Share News

Parenting: ఆంక్షలు వద్దు

ABN , Publish Date - Dec 15 , 2024 | 03:38 AM

పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో.

Parenting: ఆంక్షలు వద్దు

పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. చదువు, ఆటలు ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి తెలిసో తెలియకో ఆడపిల్లలకు పరిమితులు విధిస్తుంటారు. ఇది సమర్థనీయం కాదు. తల్లిదండ్రులు పిల్లలందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆడపిల్లలకు ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదో తెలుసుకుందాం.

వృత్తి

ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన వృత్తి ఎంచుకునే స్వేచ్చ ఉంది. మీ అమ్మాయి ఏదైనా వృత్తి ఎంచుకోవాలనుకుంటే మొదట్లోనే వద్దని చెప్పకండి. అది ఏ రంగానికి సంబంధించింది అయినా అందులో ఎదిగేలా ప్రోత్సహించండి. ఇది అబ్బాయిల వృత్తి అంటూ నిరాశపరచకూడదు.

బరువు

అమ్మాయి కొద్దిగా బరువు పెరగగానే తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. ఆడపిల్లలు ఇంత బరువు ఉండకూడదు అంటూ ముఖంమీదే చెప్పేస్తూ ఉంటారు. ఇలా నేరుగా చెప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి వాళ్లకి వివరించండి. వయసుకు మించి బొద్దుగా కనిపించడం వల్ల కలిగే నష్టాలను మెల్లగా చెప్పండి.

దుస్తులు

ఆధునిక దుస్తులు వేసుకోవద్దని చెప్పవద్దు. చూడడానికి హుందాగా కనిపించే దుస్తులు ఎంచుకోమని చెప్పండి. దుస్తులు మన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఉండాలని వివరించండి

ధైర్యం

ఆడపిల్లలు మాట్లాడకూడదు అంటూ వారిని అధైర్య పరచకండి. మనసులో మాట చెప్పే అవకాశం ఇవ్వండి. ధైర్యంగా ఆడపిల్లలు తమ అభిప్రాయం తెలిపేలా ప్రోత్సహించండి.

నవ్వడం

ఆడపిల్లలు గట్టిగా నవ్వకూడదు అంటూ తల్లిదండ్రులు హెచ్చరించడం ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. ఇలా కాకుండా పదిమందిలో అహ్లాదకరంగా తమ భావాన్ని వెలిబుచ్చే పద్దతిని వాళ్లకి నేర్పించాలి. గట్టిగా అరవడం, గట్టిగా నవ్వడం కాకుండా భావోద్వేగ నియంత్రణని తెలియజెప్పాలి.

సామర్థ్యం

ఈ పని నువ్వు చేయలేవు అని ఆడపిల్లల ముందు అనవద్దు. ఇది వారి సామర్థ్యాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది. వారి ఆసక్తిని గమనించి ఒక ప్రయత్నం చేయనివ్వండి.

Updated Date - Dec 15 , 2024 | 03:38 AM