ఆరోగ్యానికి అసలైన కూరలు
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:50 AM
‘వీలైనంత బరువు తగ్గాలి. వీలైనంత తక్కువ నూనె వాడాలి. వీలైనంత వరకు అనారోగ్యాన్ని దగ్గరకు రానివ్వకూడదు.’ ఈమధ్య కాలంలో ఎక్కువ మంది పాటిస్తున్న సూత్రాలివే.
‘వీలైనంత బరువు తగ్గాలి. వీలైనంత తక్కువ నూనె వాడాలి. వీలైనంత వరకు అనారోగ్యాన్ని దగ్గరకు రానివ్వకూడదు.’ ఈమధ్య కాలంలో ఎక్కువ మంది పాటిస్తున్న సూత్రాలివే. వీటికి అనుగుణంగా తయారు చేసుకోగలిగిన రుచికరమైన కూరలే ఇవి. మీరూ ప్రయత్నించండి.
బెండకాయ చికెన్ పులుసు
కావాల్సిన పదార్థాలు: బెండకాయలు- అరకిలో, చికెన్ కైమా- అరకిలో, చింతపండు గుజ్జు- రెండు స్పూనులు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, పచ్చిమిర్చి ముక్కలు- నాలుగు స్పూనులు, నూనె- పావు కప్పు, ఆవాలు- ఒక స్పూను, జీలకర్ర- ఒక స్పూను, మెంతులు- ఒక స్పూను, బెల్లం పొడి- రెండు స్పూనులు, పసుపు- అర స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు స్పూన్లు, ధనియాల పొడి- ఒక స్పూను, జీలకర్ర పొడి- అర స్పూను, కొత్తిమీర (తరిగినది)- రెండు స్పూనులు, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. కైమాను ముక్కల్లా చేసుకోవాలి.
మూకుడులో నూనె పోసి వేడి చేయాలి. ఈ నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను కలిపి పైన మూత పెట్టి పది నిమిషాలు మగ్గించాలి.
ఇలా మగ్గిన మిశ్రమంలో బెండకాయ ముక్కలు, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి.. ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలయబెట్టి కిందకు దింపేయాలి.
జాగ్రత్తలు
లేత బెండకాయల వల్ల కూర రుచిగా ఉంటుంది.
చింతపండు గుజ్జును ముందుగా వేస్తే కూర ఉడకదు. అందువల్ల చింతపండు గుజ్జును ఆఖర్లో వేయాలి.
పొట్లకాయ ఫ్రై
కావాల్సిన పదార్థాలు: లేత పొట్లకాయ- పావు కిలో, ఆవాలు- ఒక స్పూను, జీలకర్ర- ఒక స్పూను, నూనె- రెండు స్పూనులు, కరివేపాకు- ఒక రెబ్బ, వెల్లుల్లి- రెండు పాయలు, ఉల్లిపాయముక్కలు- పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు- నాలుగు స్పూన్లు, కొబ్బరిపాలు- పావు కప్పు, పసుపు- పావు స్పూను, మసాలా కారం- ఒకటిన్నర స్పూను, కొత్తిమీర- తగినంత, ఉప్పు- తగినంత
తయారీ విధానం:
లేత పొట్టకాయను చక్రాలుగా తరిగి బాగా కడగాలి. వాటిలో ఉప్పు వేసి కుక్కర్‌లో పెట్టి పదినిమిషాలు ఉడకనివ్వాలి.
ఒక మూకుడులో నూనె వేసి వేడి చేయాలి. దీనిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి బాగా దొరగా వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు వేసి వేయించాలి.
ఆ తర్వాత కొబ్బరిపాలు, మసాలా కారం, కొత్తిమీర వేసి దగ్గర పడనివ్వాలి.
జాగ్రత్తలు
లేత పొట్లకాయలో గింజలు ఎక్కువగా ఉండవు. వీలైనంత వరకు లేత పొట్లకాయతో ఫ్రై చేసుకుంటే మంచిది. ముదురు పొట్లకాయతో కూర చేయాలనుకుంటే- గింజలను తీసేస్తే మంచిది.
పొట్లకాయ తొక్కపై పొట్టులాంటి పదార్థం ఉంటుంది. అందువల్ల దీనిని ఎక్కువ సేపు నీళ్లలో కడగాలి.
దోసకాయ డైట్ కూర
కావాల్సిన పదార్థాలు: దోసకాయలు- అరకిలో, ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు- నాలుగు స్పూన్లు, పసుపు- పావు స్పూను, ఎండుమిర్చి- నాలుగు, ధనియాలు- ఒక టేబుల్ స్పూను, మెంతులు- ఒక టేబుల్ స్పూను, జీలకర్ర- ఒక టేబుల్ స్పూను, కారం- ఒక స్పూను, ఆవాలు- ఒక స్పూను, మినపప్పు- ఒకటిన్నర స్పూనులు, శనగపప్పు- ఒకటిన్నర స్పూనులు, ఎండుకొబ్బరి (తురుము)- రెండు స్పూన్లు, కొత్తిమీర (తరిగినది)- రెండు స్పూన్లు, చింతపండు గుజ్జు- రెండు స్పూన్లు, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
దోసకాయల తొక్క తీయకుండా ముక్కలుగా తరగాలి. వాటిని ఒక కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లు పోయాలి. వాటిలో ఉప్పు, పసుపు, కారం వేసి ఒక విజిల్ వచ్చేదాకా స్టౌ మీద ఉంచి.. ఆ తర్వాత దించేయాలి.
ఒక మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుకొబ్బరి, చింతపండు గుజ్జు వేసి ముద్దగా చేయాలి.
కుక్కర్ మూత వచ్చిన తర్వాత దానిలో ఈ ముద్దను, ఉల్లిపాయల ముక్కలను వేసి బాగా కలపి- ఐదు నిమిషాలు స్టౌ మీద పెట్టి ఉడకనివ్వాలి. దింపే ముందు కొత్తిమీర వేయాలి.
జాగ్రత్తలు
ఈ కూరలో నూనెను వాడాల్సిన అవసరం లేదు.
దీనిలో కూర దోసకాయను మాత్రమే వాడాలి. కీరాదోసను వాడకూడదు.
శైలజ ఏచూరి
శైలాస్ కిచెన్