Share News

Phula Soren: చూపులేకున్నా... లక్ష్యం మీదే గురి

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:06 AM

పుట్టుకతోనే చూపు లేదు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది. కనీస అవసరాలైనా తీర్చుకోలేని నిరుపేద గిరిజన కుటుంబం

Phula Soren: చూపులేకున్నా... లక్ష్యం మీదే గురి

పుట్టుకతోనే చూపు లేదు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది. కనీస అవసరాలైనా తీర్చుకోలేని నిరుపేద గిరిజన కుటుంబం... కానీ ఇలాంటి అవరోధాలన్నీ ఆమె పట్టుదల ముందు తలవంచాయి. ఒడిశాకు చెందిన పదిహేడేళ్ళ ఫులా సోరెన్‌... ఇప్పుడు ఇండియన్‌ బ్లైండ్‌ ఉమెన్‌ క్రికెట్‌ జటు’్టకు వైస్‌ కెప్టెన్‌. నిరుడు తన సారథ్యంతో ‘ఐబిఎస్‌ఎ’ ప్రపంచ క్రీడల్లో మన దేశానికి చారిత్రాత్మకమైన స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టింది.

క్రికెట్‌లో జీవితానికి అర్థాన్ని వెతుక్కోవడమే కాదు, తననుతాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది ఫులా సోరెన్‌. ‘‘మైదానంలో నేను వేసే ప్రతి అడుగు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది’’ అని చెబుతుందామె. క్రీడల్లో రాణించడం అందరికీ సులభం కాదు. ఆర్థికమైన, సామాజికమైన నేపథ్యంలేని అంధురాలైన అమ్మాయికి అది మరింత కష్టమవుతుంది. కానీ జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ఫులా తన సత్తాను బలంగా చాటుతోంది.

ఒంటరితనం బాధపెట్టేది...

ఫులా స్వస్థలం ఒడిశాలోని సలాబనీ అనే గ్రామం. పుట్టుకతోనే చూపులేని ఆమె జీవితం ఎన్నో ఒడుదొడుకులతో సాగింది. ఆమె తండ్రి టునూ సోరెన్‌ గ్రామంలో చిన్న చిన్న పనులు చేసేవారు. స్థిరమైన ఆదాయం లేకపోవడంతో... రోజూ రెండు పూటలు భోజనం దొరకడమే ఆ గిరిజన కుటుంబానికి కష్టంగా ఉండేది. చూపులేని ఫులాను ఆమె తల్లి కంటికి రెప్పలా కాపాడుకొనేవారు. ‘‘ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా చిన్న చిన్న పనులు చేసుకోవడం అమ్మే నాకు నేర్పింది. నేను బాగా చదువుకోవాలని ఆమె కోరిక. అయితే సాధారణ బడుల్లో నాకు అనుమతి దొరకలేదు. దాంతో... అంధుల పాఠశాలలో నాన్న చేర్పించారు. బడికి కాస్త అలవాటు పడుతున్న దశలో... మా అమ్మకు హఠాత్తుగా జబ్బు చేసింది. కొద్ది రోజుల్లోనే ఆమె మరణించింది. ఆ విషాదం నుంచి చాలా కాలం కోలుకోలేకపోయాను. ఆ సమయంలో నాన్న ఇచ్చిన నైతిక స్థైర్యాన్ని ఎప్పటికీ మరచిపోలేను. కానీ నాన్న పొద్దున్నే పనికి వెళ్తే... తిరిగి వచ్చేసరికి ఏ రాత్రో అయ్యేది. ఒంటరితనం మాత్రం నన్ను చాలా బాధపెట్టేది. దీంతో... బడిలో ఎక్కువసేపు గడపడం కోసం క్రీడల్లో పాల్గొనేదాన్ని’’ అని గుర్తుచేసుకుంది ఫులా. క్రీడల్లో ఆమె చురుకుదనాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గమనించారు. క్రికెట్‌ వైపు ఆమెను ప్రోత్సహించారు. ‘‘ఆ తరువాత క్రికెట్‌ నా లోకమైపోయింది. అమ్మ లేని బాధను ఆటలో మరచిపోయేదాన్ని. కొద్దికాలంలోనే ఆల్‌రౌండర్‌గా నైపుణ్యాన్ని సాధించాను. అయితే దాని వెనుక ఎంతో కష్టం ఉంది. మైదానంలో తిరగడం, బ్యాట్‌ను ఊపడం, బౌలింగ్‌ చెయ్యడం... ఇవి అంధులకు పెద్ద సవాల్‌. పూర్తిగా శబ్దం మీద, స్పర్శమీద, ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడాలి. ఈ ఆటకు నిరంతరమైన ఏకాగ్రత, అంకితభావం కావాలి. అవన్నీ క్రమంగా మెరుగుపరుచుకున్నాను. ఎప్పుడూ వా లక్ష్యం మీదే దృష్టి పెట్టాను. నన్ను నేను పదును పెట్టుకోవడానికి... నాకు అందుబాటులో ఉన్న ప్రతిదాన్నీ ఉపయోగించుకున్నాను’’ అని చెబుతోంది ఫులా.

flkb.jpg


గర్వంగా అనిపిస్తోంది...

అంధుల పాఠశాలస్థాయి పోటీల నుంచి ఆమె విజయపరంపర మొదలయింది. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి టోర్నీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి అంధ మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికయింది. ‘‘ఎక్కడ ఆడుతున్నాననే దాన్ని పట్టించుకోను. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తాను’’ అంటున్న ఫులా అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంది. ఎన్నో సార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌స’గా నిలిచింది. కిందటి ఏడాది జాతీయ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయింది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో నిరుడు జరిగిన ‘ఇంటర్నేషనల్‌ బ్లైండ్‌స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐబిఎ్‌సఎ)-నేషనల్‌ గేమ్స్‌’లో... ఆమె సారథ్యంలోని జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇది భారత అంధ మహిళల క్రికెట్‌ జట్టు సాధించిన తొలి బంగారు పతకం కావడం విశేషం. ఆ పోటీల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు... ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ‘‘తునా సోరెన్‌ది నిరుపేద కుటుంబం. కొన్నిసార్లు తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజు అతని కుమార్తె ఫులా తన ప్రతిభతో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. మేము ఎన్నడూ చూడని, బహుశా జీవితంలో చూడలేని ప్రదేశాలకు వెళ్ళి... గొప్ప ప్రదర్శన చేస్తోంది. ఆమె మా ఊరుకు గర్వకారణం’’ అంటున్నారు గ్రామస్తులు. ‘‘క్రికెట్‌ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు నన్ను, మా నాన్నను జనం గుర్తుపడుతున్నారు. ‘ఆయన... ఆ అమ్మాయి తండ్రి’ అని మా నాన్న గురించి చెబుతూ ఉంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది’’ అని చెబుతున్న ఫులా తన తల్లి ఆశయాన్ని మాత్రం మరచిపోలేదు. భువనేశ్వర్‌లో డిగ్రీ చదువుతోంది. ‘‘పుట్టుకతో వచ్చే వైకల్యాన్ని నివారించడం మన చేతిలో లేదు. కానీ ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని దానిలో కృషి చేస్తే... గెలుపును, సంతృప్తిని సాధించగలం. దానికోసమే నా ప్రయత్నమంతా. వచ్చే ఏడాది జరగబోయే ‘అంధ మహిళల తొలి టి-20 ప్రపంచ కప్‌’ పోటీలకు మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. దానిలో రాణించడమే ప్రస్తుతం నా లక్ష్యం’’ అంటోంది ఫులా.

‘‘క్రికెట్‌ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు నన్ను, మా నాన్నను జనం గుర్తుపడుతున్నారు. ‘ఆయన...

ఆ అమ్మాయి తండ్రి’ అని మా నాన్న గురించి చెబుతూ ఉంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది’’ అని చెబుతున్న ఫులా తన తల్లి ఆశయాన్ని మాత్రం మరచిపోలేదు.

Updated Date - Dec 23 , 2024 | 03:06 AM