Bhagavad Gita : భగవద్గీత నేటికీ ఆచరణయోగ్యమేనా?
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:39 AM
భగవద్గీతను అయిదు వేల ఏళ్ళ క్రితం అప్పటి దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరు. మన జీవనగతులు వేరు. అలాంటప్పుడు నేటికీ గీత ఆచరణయోగ్యమైనదేనా? దీనికి సమాధానం
భగవద్గీతను అయిదు వేల ఏళ్ళ క్రితం అప్పటి దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరు. మన జీవనగతులు వేరు. అలాంటప్పుడు నేటికీ గీత ఆచరణయోగ్యమైనదేనా? దీనికి సమాధానం ఏమిటంటే... ఇటీవలి కాలంలో కొవిడ్ మహమ్మారి ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశాం. అయితే సమాజంలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న మరొక మహమ్మారి ఉంది. అదే మానసిక రుగ్మత. ఆతృత, ఆవేదనలు, నిరాశా నిస్పృహలు, అసంతృప్తి, భయాందోళనలు లాంటి అంతర్గత బలహీనతలతో నేటి మానవుడు సతమతం అవుతున్నాడు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఉన్న నేటి సమాజానికి భగవద్గీతా విజ్ఞానం సాంత్వన చేకూర్చి, మనసును నిర్మలంగా చేయగలదు.
భగవద్గీత ఆవిర్భవించిన రోజు గీతా జయంతి. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు సనాతనమైన ఈ గీతాజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు లోకానికి అందించాడు. ‘మాసానాం మార్గశీర్షోహం... మాసములలో మార్గశీర్ష మాసాన్ని నేను’ అంటూ అర్జునుడికి ఈ పవిత్రమైన మాసం విశిష్టతను ప్రత్యేకంగా వివరించాడు. కాబట్టి మార్గశీర్ష మాసం శ్రీకృష్ణునితో అభిన్నమయినదే కాకుండా... ఆధ్యాత్మిక సాధనకు ఎంతో శుభప్రదమైనది కూడా. భగవద్గీతలో తెలిపిన నియమాలను మానవుడు అంగీకరిస్తే జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలడు. జీవిత సమస్యలన్నిటికీ శాశ్వతమైన పరిష్కారం చేకూర్చగలడు. అదే సంపూర్ణ భగవద్గీతా సారాంశం.
భగవద్గీత మూల సూత్రం
భగవద్గీత మూల సూత్రాన్ని వివరిస్తూ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ‘‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ/ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః... సర్వ విధాలైన ధర్మాలను త్యజించి, కేవలం నన్నే శరణు పొందు. నిన్ను సర్వ పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. భయపడకు’’ అని చెప్పాడు. జీవితంలో సంభవించే సకల భయాందోళనల నుంచి, గత పాపకర్మ ఫలితాల నుంచి ఉపశమనాన్ని కాంక్షించేవారు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుణ్ణి తక్షణం శరణు వేడడమే తరుణోపాయం. సకల మానవజాతికి అర్జునుడి ద్వారా శ్రీకృష్ణుడు ఉపదేశించిన సందేశం ఇది.
శ
రణాగతి ఇలా...
‘‘మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు... ఎల్లప్పుడూ నన్నే స్మరించు. నా పట్ల భక్తితో ఉండు. నన్ను పూజించు. నాకు నమస్కరించు. అలా చేయడం వల్ల నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. ఇది నేను నీకు ఇచ్చే వాగ్దానం. ఎందుకంటే, నువ్వు నాకు చాలా ప్రియమైన మిత్రుడవు’’ అని చెప్పాడు కృష్ణభగవానుడు. పై శ్లోకం శరణాగతిలోని నాలుగు అంశాలను వివరిస్తుంది:
మన్మనా భవ (సదా కృష్ణుణ్ణే స్మరించడం): ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలను నిత్యం భగవంతుణ్ణి స్మరించడానికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి. శ్రీకృష్ణుణ్ణి మన మనస్సులో, హృదయంలో నిలుపుకొన్నప్పుడు ఎలాంటి పాపభీతి లేకుండా, విశుద్ధంగా జీవించగలం. శ్రీకృష్ణుడి పవిత్రనామాలను జపించడం వల్ల లోకంలోని సకల విపత్తుల నుంచి ఉపశమనం పొందగలం.
మద్భక్తో (శ్రీకృష్ణుడి భక్తుడు కావడం): శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు సైతం ఎల్లప్పుడూ ఆయన గురించే ఆలోచించేవాడు. అయితే అది శత్రుత్వంతో కూడిన ఆలోచన. అది భగవంతుణ్ణి స్మరించే పద్ధతి కాదు. శ్రీకృష్ణుణ్ణి భక్తిపూర్వకంగా సేవించడానికి అనువైన నవవిధ భక్తి మార్గాలను ఆచార్యులద్వారా నేర్చుకోవాలి. కుల, ప్రాంత, లింగ, జాతి, వర్ణభేదాలేవీ ఎంచకుండా ఎవరైనా ఈ భక్తి మార్గాలను అనుసరించవచ్చు జీవితంలో పురోగతి సాధించడానికి ఇది లోకంలో సముచితమైన మార్గం.
మద్యాజీ (శ్రీకృష్ణుణ్ణి అర్చించడం): ప్రతి రోజూ శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. ధూపం, పుష్పం, నీరు మొదలైన వాటిని సమర్పించవచ్చు. అలా భగవంతుడికి సమర్పించినవి ప్రసాదం అవుతాయి. ధూపం ఇల్లు అంతటినీ పవిత్రం చేయగలదు. కృష్ణప్రసాదం ఇంద్రియాలను పరిశుద్ధం చేస్తుంది. ఈ విధమైన నిత్యారాధన మన ఇంటిని, జీవితాలను పవిత్రం చేస్తుంది. సకల పాపాల నుంచి విముక్తి ప్రసాదిస్తుంది.
మాం నమస్కురు (శ్రీకృష్ణుడికి నమస్కరించడం): భగవంతుడికి కేవలం నమస్కారం చేసినంత మాత్రాన ఆయనకు ప్రియమైన భక్తులు కాగలం. అలాంటి భక్తులకు సకల శుభాలు చేకూరుతాయి. భగవద్గీతలోని ఈ సూత్రాలను ఆచరిస్తే... జన్మ, మృత్యు, జరా, వ్యాధులను అధిగమించి, శ్రీకృష్ణుని దివ్య ధామాన్ని చేరుకొని, శాశ్వతమైన నిత్య యవ్వన జీవితాన్ని ఆస్వాదించగలం.
గీతా జయంతిని ఎలా ఆచరించాలి?
గీతా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠించాలి. శ్లోక, ప్రతిపదార్థ, భావాలను చదివి, అర్థం చేసుకొని... తమ జీవితాలను శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లేలా తీర్చిదిద్దుకోవాలి.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984