Share News

శూన్యవాదం అంటే...

ABN , Publish Date - Apr 05 , 2024 | 09:58 AM

బౌద్ధ దార్శనిక సిద్ధాంతమైన శూన్యవాదం... ప్రపంచ దార్శనిక చరిత్రలోనే ఒక అద్భుత సిద్ధాంతం అని చెప్పవచ్చు. కానీ చాలామందికి ఈ శూన్యం అంటే ఏమిటో అర్థం కాక... దాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు.

శూన్యవాదం అంటే...

బౌద్ధ దార్శనిక సిద్ధాంతమైన శూన్యవాదం... ప్రపంచ దార్శనిక చరిత్రలోనే ఒక అద్భుత సిద్ధాంతం అని చెప్పవచ్చు. కానీ చాలామందికి ఈ శూన్యం అంటే ఏమిటో అర్థం కాక... దాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. బుద్ధుడు ఆత్మను, పరమాత్మను నిరాకరించాడనీ, అందుకే దాన్ని శూన్యవాదం అంటారని కొందరు అంటే... ‘‘ప్రపంచంలో అంతే శూన్యమే, ఏమీ లేదు’’ అంటూ దీని గురించి మరికొందరు వ్యాఖ్యానించారు. ఇంకొందరు అర్థం లేని మాటలను శూన్యవాదంతో పోలుస్తూ ‘‘ఇక నీ శూన్యవాదం ఆపుతావా?’’ అని కూడా అంటారు. నిజానికి శూన్యవాదం బౌద్ధ దర్శనంలో అద్భుతమైన సిద్ధాంతం. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఇలా వ్యాఖ్యానించడం విడ్డూరం. శూన్యం అనాత్మకు పర్యాయపదం కాదు. ‘స్వతంత్ర అస్థిత్వం లేనిది’ అని అర్థం. వాస్తవానికి శూన్యత అనేది గణితంలో సున్నా లాంటిది. గణితంలో సున్నాకు విలువ లేనట్టే అనిపిస్తుంది. కానీ అదే గణితానికి పునాది. సున్నా ఉంది కాబట్టే మనం పది, ఇరవై, వంద, వెయ్యి, పదివేలు, లక్ష లాంటి వాటిని లెక్కించగలుగుతున్నాం. ఆసక్తికరమైన విషయమేమిటంటే... గణితంలో సున్నా, శూన్యవాద తాత్త్విక సిద్ధాంతం... ఈ రెండూ భారతదేశంలోనే ఉద్భవించాయి.

అదే విధంగా శూన్యత అంటే మనం అనుకుంటున్నట్టు అభావం కాదు. ఇంకా కొంచెం స్పష్టంగా చెపాఁలంటే... ప్రపంచంలోని అన్ని ధర్మాలు (వస్తువులు) అస్తిత్వం కలిగినవి. కానీ ధర్మాలు (వస్తువులు) స్వతంత్రంగా ఉన్నా అస్తిత్వంలో ఉండాలి, లేదా అవి పరస్పర ఆధారితాలై ఉన్నా అస్తిత్వంలో ఉండాలి. విశ్వంలో ఈ రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆధారిత అస్తిత్వం, రెండోది స్వతంత్రాస్తిత్వం. ఇవికాకుండా మూడో వాదానికి తావులేదు. ఇలా అన్ని ధర్మాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అంటే ధర్మాలు పరస్పర ఆధారితాలు. మరి వాటికి స్వతంత్రమైన సత్తా ఎలా సాధ్యం? అందుకే దాన్ని ‘శూన్యత’ అన్నారు. శూన్యత, ప్రతీత్య సముత్పాదం అనే రెండు సిద్ధాంతాలూ ఒకే నాణేనికి చెందిన రెండు వైపుల వంటివి.

నాగార్జునుడి సిద్ధాంతాన్ని అనుసరించి... అస్తి అనేది ఆస్తిక దృష్టి, నాస్తి అనేది నాస్తిక దృష్టి. కాబట్టి పండితులు ఈ రెండు వాదాలనూ ఆశ్రయించరు. ఇక్కడ శాశ్వతవాదం అంటే... లోకాత్మలు శాశ్వతమని నమ్మే దృక్పథం. ఉచ్ఛేద వాదం అంటే లోకాత్మలు అశాశ్వతమైనవని అంగీకరించే దృక్పథం. శాశ్వతవాదం, ఉచ్ఛేదవాదం... ఈ రెండిటి మధ్యా ఉన్న మార్గాన్ని సమర్థించడం వల్ల... ఈ సిద్ధాంతాన్ని ‘మధ్యమ ప్రతిపద’ అని అంటారు.

తథాగతుడు ఋషి పట్టణంలో పంచవర్గీయ భిక్షువులకు మధ్యమ మార్గాన్ని బోధించి... అద్భుతమైన ధర్మచక్రాన్ని ప్రారంభించాడు. ధర్మచక్రం అంటే... సద్ధర్మాన్ని నలు దిశలా ప్రచారం చేయడం. మన ఆచార్య నాగార్జునుడు ఈ మధ్యమ మార్గంపైనే తన భవ్య తాత్త్విక సౌధాన్ని నిర్మించాడు. నాగార్జునుడి అభిప్రాయంలో... ఒక వస్తువుకు అస్తిత్వం ఉందని నమ్మడం ఒక అంతమైతే... దానికి అస్తిత్వమే లేదని నమ్మడం మరో అంతం. ఈ రెండు అంతాలను శాశ్వతవాదం, ఉచ్ఛేదవాదం అంటారు. బుద్ధుడు ఈ రెండిటినీ కాదని మధ్యమ మార్గాన్ని అవలంబించాడు. అది శూన్యవాదానికి పునాది వంటిది.

- ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు

na3.2.jpg

Updated Date - Apr 05 , 2024 | 09:58 AM