Neeru Saluja : 70 ఏళ్లు... 80 దేశాలు
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:08 AM
నీరూ సలూజా జైపూర్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. 2010లో ఆమె భర్త మరణించారు. అప్పటి దాకా నీరూ, ఆమె భర్త అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఉండేవారు. ప్రపంచంలో అనేక ప్రాంతాలు పర్యటించాలనే కోరికకు ఆమెలో చిన్నప్పుడే బీజం పడింది. ‘‘చిన్నప్పుడు స్కూలుకు వెళ్తుంటే సైకిల్ మీ
వయస్సు 70... వెళ్లింది 80 దేశాలు... పైగా ఒంటరిగా..
ఎవరీ సాహసి అనుకుంటున్నారా?
అయితే మీరు నీరూ సలూజా గురించి తెలుసుకోవాల్సిందే!
నీరూ సలూజా జైపూర్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. 2010లో ఆమె భర్త మరణించారు. అప్పటి దాకా నీరూ, ఆమె భర్త అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఉండేవారు. ప్రపంచంలో అనేక ప్రాంతాలు పర్యటించాలనే కోరికకు ఆమెలో చిన్నప్పుడే బీజం పడింది. ‘‘చిన్నప్పుడు స్కూలుకు వెళ్తుంటే సైకిల్ మీద నుంచి పడిపోయా. కాలికి దెబ్బ తగిలింది. రెండునెలల పాటు ఎక్కడికి కదలలేకపోయా. ఆ సమయంలో టీవీలు కూడా లేవు. ఏవైనా పుస్తకాలు చదువుకోవటం. లేదా కిటికీ నుంచి బయటకు చూడటం మాత్రమే నాకున్న హాబీలు. జైపూర్ చాలా వేడి ఉంటుంది. ఎక్కువ వానలు పడవు.
కాబట్టి మేఘాలు కూడా తక్కువే. కిటికీలో నుంచి చూసినప్పుడు అప్పుడప్పుడు మేఘాలు కనిపించేవి. ఆ మేఘాలు ఎక్కడికి వెళ్తాయనే ఆలోచనే చాలా ఆసక్తిగా ఉండేది. అది తెలుసుకోవడానికి అట్లాస్ చూస్తూ ఉండేదాన్ని. అప్పుడే అట్లాస్‌లో ఉన్న దేశాలన్నిటికీ వెళ్లాలనే కోరికకు బీజం పడింది’’ అంటారామె.. పెళ్లి అయిన తర్వాత ఆమె భర్తకు కూడా కొత్త ప్రదేశాలకు వెళ్లటంపై ఆసక్తి ఉండటంతో... ఇద్దరూ పర్యటలను మొదలుపెట్టారు. ‘‘మాకు ఒక వెస్పా స్కూటర్ ఉండేది. దానిమీద ఢిల్లీ, సిమ్లా, చండీగఢ్ లాంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లం. అయితే ఆ సమయంలో ఇతర దేశాలకు వెళ్లింది తక్కువే’’ అంటారు నీరూ. 2010లో ఆమె భర్త మరణించారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడటం, తను ఒంటరిగా ఉండాల్సి రావటంతో... ఆమె మళ్లీ ప్రయాణాలు మొదలుపెట్టారు.
ఒంటరిగా తొలిసారి...
మొదట్లో తనతో పాటు బంధువులను, స్నేహితులను రమ్మని అడుగుతూ ఉండేవారు. కానీ వారికి రకరకాల సమస్యలు ఎదురు అవుతూ ఉండేవి. దీనితో తానే ఒంటరిగా ఇతర దేశాలకు వెళ్లాలని నీరూ నిర్ణయించుకున్నారు. 2012లో యూరప్‌లో క్రిస్టమస్ సమయంలో ఒక క్రూయిజ్ ప్రయాణాన్ని ఒక్కరే చేశారు. ‘‘ఆ ప్రయాణం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఒంటరిగా ప్రయాణించటంలో ఉన్న మజాను నాకు పరిచయం చేసింది. చాలా మంది ఒంటరిగా ప్రయాణించటం కష్టమనుకుంటారు. కానీ ముందుగా ప్లాన్ చేసుకుంటే ఒంటరి ప్రయాణాలు అంత కష్టమేమి కావు. మనతో పాటు స్నేహితులు ఎవరు రాకపోవచ్చు. కానీ చాలా సార్లు ప్రయాణాల్లోనే స్నేహితులు ఏర్పడతారు...’’ అంటారు నీరూ. ఆ యూరప్ యాత్ర ఆమెకు ప్రయాణాన్ని కొత్త కోణం నుంచి చూడటం కూడా నేర్పింది.
‘‘ఒంటరి ప్రయాణంలో స్వేచ్ఛ ఉంటుంది. మనం ఏం చేయాలో మనమే నిర్ణయించుకోవచ్చు. స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వెళ్తే- మిగిలిన వారు ఏం చేస్తే- మనం కూడా అదే చేయాల్సి ఉంటుంది. సాధారణంగా నేను పెద్ద గ్రూపులతో వెళ్తా. అటువంటప్పుడు మనకు స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో భద్రత కూడా ఉంటుంది’’ అంటారు నీరూ.
ప్రతి ప్రయాణం ఒక కొత్త అనుభవం
తాను చేసిన ప్రతీ ప్రయాణం ఒక కొత్త అనుభవాన్ని నేర్పుతుందంటారు నీరూ. ‘‘నేను ఇప్పటి దాకా 80 దేశాలు ప్రయాణించాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవం ఎదురయింది. ఇవన్నీ నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ప్రతి ప్రాంతానికీ తనదైన సంస్కృతి ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే- అనేక కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి’’ అని చెబుతారు నీరూ. 60 ఏళ్లు దాటిన వాళ్లందరూ తప్పనిసరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలంటారామె. ‘‘చాలామంది ‘వయసైపోయింది’ అంటూ ఉంటారు. కానీ వయస్సు మీద పడిపోతోందని ఎందుకు బాధపడాలి? ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోవాలని మన అందరికీ తెలుసు. ఈ లోపున ఆనందంగా ఎందుకు ఉండకూడదు.. జీవితాన్ని ఎందుకు ఆస్వాదించకూడదు?’’ అంటారు నీరూ.