Share News

ధనుర్మాసంలో శివ వ్రతం

ABN , Publish Date - Dec 13 , 2024 | 04:04 AM

ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ పాశురాలకు ఉన్న ప్రాధాన్యత సర్వవిదితం. ఆండాళ్‌ పాడిన ఆ పాశురాలను వైష్ణవ సంప్రదాయానికి పట్టుకొమ్మలుగా భావిస్తారు. కాగా అదే కోవలోకి వచ్చే శైవ పాశురాలు కూడా ఉన్నాయి. అవే మాణిక్య వాచకర్‌ రచించిన ‘తిరువెంబావై’ పాశురాలు....

ధనుర్మాసంలో శివ వ్రతం

విశేషం

తిరువెంబావై...

16 నుంచి ధనుర్మాసం

ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ పాశురాలకు ఉన్న ప్రాధాన్యత సర్వవిదితం. ఆండాళ్‌ పాడిన ఆ పాశురాలను వైష్ణవ సంప్రదాయానికి పట్టుకొమ్మలుగా భావిస్తారు. కాగా అదే కోవలోకి వచ్చే శైవ పాశురాలు కూడా ఉన్నాయి. అవే మాణిక్య వాచకర్‌ రచించిన ‘తిరువెంబావై’ పాశురాలు. మాణిక్య వాచకర్‌ శివుడికి మహా భక్తుడు. దివ్య భక్తిపూరితమైన ‘తిరువాసగం’ను ఆయన చెబుతూ ఉంటే... సాక్షాత్తూ శివుడే వాటిని రాశాడని ప్రతీతి. తిరుప్పావై - మార్గళి (శ్రీ) వ్రతం గురించి వివరిస్తే, తిరువెంబావై ‘శివవ్రతా’న్ని ప్రబోధిస్తుంది. ధనుర్మాస ఉషోదయ కాలంలో... శివవ్రతంలో భాగంగా చల్లని నీటిలో స్నానం చేయడానికి కొందరు యువతులు ఇంటింటికీ వెళ్ళి, తోటి చెలులను మేలుకొలుపడానికి పాడిన పాశురాలు దీనిలో చోటు చేసుకున్నాయి. ఈ కావ్యం సారాంశం వైష్ణవులు ఆచరించే మార్గళి వ్రతాన్ని పోలి ఉంటుంది. ఇందులోని పాశురాలు కూడా... ఆండాళ్‌ తన చెలికత్తెలను మేలుకొలపడానికి వెళ్ళినప్పుడు పాడిన రీతిలోనే ఉంటాయి. తిరుప్పావై... వైష్ణవ గ్రంథరాజమైన నాలాయిర ప్రబంధంలో చోటు చేసుకోగా, తిరువెంబవై... మాణిక్యవాచకార్‌ ‘తిరువాసగం’లో చోటు దక్కించుకుంది. తిరుప్పావైలో ముప్ఫై పాశురాలు ఉండగా, తిరువెంబావైలో ఇరవై పాశురాలు, వాటికి అనుబంధంగా మరో పది గీతాలు ఉంటాయి. అయితే తిరుప్పావై అంతటి ప్రాచుర్యం తిరువెంబావై పొందలేదు.


22-navya-13.jpg

పోలికలు, తేడాలు...

తిరుప్పావై, తిరువెంబావై పాశురాల్లో చాలా పోలికలు కనిపిస్తాయి. రెండిటిలోనూ ప్రకృతి వర్ణన, భక్తి, జ్ఞాన మార్గాలను సూచించడం, ఉపనిషత్తుల సారాన్ని పొందుపరచడం జరిగింది. శ్రీరంగనాథుణ్ణి ఉద్దేశించి ఆండాళ్‌ పాడిన పాశురాలు... తిరుప్పావై కాగా, చిదంబరేశ్వరుణ్ణి కీర్తిస్తూ మాణిక్య వాచకర్‌ ఆలపించిన పాశురాలు... తిరువెంబావై. వీటిలో ఇరవై పాశురాలను తిరువణ్ణామలైలో కొలువుతీరి ఉన్న అరుణాచలేశ్వరుని సన్నిధిలో, మరో పది గీతాలను మదురైకి సమీపంలోని తిరుప్పరుందరైలో ఆయన గానం చేశారని చెబుతారు. తిరుప్పావైలో ఆండాళ్‌ తన స్నేహితురాళ్ళతో మార్గళి వ్రతం ఆచరించడం కోసం ఉషఃకాలంలో ఇంటింటికీ వెళ్ళి వారిని మేలుకొలుపుతుంది. తిరువెంబావైలో కూడా కొందరు యువతులు తమతోటి వారిని ఇదే విధంగా మేలుకొలపడం కనిపిస్తుంది. అయితే ఈ రెంటికీ తేడా ఉంది. తిరుప్పావైలో యువతులు శ్రీరంగనాథుణ్ణి కీర్తించినట్టు... తిరువెంబైవైలో యువతులు శివుణ్ణి ప్రార్థిస్తారు. అక్కడ వారు శ్రీరంగనాథుణ్ణి భౌతికమైన కోరికలు కోరుకుంటే... ఇక్కడ వీరు శివుడి అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తారు. తిరుప్పావైలో శ్రీరంగనాథుణ్ణి చేరుకోవడానికి నీలాదేవి అనుగ్రహం కోసం ఆమెను స్తుతించినట్టే... తిరువెంబావైలో యువతులు పరాశక్తి అయిన ఉమాదేవి అనుగ్రహం కోరుతారు, తమకు శివ సాన్నిధ్యాన్ని అందించాలని ప్రార్థిస్తారు. జీవులను ‘మనోన్మని, సర్వభూతదమని, బలప్రమధని, బలవికరణి, కలవికరణి, కాళీ, రౌద్రి, జ్యేష్ట, వామ’ అనే తొమ్మిది రకాల తామస శక్తులు ఆవహించి ఉంటాయి. వాటిని పారద్రోలి, అజ్ఞానం నుంచి మానవులను మేలుకొలిపి, మాలిన్యం నుంచి బయటపడడానికి ‘జ్ఞానం’ అనే చన్నీటి స్నానం చేయడమే మార్గం అనే భావాన్ని తిరువెంబావై పాశురాల్లో అంతర్లీనంగా చెప్పడం జరిగింది.


పరమాచార్యుల ద్వారా ప్రాచుర్యం

శాస్త్రానుసారం శివ కేశవులకు ప్రీతికరమైనది ధనుర్మాసం. ఈ మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజున పరమ శివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా ఆవిర్భించాడని శివపురాణంతో సహా పలు గ్రంథాలు పేర్కొంటున్నాయి. శివ పార్వతుల కల్యాణాన్ని ఈ మాసంలోని ఏదో ఒక సోమవారం నిర్వహించే సంప్రదాయం ఉంది. ధనుర్మాసంలో ఉషఃకాల వ్రతంగా ‘శివవ్రతం’ ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించే సమయంలో తిరువెంబావైని పఠించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీమద్రామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో తిరుప్పావై ప్రాచుర్యం పొందింది. ఈ విధానం తెలుగునాట కుడా ఆనవాయితీగా మారింది. కానీ తమిళ శైవాచార్యులు తగిన ప్రచారాన్ని కల్పించకపోవడంతో మన ప్రాంతాల్లో తిరువెంబావై గురించి ఎక్కువమందికి తెలియదు. ధనుర్మాసంలో తిరుప్పావై, తిరువెంబావై... ఈ రెండూ అవశ్య పఠనీయాలుగా పేర్కొని, వాటికి ప్రాచుర్యం కల్పించినవారు కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. మహా మహిమాన్వితమైన ‘తిరువాసగం’ గురించి, దానిలో పొందుపరిచి ఉన్న తిరువెంబావై, దాని ఆవిర్భావం గురించి భగవాన్‌ శ్రీ మహర్షి విపులంగా వివరించారు. కంచి పీఠంలో, శ్రీరమణాశ్రమంలో.. ధనుర్మాస కాలంలో తిరుప్పావై, తిరువెంబావై... ఈ రెండిటినీ గానం చేస్తారు.

ఆయపిళ్ళ రాజపాప

Updated Date - Dec 13 , 2024 | 04:04 AM