హృదయాలకు అండగా..!
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:32 AM
‘‘నేను పంజాబ్‌లోని లూధియానాలో పుట్టాను. నాకు అయిదేళ్ల వయసు ఉన్నపుడే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిపోయా.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో గుండె జబ్బు పాలైంది. అంతలోనే రోడ్డు ప్రమాదం వెంటాడింది. కలలు కన్న ప్రపంచ సుందరి కిరీటం తృటిలో చేజారింది. అయినా ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం పని చేస్తోంది మాజీ మిస్ వరల్డ్ మొదటి రన్నరప్ శ్రీ సైని. సవాళ్లు ఎదురైనా కుంగిపోకూడదని చెబుతూ... గుండె సంబంధిత వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తోంది.
‘‘నేను పంజాబ్‌లోని లూధియానాలో పుట్టాను. నాకు అయిదేళ్ల వయసు ఉన్నపుడే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిపోయా. అక్కడే పాఠశాలలో చేరా. నాకు నృత్యం చేయడమంటే చాలా ఇష్టం. ఆటలు కూడా బాగా ఆడేదాన్ని. ఒక రోజు పాఠశాలలో నిర్వహించిన పరుగు పందెంలో ఓడిపోయా. అందిరిలా నేనెందుకు వేగంగా పరుగెత్తలేకపోయానో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఒకరోజు మా అమ్మ నన్ను మామూలు ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పుడు నాకు పన్నెండేళ్లు ఉంటాయి. నా చేయి పట్టుకుని నాడి పరీక్షిస్తున్న వైద్యుని ముఖంలో రంగులు మారడాన్ని నేనిప్పటి వరకు మర్చిపోలేదు. నా గుండె అయిదు సెకన్లు కొట్టుకోలేదని ఆ వైద్యుడు చెప్పాడు. వెంటనే ఆరోగ్య పరీక్షలన్నీ పూర్తి చేసి నా గుండెలో బ్లాక్ ఉందని, దానివల్లనే గుండె నిర్ణీత లయలో కొట్టుకోవడం లేదని చెప్పారు. కుటుంబ సభ్యుల రోదనల మధ్యనే నాకు శస్త్రచికిత్స చేసి పేస్‌మేకర్ అమర్చారు. జీవితంలో ఎప్పటికీ నృత్యం చేయకూడదని, శ్రమ అనిపించే ఆటలు ఆడకూడదని వైద్యులు చెప్పినపుడు నా వేదనకు అంతు లేకుండా పోయింది.
ఆత్మవిశ్వాసంతో....
ఎప్పుడో ఎనభై ఏళ్ల తరవాత అమర్చాల్సిన పేస్‌మేకర్‌ను నాకు పన్నెండేళ్లకే పెట్టాల్సి వచ్చింది. దీని వల్లనే నేను ఇంకా బతికి ఉన్నా అని అనుక్షణం గుర్తుకు వచ్చేది. శస్త్రచికిత్స తరవాత నేను కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ఎప్పుడూ మంచంలోనే ఉండడం వల్ల ఒంటరితనం వేధించేది. కాస్త కోలుకున్నాక పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టా. నెలలపాటు హాజరు లేనందున అక్కడ ఇబ్బందులు తప్పలేదు. కన్నీళ్లు దాచుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకొనేదాన్ని. ఎవరు మనల్ని బాధపెట్టినా వారితో మనం ప్రేమగా నే వ్యవహరించాలని అమ్మ చెప్పడం నన్ను ఆలోచనలో పడేసింది. అదే సమయంలో మిస్ వరల్డ్ పోటీలు, ఆ పోటీదార్ల సానూకూల దృక్పథం నన్ను ఆకర్షించాయి. నేను కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని బలంగా నిర్ణయించుకున్నా. పాఠశాల విద్య పూర్తయి కాలేజీలో చేరిన కొన్నాళ్ళకే కారు ప్రమాదంలో నా ముఖం పూర్తిగా కాలిపోయింది. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికే భయపడేదాన్ని. ఒక ఏడాది పాటు కాలేజీ మానేస్తే ముఖానికి సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు. కానీ పాఠశాల సంఘటనలు గుర్తుకు వచ్చి నేను ఎలా కనిపించినా సిగ్గుపడకుండా కాలేజీకి వెళ్లి చదువుకోవాలని నిర్ణయించుకున్నా. కాలిన గాయాలకు ఎండ తగలకుండా తలపై టోపీ, ముఖానికి ముసుగు వేసుకునేదాన్ని. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ప్రపంచ సుందరి పోటీలకు సన్నద్దమవుతూ ఉండేదాన్ని. నిరంతర సాధన, పట్టుదలతో ‘మిస్ వరల్డ్ అమెరికా’గా ఎంపికయ్యా. ‘ప్రపంచ సుందరి 2021’ పోటీల్లో మొదటి రన్నర్‌పగా నిలిచా. ఈ సంఘటన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నాకు అందిన ఈ గౌరవం ఆసరాగా ప్రజలకు మంచి చేయాలని నిర్ణయించుకున్నా.
క్యాన్సర్ కంటే ప్రమాదం....
ప్రపంచంలో మూడో వంతు మంది అంటే ఏటా 18 మిలియన్ల మంది గుండె జబ్బుల కారణంగానే చనిపోతున్నారు. క్యాన్సర్ కంటే గుండె సంబంధిత వ్యాధులే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన శైలి, గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుండె పరీక్షల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నా. ఈ ప్రయత్నం వల్ల 80 శాతం మరణాలను నివారించవచ్చని నా అభిప్రాయం.
సేవా దృక్పథంతో...
శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు అనుభవించాను. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉండాలి. కానీ ఏ సాయం అందని అభాగ్యులు ఎందరో మన చుట్టూ జీవిస్తున్నారు. అలాంటివారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇతరులకు చేయూత అందిస్తే... అది వారి బంగరు భవిష్యత్తుకు భరోసా ఇచ్చినవారం అవుతాం. మనవల్ల ఏ ఒక్కరి జీవితం మలుపు తిరిగినా చాలు... నాకు అంతకు మించిన సంతృప్తి మరొకటి ఉండదు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లాభాపేక్షలేని పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను. గుండె ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’తో కలిసి పని చేస్తున్నాను. నా ప్రయత్నం ఎంతోమందిని అకాల మరణం నుంచి కాపాడింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడంలో వాటిని ఎదుర్కోవడంలో అందరికీ మార్గనిర్దేశనం చేస్తున్నాను.’’
‘‘నాకు ఇప్పటిదాకా ఎనిమిదిసార్లు గుండెకు శస్త్రచికిత్స జరిగింది. రెండుసార్లు పేస్‌మేకర్ మార్చారు. పేస్‌మేకర్లో ఉండే బ్యాటరీలు నిర్ణీత సమయం వరకు మాత్రమే పనిచేస్తాయి. తరవాత కొత్తదాన్ని అమర్చాల్సి ఉంటుంది. ‘నా గుండె చాలా పెద్దది. దానికి జనరేటర్ అమర్చండి’ అని వైద్యులతో హాస్యమాడుతూ ఉంటాను.’’