దినచర్య ఇలా
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:21 AM
పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు మంచి దినచర్య అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లలు ఏ సమయానికి ఏమి చేయాలన్నదాన్ని నిర్ణయించి వారు దాన్ని పాటించేలా చూడాలి. దీనివల్ల పిల్లలకు సమయ పాలన, క్రమశిక్షణ అలవడతాయి. ఆ దినచర్య ఎలా ఉండాలో చూద్దాం!
పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు మంచి దినచర్య అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లలు ఏ సమయానికి ఏమి చేయాలన్నదాన్ని నిర్ణయించి వారు దాన్ని పాటించేలా చూడాలి. దీనివల్ల పిల్లలకు సమయ పాలన, క్రమశిక్షణ అలవడతాయి. ఆ దినచర్య ఎలా ఉండాలో చూద్దాం!
ఉదయమే లేవాలి: పిల్లలు రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమిస్తే ఉదయం త్వరగా మేలుకొనడానికి వీలవుతుంది. సాధ్యమైనంతవరకు ప్రతిరోజూ ఒక నిర్దిష్ఠ సమయానికి పడుకొని లేవడం పిల్లలకు అలవాటు చేయాలి. పాఠశాలకు వెళ్లే పిల్లలకు కనీసం ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. నిర్ణీత సమయంలో నిద్ర నుంచి మేలుకొన్నపుడే అన్ని పనులు సమయానుసారం పూర్తవుతాయని పిల్లలకు చెప్పాలి.
గోరువెచ్చని నీళ్లు తాగాలి: పిల్లలు నిద్రలేచిన వెంటనే పళ్లు, నాలుక, నోరు శుభ్రం చేసుకునేలా చూడాలి. తరవాత పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగే అలవాటు చేయాలి. దీనివల్ల పొట్ట, ప్రేగులు పరిశుభ్రమవడంతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యం బలపడుతుంది. ఈ అలవాటు పిల్లలకు జీవితాంతం ఉపయోగపడుతుంది.
యోగా: ఉదయాన్నే పిల్లలు ధ్యానం, యోగ, ప్రాణాయామం చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. యోగాసనాలు వేయడం వల్ల పిల్లలు శారీరకంగా బలవంతులవుతారు. ధ్యానం వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ప్రాణాయామం వల్ల శరీరానికి కొత్త శక్తి సమకూరుతుంది. ఈ అలవాటు వల్ల పిల్లల్లో క్రమశిక్షణ మొదలవుతుంది.
అల్పాహారం: ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అల్పాహారంలో భాగంగా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన కూరగాయలు తినిపించండి. తల్లిదండ్రులు కూడా ఇవే తింటూఉంటే పిల్లలు మారాం చేయకుండా తినడానికి ఆసక్తి చూపిస్తారు.
పాఠశాలకు వెళ్లే ముందు: తల్లిదండ్రులు పిల్లలకు యూనిఫామ్, టై, బెల్ట్, సాక్స్, షూస్ ధరించడం నేర్పించాలి. స్కూల్ టైమ్ టేబుల్ ప్రకారం పుస్తకాలను బ్యాగ్‌లో చక్కగా సర్దుకోవడం, వాటర్ బాటిల్ సిద్దం చేసుకోవడం చూపించాలి. లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మరచిపోవద్దని హెచ్చరించాలి.
హోం వర్క్: పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించే అలవాటు చేయాలి. సాయంత్రం సమయాల్లో ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తినిపించాలి. ఆ రోజు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చదువుకునేలా చూడాలి. పిల్లలకు ఏవైనా సందేహాలుంటే వాటిని తల్లిదండ్రులు తీర్చే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ ఉపాధ్యాయులు ఇచ్చిన హోం వర్క్‌ను పిల్లలు ఎప్పటికప్పుడు పూర్తిచేసేలా ప్రోత్సహించాలి.
ఆటలు: పిల్లల మానసిక పరిపక్వతకు ఆటలు దోహదం చేస్తాయి. ప్రతిరోజూ కొంత సమయాన్ని ఆటలకు కేటాయించాలి. తోటి పిల్లలతో కలసి మెలసి ఆడుకునేలా చూడాలి.