Share News

Health Tips: ఆరోగ్యంగా అడుగేద్దాం!

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:33 AM

దురలవాట్లను వదిలించుకోవాలన్నా, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నా, కొత్త సంవత్సరానికి మించిన గొప్ప సందర్భం మరొకటి ఉండదు.

Health Tips: ఆరోగ్యంగా అడుగేద్దాం!

కొత్త సంవత్సరంలో సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టాలని మనందరం కోరుకుంటాం. అయితే ఆ ప్రయత్నానికి అడ్డొచ్చే ఆరోగ్య అవరోధాలను తెలివిగా అధిగమించాలి. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.

దురలవాట్లను వదిలించుకోవాలన్నా, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నా, కొత్త సంవత్సరానికి మించిన గొప్ప సందర్భం మరొకటి ఉండదు. అధిక బరువు తగ్గాలనీ, వ్యాయామం చేయాలనీ, ఆరోగ్యకరమైన ఆహారశైలిని అనుసరించాలనీ... ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. అయితే కేవలం కొద్ది మంది మాత్రమే ఆ తీర్మానాలకు కట్టుబడి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ ఎంచుకున్న ఆరోగ్య లక్ష్యాలను అందుకోవాలంటే, అందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం!

బరువు ఇలా తగ్గొచ్చు

శరీర బరువులో ఐదు నుంచి పది శాతం తగ్గినా గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి తీవ్ర రుగ్మతల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ట్రెండ్‌లో ఉన్న రకరకాల డైట్స్‌ తాత్కాలికంగా బరువు తగ్గించవచ్చు. కానీ శాశ్వత ఫలితం దక్కాలంటే ఒక క్రమ పద్ధతిలో వారానికి ఒక కిలో చొప్పున బరువు తగ్గించుకునే నియమాన్ని పెట్టుకోవాలి. అయితే బరువు తగ్గాలనే గట్టి పట్టుదల ఉన్నప్పుడు, తినే ఆహారంలో కూడా పరిమితి పాటించాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు

కొత్త సంవత్సరం జంక్‌ ఫుడ్‌ మానేసి, పోషకభరితమైన ఆహారమే తినాలనే నియమం పెట్టుకుంటే, ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే అంశాల మీద దృష్టి పెట్టాలి. ఈ రోజు సుష్ఠుగా తినేసి, మరుసటి రోజు ఉపవాసం ఉందాం అనుకుంటే పొరపాటు. పరిపూర్ణ ఆరోగ్యం కోసం నిర్దిష్టమైన ఆహారపుటలవాట్లను అనుసరించాలి అనుకున్నప్పుడు ప్రతి రోజూ అదే నియమాన్ని పాటించాలి. సరిపడా మోతాదులో పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటితో మాత్రమే తక్కువ క్యాలరీలు, తక్కువ కొవ్వులు, ఎక్కువ పీచు, విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అలాగే ఆహారం తినేటప్పుడు హడాహుడి ఏమాత్రం పనికి రాదు. పదార్థాలను ఆస్వాదిస్తూ, నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. భోంచేసేటప్పుడు టివి, మొబైల్‌ ఫోన్‌ వాడకం మానేయాలి. పొట్ట నుంచి మెదడుకు సంకేతాలు అందడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి పొట్ట నిండిందనే భావన కలగడాని కంటే ముందే భోజనం ముగిస్తే, అనవసరపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.


తక్కువ కూర్చోవాలి, ఎక్కువ కదలాలి

ఇప్పటివరకూ వ్యాయామం జోలికి వెళ్లనివాళ్లు, కొత్త సంవత్సరంలో జిమ్‌లో చేరిపోయి ఏకబిగిన వ్యాయామాలు చేయడం మొదలుపెడితే, ఆ క్రమం అలాగే ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. కాబట్టి కొత్త ఏడాది శరీరాన్ని చురుగ్గా ఉంచాలనే నియమం పెట్టుకోవాలి. వ్యాయామం చేయడమే కాకుండా, ఇంటికి దూరంగా వాహనాన్ని పార్క్‌ చేసి ఇంటికి నడిచి వెళ్లడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించడం, చిన్న చిన్న దూరాలకు నడకనే ఎంచుకోవడం లాంటివి చేయాలి. ప్రతి శరీరక కదలికకూ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కొన్ని నిమిషాలు తీరిక దొరికినా దాన్ని ఏదో ఒక చిన్నపాటి శరీరక శ్రమకు కేటాయించాలి. ఇల్లు సర్దడం, వాహనాలు కడగడం లాంటి పనులు కూడా వ్యాయమాలే!

వార్షిక పరీక్షలు

ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన వ్యాధులు దరి చేరవు అనుకుంటే పొరపాటు. వయసు పైబడే కొద్దీ శరీరం ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటుంది. వ్యాధినిరోధకశక్తి తగ్గడం, హార్మోన్ల స్రావాలు అదుపు తప్పడం, అంతర్గత ఆరోగ్య వ్యవస్థలు క్రమం తప్పడం లాంటి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఏటా వైద్యులను కలుస్తూ, వయసుకు తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కుటుంబ చరిత్రతో పాటు అప్పటికే ఉన్న రుగ్మతల తీవ్రతలను అంచనా వేసే పరీక్షలు చేయించుకోవాలి. ఇలా పరీక్షలు చేయించుకోవడం వల్ల, ముంచుకొచ్చే ఆరోగ్య ముప్పులను ముందస్తుగానే పసిగట్టగలుగుతాం. ఇలా తొలి దశల్లోనే వ్యాధులను కనిపెట్టగలిగితే చికిత్స కూడా ప్రభావవంతం, సులభతరం అవుతుంది.


ఒత్తిడి ఇలా చిత్తు

పరిపూర్ణమైన మానసిక, శరీరక ఆరోగ్యాల కోసం ఒత్తిడిని అదుపులో ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. ఒత్తిడి అదుపు తప్పితే, శ్వాస వ్యాయామాలతో పాటు, నడక, సంగీతం వినడం, నచ్చిన పని చేయడం లాంటి వాటితో ఒత్తిడి ప్రభావం నుంచి బయటపడవచ్చు. తీవ్రమైన ఒత్తిడి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి. అలాగే ఒత్తిడితో పెరిగే రక్తపోటు మీద ఓ కన్నేసి ఉంచాలి. నిద్రలేమి, ఒంటి నొప్పులు కూడా ఒత్తిడి తాలూకు దుష్ప్రభావాలే!

కంటి నిండా నిద్ర

కంటి నిండా నిద్రపోవడం ద్వారా వ్యాధినిరోధకశక్తి మెరుగు పడుతుంది. మెదడుకు, శరీరానికి సరిపడా విశ్రాంతి దొరికి, కొత్త శక్తిని పుంజుకుంటాయి. కాబట్టి కంటి నిండా నిద్రపట్టడానికి తోడ్పడే అలవాట్లను అలవరుచుకుని, నిద్రకు దూరం చేసే అలవాట్లకు స్వస్థి పలకాలి. నిద్రకు రెండు గంటల ముందు టివి, సెల్‌ఫోన్‌ వాడకం మానేయాలి. సౌకర్యవంతమైన పడక, వెలుతురు చొరబడని పరదాలు పడగ్గదిలో ఏర్పాటు చేసుకోవాలి. నిద్రాభంగం కలగడానికి వీల్లేని వాతావరణాన్ని పడగ్గదిలో కల్పించుకోవాలి. నిద్ర పట్టని సందర్భాల్లో పుస్తకం చదవాలే తప్ప, సెల్‌ఫోన్‌ అందుకోకూడదు. కమ్మని నిద్ర కోసం గోరువెచ్చని పాలు తాగవచ్చు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా ఫలితం ఉంటుంది.

పొట్ట నుంచి మెదడుకు సంకేతాలు అందడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి పొట్ట నిండిందనే భావన కలగడాని కంటే ముందే భోజనం ముగిస్తే, అనవసరపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.

Updated Date - Dec 31 , 2024 | 04:33 AM