఉండే ఈ చీరల ప్రత్యేకత వినూత్నమైన అజ్రక్ డిజైన్లలో దాగి ఉంటుంది. అదరగొట్టేస్తున్న అలాంటి కొన్ని అజ్రక్ చీరలు ‘నవ్య’ పాఠకుల కోసం...
మోడాల్ సిల్క్ మీద అజ్రక్ ప్రింట్లు అద్దుకున్న చీరలే అజ్రక్ మోడాల్ చీరలు. మోడాల్ అనే రయాన్ వస్త్రానికి పట్టును జోడిస్తే తయారయ్యే వస్త్రం మన్నిక ఎక్కువ. సుతిమెత్తగా, సౌకర్యవంతంగా ఉండే ఈ వస్త్రానికి పట్టును జోడించి, విలాసవంతమైన, మెరుపులీనే అందమైన చీరలను రూపొందిస్తూ ఉంటారు. అజ్రక్ అనే ప్రాచీన చేనేత నైపుణ్యం గుజరాత్, రాజస్థాన్‌లలో రూపం పోసుకుని భారతదేశమంతా విస్తరించింది. ఈ చీరల మీద అద్దే కుర్రచ్ అద్దకాలు విభిన్నంగా ఉండి, చీరలకు సరికొత్త హంగులను తెచ్చిపెడతాయి.
ఎరుపు మెరుపు
అజ్రక్ చీరల్లో ఎరుపు రంగే ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. కాబట్టే ఈ రంగు చీరలు ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. ఎరుపుతో పాటు నలుపు, నీలం రంగుల చీరలు, మిశ్రమ రంగులు చీరలు కూడా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. చేనేత పనితనం, అందమైన అద్దకాల సమ్మేళనం వల్ల సృజనాత్మకతతో కూడిన అజ్రక్ చీరలు రూపొందుతున్నాయి. కలకాలం చెక్కుచెదరని రంగులు, అద్దకాలు, మెరుపు కోల్పోని జరీ ఈ చీరల ప్రత్యేకతలు.
ఇలా సింగారించాలి
అజ్రక్ చీరలతో పాటు కుట్టించే జాకెట్టుతోనే చీర మొత్తానికి ఆకర్షణ చేకూరుతుంది. కాబట్టి సాదాసీదాగా కాకుండా, వినూత్నమైన తరహాలో జాకెట్లను కుట్టించుకోవాలి. జరీ అంచు చేతుల మీదకు వచ్చేలా, వెనకవైపు డోరీలు ఉండేలా కుట్టించుకోవాలి. కుందన్, పోల్కీ హారాలు, సంప్రదాయ ఆభరణాలు ఈ తరహా చీరలకు ఎంతో బాగా నప్పుతాయి.