N.T. Rama Rao: అంతా ‘రామ’ మయం
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:08 AM
వెండితెర వేలుపు, తెలుగువారి ప్రియతమ నేత ఎన్.టి.రామారావు. ఆయన సినీ జీవిత విశేషాలతో కూడిన వ్యాసాల సమాహారం ‘తారకరామం’ పుస్తకం ఇటీవల విడుదలైంది.
వెండితెర వేలుపు, తెలుగువారి ప్రియతమ నేత ఎన్.టి.రామారావు. ఆయన సినీ జీవిత విశేషాలతో కూడిన వ్యాసాల సమాహారం ‘తారకరామం’ పుస్తకం ఇటీవల విడుదలైంది. అందులోని కొన్ని ఆసక్తికర అంశాలు ఇవి...
విశాఖలో శ్రీరామపట్టాభిషేకం
‘రామా! అయిదు ఘడియలు దాటకముందే యుద్ధాన్ని ప్రారంభించు! అది దాటెనా, నీవు లంకేశ్వరుని నిర్జించలేవు!’ ఈ సలహా శ్రీరామునికి ఇచ్చింది మరెవరో కాదు. సాక్షాత్తూ రావణుడే. అంతేకాదు ‘సమస్త సన్మంగళానిభవన్తు! విజయోస్తు!’ అని కూడా శ్రీరాముని ఆశీర్వదిస్తాడు లంకాధినాథుడు. ఈ దృశ్యాన్ని ‘శ్రీరామ పట్టాభిషేకం’ చిత్రానికై అత్యంత సహజమైన రీతిలో విశాఖపట్టణం సముద్రతీరాన గల జోడుగుళ్ల పాలెం వద్ద రామారావు చిత్రీకరించారు.
ఈ విధంగా తల పండిన విద్వాంసునిగా, మహోదాత్తునిగా రావణుని వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేసి ఇప్పటికే తెరకెక్కిన ఎన్నెన్నో రామాయణ గాథల కన్నా మిన్నగా, రికార్డ్ బ్రేక్ చిత్రంగా శ్రీరామపట్టాభిషేకం గాథను ప్రజలకందించాలని తలపెట్టినట్లు రామారావు స్వయంగా తెలియజేశారు.
భీమునిపట్నం వెళ్లే దారిలోగల మువ్వలవానిపాలెం సమీపాన సుమారు పన్నెండు రోజులపాటు ఈ సినిమా నిర్మాణం జరిగింది. లంకకు వానరసేన వారధి నిర్మించడం, రామ-రావణ యుద్ధం, సంజీవి మూలికను ఉపయోగించి లక్ష్మణుని మూర్ఛ నుంచి బతికించడం, రావణ వధ, సీతాదేవి అగ్ని ప్రవేశం లాంటి అనేక కీలక ఘట్టాలను ఇక్కడ చిత్రీకరించారు.
మరునాడు యుద్ధభూమిలో రావణుడు నేలకూలుతాడనగా భార్య మండోదరి(జమున) ‘ఆలపించనా ఈ వేళ! మధురస్మృతులే, హృదిని మీటగా, శ్రీలంకేశుని జీవనకావ్యం’ అంటూ గానం చేస్తుంది.
స్టంట్ మాస్టర్ సాంబశివరావు వానర సేనకు సూచనలిచ్చి షాట్‌కు సిద్ధం చేశారు. ‘యాక్షన్’ అని అసోసియేట్ డైరెక్టర్ సాయిబాబు ఆదేశం ఇచ్చినా, ఎవ్వరూ గదలు కదపలేదు. కట్, కట్ అంటూ ముందుకు వచ్చిన రామారావు ‘ఎవ్వరూ యాక్షన్ చెయ్యరేం!’ అని ప్రశ్నించారు. ‘అవునండీ మరి గదలు, తోకలు విరిగితే మాకిచ్చే డబ్బుల్లో కోతపెడతామని రంగులేసే దగ్గర వార్నింగిచ్చారు. అందుచేత అవి పాడవకుండా చూస్తున్నాం!’ అని జవాబిచ్చాడు ఒక ధర్మబుద్ధి. ‘ఛ ఛ! అదేం లేదు గదలు విరిగినా పర్వాలేదు. మీ తలలు పగలకుండా చూసుకుని, స్టంట్ మాస్టర్ చెప్పినట్లు బాగా ఫైటింగ్ చేయండి. మీ డబ్బులేమీ తగ్గించరు’ అని రామారావు వారికి అభయం ఇచ్చాక వానర మూక షాట్‌లో చెలరేగిపోయారు.
కథేమిటని అడిగితే...
(గుడిపూడి శ్రీహరి ఇంటర్వ్యూలో ఎన్‌టీఆర్ చెప్పిన విశేషాలు)
నేను ఈ రోజు దర్శకుణ్ణవడానికీ, దీక్షతో చిత్రాలు తీయడానికీ- గతంలో ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసే రోజుల్లో ఒంటబట్టించుకున్న సారమే ప్రోత్సహించింది. నా జీవితంలో మొదటి మలుపు తీసుకొచ్చిన దర్శకులు కే.వీ.రెడ్డి, బీ.యన్ రెడ్డి, యల్.వీ.ప్రసాద్. ఈ రోజు వరకూ ఇంతకన్నా గొప్ప దర్శకులు తెలుగు సినిమా రంగంలో రాలేదు. వీరి దర్శకత్వంలో నేను రెండు సంవత్సరాల్లో (పాతాళభైరవి తీస్తున్న రోజులు) పైకి రాలేకపోతే మద్రాసునీ, చలనచిత్ర రంగాన్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నా! వారి దర్శకత్వంలో హీరోగా క్రమశిక్షణతో కృషి చేసి పైకి రావడానికి అదే సరైన సమయమనీ, అదొక పరీక్ష అనీ భావించుకున్నా! ఈ రోజు నేను దర్శకుణ్ణవడానికి కూడా నా మీద పడిన వారి ప్రభావమే కారణం.
ఇప్పుడు నటనలో, సినిమా తీసే విధానాల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, కార్యదీక్ష చాలావరకూ తగ్గిపోయాయి. ఉదాహణకు ఒక విషయం చెబుతాను. మద్రాసుకు యాభై మైళ్ల దూరంలో ఉన్న తడకి తెల్లవారుఝామునే వెళ్లి మేకప్ వేసుకుని అక్కడి నుంచి అయిదు మైళ్లు కారులో వెళ్లి రిహార్సల్సు చేసుకుని షూటింగ్‌కి సూర్య భగవానుడి కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు అలా ఉండడం లేదు. జగదేక వీరుని కథ తీస్తున్న సమయంలో ఎవరో అరవై మంది ప్రముఖులు షూటింగ్ చూడడానికి స్టూడియోకి వచ్చారు. నాగిరెడ్డి వారిని సెట్ మీదికి తీసుకు వచ్చారు. శివశంకరీ... శివానంద లహరీ.... పాట చిత్రీకరించాలి. మేమంతా మేకప్ వేసుకుని రెడీగా ఉన్నాం. అంతలో ‘రామారావు గారూ! మనం షాట్ తీద్దాం!’ అన్నారు రెడ్డిగారు. ఆరున్నర నిమిషాల పాట అది. ‘రెడీ’ అన్నాను. అంతే! షూటింగ్ మొదలైంది. ఒకే టేక్‌లో పాటంతా షూట్ చేశారు. ప్రతి దృశ్యానికీ మా సంసిద్ధత అలా ఉండేది.
అప్పుడప్పుడూ నేను ‘కథేమిటి?’ అని అడిగేవాణ్ణి. కే.వీ.రెడ్డి, బీ.యన్.రెడ్డి వెంటనే నవ్వేసేవారు. ‘రామారావూ! స్ర్కిప్టు తీసుకు చదవాలిగానీ కథ అడుగుతావేమిటి?’ అనేవారు. చివరికి షాట్ ఏమిటో అడిగినా సరే హాస్యాస్పదంగా ఉండేది. ఎందుకంటే స్ర్కిప్టు రెడీగా ఉండేది. చదువుకుని సిద్ధపడేవాళ్లం. ఈ రోజుకి కూడా నాకు వారి పద్ధతులే ఒక ఇన్‌స్పిరేషన్. వాటితోనే దర్శకత్వం నిర్వహించడానికి కృషి చేస్తున్నా! నాకే కాదు తెలుగు పరిశ్రమకే వారు గురుతుల్యులు. వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నా! ఒక చిత్రం ప్రారంభించిన తరవాత అది ముగిసేదాకా మరో చిత్రం గురించి ఆలోచించకూడదు. దాన్ని పూర్తిచేయాలంటే కనీసం ఆరేడు నెలలైనా పడుతుంది. ఇప్పుడేముంది? స్పీడ్... స్పీడ్... అంటూ చిత్రం త్వరగా పూర్తిచేయాలంటారు. మేం నటించడం లేదు. పాత్రలతో ఆడుకుంటున్నాం. అంతే!
నేను కూడా ఇదే గాలివానలో కొట్టుకుపోతున్నందుకు బాధగా ఉంది. నా అభిమానులంతా నేను అలాగే నటించాలంటున్నారు. అలాగే నటిస్తున్నా! కానీ ఇది నా అభిమతం కాదు. కమర్షియల్ ఆర్టిస్టుని కదా! పొరపాటున ఈ గాలికి అడ్డం తిరిగానంటే కొట్టుకుపోతాను. నిజానికి నాలోని కళాకారుడు నేను వేస్తున్న వేషాలకి ప్రతిక్షణం తిరగబడుతున్నాడు. ఇప్పటికి 280 పాత్రలు ధరించాను. ఇతరులను తృప్తిపరచగలిగాను కానీ నన్ను నేను తృప్తిపరచుకోలేకపోతున్నా! అభిమానులు చాలామంది ఇప్పటికీ నా పాత్రల గురించి ప్రస్తావిస్తుంటారు. వాటినే వారు గుర్తుంచుకున్నారు. వైవిధ్యం గల పాత్రలవి. అటు శ్రీరామ, శ్రీకృష్ణ, సుయోధన, భీష్మ, భీమ..... ఇటు ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం, పెళ్లి చేసి చూడు తదితర చిత్రాల్లోని పాత్రలు.... వీటిని నటించడానికి ఎంతో నేర్పు, సామర్థ్యం అవసరం.
ఆనాటి కోతిబావ ఈనాటికీ...
అందరూ ఎన్.టీ.ఆర్‌ని నటరత్న అని రాస్తుంటే ఏ ఒక్కరూ కూడా అందగాడని అనరేంటి? అనుకునేదాన్ని. దానికి కారణం లేకపోలేదు. రామారావు నటన కంటే మనిషిని మెచ్చిన కుర్రతనం అది. మల్లీశ్వరి సినిమాని ప్రముఖ జర్నలిస్ట్ ఖాసా సుబ్బారావుతో కలిసి చూశా. అప్పటికి నాకు తెలుగు వచ్చు. కానీ అది పరీక్షల చదువుతో వంటబట్టిన తెలుగు మాత్రమే. మల్లీశ్వరి పేరుతో సినిమా వచ్చినప్పటికీ అది హీరో సబ్జెక్ట్ అని ఈ రోజుకీ అంటున్నా. మల్లీశ్వరిలో మొదటిసారి హీరో రామారావుని చూశా. అంతకుముందు ఎక్కడో షావుకారు సినిమా వేస్తుంటే వెళ్లి చూశా. కానీ మల్లీశ్వరిలో రామారావు పంచె కట్టు, జుబ్బాతో అచ్చ తెలుగు యువకుడిలా అందంగా కనిపించాడు. మల్లీశ్వరిలో రామారావు గురించి ఎందుకు చెప్పుకోరు? నిజానికి ఆయన లేకపోతే కథేది? అని నేను వాదిస్తే ‘అది నిజమే’ అని ఖాసా నవ్వారు.
ఎన్.టీ.ఆర్ ఇదివరకు చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ నటించేవారు. అలా ఆలోచిస్తే నాకు తట్టే కారణం ఒక్కటే. పురాణ పురుషుల వేషాలు వేసిన రామారావుకి ఆ హుందా ఒంటబట్టేసింది. ఆ నిదానం, ఆ సుతిమెత్తని చిరునవ్వు, ఆ చేతుల కదలిక, ఆ నడక తీరు అతనికి అలవాటై పోయాయి. నిజానికి మీరే ఆలోచించండి! రాముడు, కృష్ణుడు ఎలా ఉండేవారు? మనకి తెలియదు. వారికొక రూపకల్పన ఇచ్చి మన ముందు సజీవ ప్రతిమలుగా నిలబెట్టారు రామారావు. దైవరూపాల్లో అక్షరాస్యులనే ఆకట్టుకున్న ఎన్‌టీఆర్ నిరక్షరాస్యులకు దైవంగా తోచడంలో ఆశ్చర్యం ఏముంటుంది.
ఇప్పటికీ ఎన్‌టీఆర్ సినిమాలు చూస్తూ ఉంటా. నా అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటే. రామారావు అందగాడు. అందుకే హీరోగా నిలబడ్డారు. ఆ అందంలో హుందాతనం, వృత్తిపై గౌరవం, తన శక్తిపై నమ్మకం ఉండడం వల్ల ఇంకా అందంగా కనిపించారు. అంతఃసౌందర్యమే కదా బాహ్య రూపానికి జీవకళనిచ్చేది! ఆ అంతరంగికమైన నిర్మలత్వం అండగా నిలిచి వయసుని తోసి రాజును చేసింది. అందుకే ఆనాటి ‘కోతి బావ’ ఈనాటికీ ‘మగాడు’ అనిపించుకుంటున్నాడు.
- ర్రామలక్ష్మి ఆరుద్ర
ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వస్తోంది. శంకరాభరణం లాంటి చిత్రాలను ప్రేక్షకులు అభిమానిస్తే నాలాంటి కళాకారుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. కానీ అలాంటి చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. ఒక్కోసారి అలాంటి చిత్రాలు ప్రేక్షకుల అభిమానానికి నోచుకోకపోయినా నాలాంటివారు ఆ చిత్రాలను తీసినవాళ్లని అభినందించకుండా ఉండలేరు. అలాంటి చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తే అంతకన్నా ఏం కావాలి? పుణ్యం, పురుషార్థం రెండు దక్కడమే అవుతుంది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ సినిమాలు చూసి విశ్వనాథ్ అభిమానిని అయ్యాను. ఇలాంటి చిత్రాలు చూసినపుడు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయా అనిపిస్తుంది. అయితే విశ్వనాథ్ లాంటి దర్శకులు నాలాంటి ఆర్టిస్టులతో ఇలాంటి చిత్రాలు తీయడానికి ధైర్యం చేయరు. నాలాంటి నటులు నటించడానికీ ధైర్యం చేయరు. ఎందుకంటే మా నుంచి ప్రేక్షకులు చూడదలచింది వేరేగా ఉంటుంది.
ప్రచురణ: జయప్రద ఫౌండేషన్, హైదరాబాద్
ప్రధాన సంపాదకుడు: టి.డి.జనార్థన్
ధర: రూ.1,000