Share News

Plus size beauty : ప్లస్‌ సైజ్‌ బ్యూటీ

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:27 AM

బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారేమోకానీ, అందాల పోటీలకు పనికి రారు అనుకోవడం పొరపాటని నిరూపించింది కఠ్మండుకు చెందిన జేన్‌ దీపిక గ్యారెట్‌. గత ఏడాది మిస్‌ నేపాల్‌గా గెలిచిన జేన్‌, 2023 మిస్‌ యూనివర్స్‌

Plus size beauty : ప్లస్‌ సైజ్‌ బ్యూటీ

బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారేమోకానీ, అందాల పోటీలకు పనికి రారు అనుకోవడం పొరపాటని నిరూపించింది కఠ్మండుకు చెందిన జేన్‌ దీపిక గ్యారెట్‌. గత ఏడాది మిస్‌ నేపాల్‌గా గెలిచిన జేన్‌, 2023 మిస్‌ యూనివర్స్‌ పోటీలో పాల్గొన్న మొట్టమొదటి ప్లస్‌ సైజ్‌ అభ్యర్థిగా గుర్తింపు పొందింది. ఆవిడ గురించిన మరిన్ని విశేషాలు.

‘‘ఐదడుగుల ఏడంగుళాల ఎత్తు, 80 కిలోల బరువుతో అందం ప్రమాణాలను అందుకోలేని నేను ఈ పోటీలో పాల్గొనడం వెనకొక ప్రధాన ఉద్దేశం ఉంది. అధిక బరువు, హార్మోన్‌ సమస్యలతో బాధపడే మహిళలకు ప్రాతినిధ్యం వహించడం కోసమే నేనీ పోటీలో పాల్గొని గెలిచాను. లావుగా ఉన్నంత మాత్రాన అందవిహీనంగా ఉన్నామని భావించవలసిన అవసరం లేదు. అధిక బరువుతో కూడా అందంగా కనిపించే వీలుంది అనడానికి నా గెలుపే ఒక ఉదాహరణ’’ అంటూ గత ఏడాది మిస్‌ నేపాల్‌గా గెలుపొందిన సందర్భంగా జేన్‌ ఇలా తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంది. 23 ఏళ్ల జేన్‌ అమెరికాలో పుట్టిన నేపాలీ మోడల్‌. మిస్‌ యూనివర్స్‌ 2023 టాప్‌ 20 జాబితాలో చోటు దక్కించుకున్న జేన్‌, ఈ పోటీలో సెమి ఫైనల్స్‌కు చేరిన మొట్టమొదటి ప్లస్‌ సైజ్‌ యువతిగా పేరు తెచ్చుకుంది.

అభద్రతను వదిలించి....

వృత్తిపరంగా నర్సు అయిన జేన్‌, మహిళల్లోని హార్మోన్ల హెచ్చుతగ్గులు, అవి మహిళల మానసిక ఆరోగ్యంపై చూపించే ప్రభావాల గురించి ప్రపంచానికి చాటి చెప్పడం కోసం తాను మిస్‌ యూనివర్స్‌ పోటీలో పాల్గొన్నానని అంటోంది. జేన్‌ తానెదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడింది. ఆవిడ పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ వల్ల విపరీతమైన డిప్రెషన్‌కు లోనైంది. అయినప్పటికీ ఓ పక్క కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటూ, తనకున్న ప్యాషన్‌కొద్దీ అందాల ప్రపంచంలో ఎదగడం మొదలుపెట్టింది. నటన, మోడలింగ్‌లో పట్టు సాధించింది. అందాల పోటీల్లో నాజూకుదనానికే పెద్ద పీట వేస్తారు. ప్రారంభంలో తాను అనుభవించిన ఆత్మన్యూనత గురించి ప్రస్థావిస్తూ... ‘‘నేనెంతో అభద్రతకు లోనయ్యాను. మిగతా అమ్మాయిలతో నన్ను నేను పోల్చుకుంటూ, నేను వాళ్లలా పొడవుగా, నాజూకుగా లేనని ఎంతో బాధపడేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చింది జేన్‌. అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఆవిడ శరీర బరువును చూసి ఎందరో హేళన చేయడం, బాడీ షేమింగ్‌తో విపరీతమైన ఒత్తిడికి లోనవడం లాంటివి కూడా జరిగాయి. అయినప్పటికీ నర్సు వృత్తి తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనీ, ఎన్నో అనుభవాలను పొందే అవకాశాన్ని కల్పించిందనీ జేన్‌ మీడియాతో చెప్పుకొచ్చింది.

Untitled-6.jpg

స్విమ్‌సూట్‌లో...

అందాల పోటీల్లో పాల్గొనే అభ్యర్థులకు అసౌకర్యానికి గురి చేసే రౌండ్‌ ఇది. మరీ ముఖ్యంగా జేన్‌ లాంటి బొద్దుగా ఉండే అమ్మాయిలు ఈ రౌండ్‌లో మార్కులు సాధించడం కొద్దిగా కష్టమే! కానీ ఇందుకు పూర్తి భిన్నంగా జేన్‌, స్విమ్‌ సూట్‌ రౌండ్‌లో మెటాలిక్‌ గ్రీన్‌ స్విమ్‌సూట్‌, స్ట్రాప్‌ హీల్స్‌తో జడ్జిల దృష్టిని ఆకర్షించింది. బ్యూటీ వాక్‌తో మార్కులను కొట్టేసి, టాప్‌ 20లో స్థానాన్ని దక్కించుకుంది. అధిక బరువుతో ఆత్మన్యూనతకు లోనయ్యే మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘కర్వీగా ఉండి అందచందాల ప్రమాణాలను అందుకోలేని మహిళలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఒకే రకమైన బ్యూటీ స్టాండర్డ్స్‌ అంటూ ఉండవు. ప్రతి మహిళా అందగత్తే! మిస్‌ యూనివర్స్‌ నేపాల్‌గా ఈ వేదికను ఉపయోగించుకుంటూ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మహిళా తనను తాను అంగీకరించుకోవాలి. వాళ్ల శరీరాలను బట్టి ఆత్మవిశ్వాసంగా వ్యవహరించాలి. ఇలా నడుచుకోగలిగితే విజయాలన్నీ తల వంచుతాయి’’ అంటూ మిస్‌ నేపాల్‌గా గెలుపొందిన సందర్భంలో మాట్లాడింది జేన్‌.

Updated Date - Jan 18 , 2024 | 03:27 AM