Shraddha Kapoor: హిట్టయినా.. ఫ్లాపయినా.. కష్టం ఒక్కటే
ABN , Publish Date - Sep 29 , 2024 | 05:48 AM
బాలీవుడ్‌లో ఇప్పుడు ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్న పేరు... శ్రద్ధా కపూర్. అందుకు కారణం... ఆమె నటించిన బ్లాక్‌బస్టర్... ‘స్ర్తీ-2’. ఈ చిత్రం వసూళ్లు వందల కోట్లు దాటేసింది. ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. ఇది శ్రద్ధానే కాదు... పరిశ్రమ కూడా ఊహించని ఘన విజయం. ప్రభాస్ ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ... ఇప్పుడు దర్శకనిర్మాతల హాట్ ఫేవరెట్.
సెలబ్ టాక్
బాలీవుడ్‌లో ఇప్పుడు ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్న పేరు... శ్రద్ధా కపూర్. అందుకు కారణం... ఆమె నటించిన బ్లాక్‌బస్టర్... ‘స్ర్తీ-2’. ఈ చిత్రం వసూళ్లు వందల కోట్లు దాటేసింది. ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. ఇది శ్రద్ధానే కాదు... పరిశ్రమ కూడా ఊహించని ఘన విజయం. ప్రభాస్ ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ... ఇప్పుడు దర్శకనిర్మాతల హాట్ ఫేవరెట్.
హిందీ పరిశ్రమలో విలన్‌గా దశాబ్దాలు ఏలిన శక్తికపూర్ తనయగా సినీ రంగ ప్రవేశం చేసినా... ఆమె కెరీర్ పూల పాన్పు కాలేదు. నాన్న పేరుతో బాలీవుడ్‌లో ఎంట్రీ దొరికినా... ఆ తరువాత నిలదొక్కుకోవడానికి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. వరుస అపజయాలతో ఆరంభంలో తడబడినా... నటిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. పధ్నాలుగేళ్ల కిందట విడుదలైన ‘తీన్ పత్తి’ ఆమెకు తొలి చిత్రం. ఆ తరువాత ‘ఆషికీ2, భాగీ, స్ర్తీ, సాహో’ తదితర హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
‘ఫోర్బ్స్ ఇండియా’ మ్యాగజైన్ ‘టాప్ 100 సెలబ్రిటీ’ల జాబితాలో, అలాగే ‘30 అండర్ 30’లో చోటు దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ (9.3 కోట్లు) ఉన్న భారత నటుల్లో ఒకరుగా వెలుగుతోంది. ఎన్నో బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ రాత్రికి రాత్రి సాధించిన విజయాలు కాదు. అపజయం ఎదురైన ప్రతిసారీ... మరింత పట్టుదలగా ప్రయత్నించింది. తన సామర్థ్యం ఏమిటో తనకు తెలుసుకుని... దానికి తగిన పాత్రలు ఎంపిక చేసుకొంటూ అడుగులు వేసింది.
అమ్మ వైపు... నాన్న వైపు... నటులు, సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తులే. కానీ ప్రతిభ లేకపోతే రాణించడం కష్టం. దీన్ని గ్రహించిన శ్రద్ధ... అవకాశం లభించిన ప్రతిసారీ తనను తాను నిరూపించుకొంటూ వచ్చింది. పాత్రకు అనుగుణంగా తన లుక్స్‌ను మార్చుకోవడానికి ఆమె ఎప్పుడూ ముందుంటుంది. అందుకు గత ఏడాది విడుదలై మంచి కలెక్షన్లు సాధించిన ‘తు ఝూఠీ మై మక్కర్’ ఒక ఉదాహరణ. అందులో కథ కంటే శ్రద్ధా కపూర్ ధరించిన బికినీల గురించే ఎక్కువ చర్చ జరిగింది.
బీచుల్లో రణబీర్ కపూర్‌తో ఆమె పండించిన సన్నివేశాలు ‘హాట్’ టాపిక్ అప్పుడు. మరే తారకూ కుదరనంతగా శ్రద్ధకు బికినీలు కుదిరాయనేది డిజైనర్ల మాట. ‘ఆ చిత్రంలో రణబీర్‌కు, నాకు మధ్య సన్నివేశాలు అధిక భాగం సముద్ర తీరాల్లోనే ఉంటాయని దర్శకుడు ముందే చెప్పారు. బీచ్ డ్రెస్స్‌ల్లో అందంగా కనిపించాలంటే శరీరాకృతిని దానికి తగ్గట్టు మలుచుకోవాలి. అందుకోసం జిమ్‌లో ఎంతో శ్రమించాను. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఉదయం ఐదున్నరకల్లా వర్కవుట్స్ ముగించేదాన్ని’ అంటూ ఓ సందర్భంలో చెప్పింది శ్రద్ధ.
‘స్ర్తీ-2’తో ‘తార’స్థాయికి...
గత నెలలో విడుదలైన కామెడీ హర్రర్ చిత్రం ‘స్ర్తీ-2’ శ్రద్ధ స్టార్డమ్‌ను అమాంతం పెంచేసింది. బాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని ‘తార’స్థాయికి తీసుకువెళ్లింది. ఆమె పేరు ప్రతి ఇంటికీ పరిచయమైంది. ఇలాంటి విజయం ప్రతి నటుడి కల. అయితే ఆమెకు ఈ తరహా అనుభవం పూర్తిగా కొత్తేమీ కాదు. కాకపోతే హిందీలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయికల్లో ఒకరుగా ఎదిగిన శ్రద్ధకు ఈ చిత్రం కెరీర్‌లో అతి పెద్ద మలుపు. ఇదే విషయం ఆమె వద్ద ప్రస్తావిస్తే... ‘మా నాన్న వారసత్వం, సినిమా పట్ల నాకున్న గాఢమైన ప్రేమతో సాగుతున్న ప్రయాణంలో భాగం ఈ విజయం. నా కెరీర్‌లో మరో మెట్టు ఎక్కినట్టుగా దీన్ని భావిస్తున్నాను. ఇకపై కూడా చేసే పని అర్థవంతంగా ఉండేలా చూసుకొంటూ, గొప్ప చిత్రాల్లో భాగం కావాలని కోరుకొంటున్నాను. ప్రస్తుతానికి నా దృష్టి దానిపైనే’ అంటూ చెప్పుకొచ్చింది.
నాన్నను చూసి...
సినీ కుటుంబంలో పుట్టిన శ్రద్ధకు షూటింగ్‌లు, సెట్లు, కెమెరాలు కొత్తేమీ కాదు. నటి కావాలన్నది ఆమె చిన్ననాటి కల. ‘నాన్న రోజూ షూటింగ్ నుంచి రకరకాల డ్రెస్సుల్లో, వేషాల్లో ఇంటికి వచ్చేవారు. నేను సెట్స్‌కు వెళ్లినప్పుడు నటనలో ఆయన హావభావాలు, ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే తీరు చూసి ఎంతో ఉత్సుకతకు లోనయ్యేదాన్ని. అదంతా నాకొక మాయాజాలంలా అనిపించేది. కొన్నాళ్లకు అర్థమైంది... నా మనసు కూడా అదే కోరుకొంటోందని’ అని ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంది శ్రద్ధ.
ప్రేమ మరువలేనిది...
‘ఆషికీ2’తో నవతరం ‘ప్రియ’ నాయికగా మన్ననలు అందుకొంటున్న ఆమె... ‘స్ర్తీ2’తో 37 ఏళ్ల వయసులో కెరీర్ బెస్ట్ విజయాన్ని చవిచూసింది. 2018లో విడుదలైన ‘స్త్రీ’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం... బాక్సాఫీసుల వద్ద కనక వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలని ఓ అంచనా. బడా హీరోల రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో శ్రద్ధ మంత్రగత్తెగా నటించింది. ‘అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమ మరువలేనిది. నా నటనతో వాళ్లందరినీ అంతగా అలరించినందుకు గర్వంగా అనిపిస్తోంది’ అంటుంది ఈ భామ.
అదే నిజమైన విజయం...
శ్రద్ధ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు... ఆటుపోట్లు. వేటికీ కుంగిపోలేదు. తన మార్గాన్ని తనే నిర్మించుకుంది. హిట్ సినిమా అయినా... ఫ్లాప్ అయినా... పడే కష్టం ఒకటేనంటుంది. ‘నా దృష్టిలో విజయం అనేది రుచికరమైన భోజనం ఆస్వాదించడం లాంటిది. నా కుటుంబంతో, మనసుకు దగ్గరైన సన్నిహితులతో మధుర క్షణాలను పంచుకోవడం. నిజమైన విజయం అంటే నన్ను ప్రేమించేవారు నా చుట్టు ఉండడం. కంటి నిండా నిద్రపోవడం. చేసే పనిలో అభివృద్ధి సాధించడం. జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం. అన్నిటికీ మించి ప్రశాంతంగా జీవించడం. ఇప్పటికీ మా నాన్న శ్రమిస్తున్నారు. ఆయన గురించి తెలుసుకొంటుంటే... కష్టపడకుండా ఏదీ ఆశించకూడదనేది నాకు బోధ పడింది. ఇలాంటివన్నీ నాకు ఎంతో ప్రేరణనిస్తాయి. విజయ గర్వం నా తలకు ఎక్కకుండా దోహదపడతాయి’... అంటున్న శ్రద్ధా కపూర్ సినిమాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా సహకారం అందిస్తోంది. జంతు ప్రేమికురాలు. కొన్నేళ్ల కిందట నాన్‌వెజ్‌ను వదిలేసి శాకాహారిగా మారింది. సినీ ప్రాజెక్టులే కాదు... ఆమెకు ఉన్న భారీ ఫ్యాన్ ఫోలోయింగ్‌తో బడా బ్రాండ్లు కూడా క్యూ కడుతున్నాయి.