Constipation Relief: మలబద్ధకం వదలాలంటే?
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:59 AM
ఉదయాన్నే కాలకృత్యాలు తీరకపోతే రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన ఆహారశైలి కారణంగా మలబద్ధకం తలెత్తి, తిరిగి రెండో రోజుకి సర్దుకుంటూ ఉంటుంది.
ఉదయాన్నే కాలకృత్యాలు తీరకపోతే రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన ఆహారశైలి కారణంగా మలబద్ధకం తలెత్తి, తిరిగి రెండో రోజుకి సర్దుకుంటూ ఉంటుంది. కానీ ఇదే ఇబ్బంది పదే పదే తలెత్తుతున్నా, రోజుల తరబడి వేధిస్తున్నా సుఖ విరోచనం జరిగేందుకు తోడ్పడే పదార్థాలను తీసుకోవాలి.
కలబంద: కలబందలో ఉండే ‘ఆంథ్రాక్వినోన్స్’ అనే సమ్మేళనాలు పెద్ద పేగుల్లో నీరు ఊరేలా చేసి, మ్యూక్‌సను ఉత్పత్తి చేసి, పేగుల కదలికలను పెంచుతాయి. దాంతో తేలికగా విరోచనం జరిగి మలబద్ధకం వదులుతుంది. కాబట్టి అర కప్పు కలబంద గుజ్జు పరగడుపునే తీసుకుంటే ఫలితం ఉంటుంది.
సబ్జా: నీళ్లతో కలిస్తే సబ్జా జిగురులా తయారవుతుంది. ఆ తత్వం కారణంగా సబ్జా పేగుల్లో తేలికగా కదిలి మలబద్ధకాన్ని వదిలిస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన సబ్జా విత్తనాలను పరగడుపునే తాగితే విరోచనం తేలికగా జరుగుతుంది.
అవిసెలు: వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారు వంటకాల్లో అవిసె గింజలు పొడి చేసుకుని కలుపుకుని తింటే, తగినంత పీచు శరీరానికి అందుతుంది. ఇది మలంతో కలిసి పేగుల్లో తేలికగా జారేందుకు సహాయపడుతుంది.
ఆకు కూరలు: ఆకు కూరల్లో ఉండే మెగ్నీషియమ్‌కు మలాన్ని మెత్తబరిచే గుణం ఉంటుంది. అంతేకాదు. పేగుల్లో నీరు ఊరేలా చేయగల శక్తి మెగ్నీషియమ్‌కు ఉంటుంది. ఈ గుణాల వల్ల ఆకు కూరలు తింటే విరోచనం తేలికగా జరుగుతుంది.
తాజా పళ్లు: కొందరికి తాజా పళ్లు సుఖ విరోచనానికి సహాయపడతాయి. ఆకలి తీరటంతోపాటు మలబద్ధకం తలెతకుండా ఉండాలంటే రోజుకి కనీసం 3 రకాల పళ్లు తినాలి. రాత్రి నిద్రకు ముందు మగ్గిన అరటి పండు తిన్నా ఉదయాన్నే సుఖ విరోచనం అవుతుంది.