Subba Laxmi : మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:10 AM
ట్రాన్స్ మహిళల పట్ల సమాజంలో పాతుకుపోయిన రకరకాల అపోహలకు, దురాభిప్రాయాలకు దీటైన సమాధానం సుబ్బలక్ష్మీ రెడ్డి జీవితం. హైదరాబాద్‌లోని ‘కాదంబరి స్టూడియోస్’
ట్రాన్స్ మహిళల పట్ల సమాజంలో పాతుకుపోయిన రకరకాల అపోహలకు, దురాభిప్రాయాలకు దీటైన సమాధానం సుబ్బలక్ష్మీ రెడ్డి జీవితం. హైదరాబాద్‌లోని ‘కాదంబరి స్టూడియోస్’ బోటిక్ యజమానురాలిగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. ఆమె డిజైన్ చేసిన వస్త్రాలకు సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు... ఎంతో మంది అభిమానులున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తన అనుభవాలను, జీవిత విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘మా కాదంబరీ స్టూడియోస్ బోటిక్‌లో యాభైమందికిపైగా ఉద్యోగులున్నారు. దాని టర్నోవర్ ఏడాదికి నాలుగు కోట్ల రూపాయలు. ప్రతినెలా పదిలక్షల రూపాయల వరకు జీతభత్యాలు చెల్లిస్తాను. లంగా-ఓణీ లాంటి సంప్రదాయ వస్త్రాలను కస్టమర్ల అభిరుచికి తగినట్టుగా సరికొత్తగా డిజైన్ చేయడం మా ప్రత్యేకత. అదీ బడ్జెట్‌లో. అందుకే ఇక్కడి సినిమా, సీరియల్ నటీమణులతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లోని తెలుగువారి నుంచి మాకు ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి. మా దగ్గర నుంచి విదేశాలకు వెళ్లే పార్సిల్స్ రోజుకు పదికి తక్కువ ఉండవు. పెళ్లిళ్లు, సీమంతం, పుట్టినరోజు లాంటి వేడుకలు, శుభకార్యాలకు తగినట్టుగా పెన్‌కలంకారీ దుస్తులు, లెహంగాస్, అనార్కలీ సల్వార్ సూట్స్, లాంగ్ ఫ్రాక్‌లు రూపొందిస్తాం. ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ చేసిన రకరకాల డిజైన్లలో వస్త్రాలు అందిస్తాం. కాబట్టి మా ‘కాదంబరి’ని చాలామంది ఇష్టపడతారు. పెళ్లికుమారుడి సంప్రదాయ దుస్తులు సైతం మా బోటిక్‌లో ఉంటాయి. ఒక డ్రస్సు కుట్టేముందు దాని కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి డిజైనింగ్ వరకు... ప్రతిదీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. అలా ఇప్పటివరకు కొన్నివందల వెరైటీలు డిజైన్ చేసి ఉంటాను. అవి ఫ్యాషన్ వస్త్ర వ్యాపార సముదాయంలో మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇదంతా నాకు నేనుగా సాధించిందే అయినా, ఒక్కరోజులో సాధ్యపడలేదు. నా కఠోర శ్రమ, సృజనాత్మకతతో పాటు మా ఉద్యోగుల తోడ్పాటు వల్ల అతి చిన్న బోటిక్‌తో ప్రారంభమైన మా వ్యాపారం ఆరేళ్ళలో ఒక పరిశ్రమ స్థాయికి ఎదిగింది.
అది పెద్ద పరీక్షా సమయం...
నేను అబ్బాయిగా పుట్టినా... నాది కాని శరీరంలో నేనున్నానన్న బాధ నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. నా లైంగికతకు, సమాజం నన్ను చూస్తున్న తీరుకు మధ్య సంఘర్షణలో నలిగిపోతూ మాటల్లో చెప్పలేనంత మనోవ్యధను అనుభవించాను. ట్రాన్స్‌గా మారే వరకు ఒక రకంగా నరకాన్ని చూశాను. బహుశా... ఇది నాలాంటి వారందరి జీవితానుభవం కూడా కావచ్చు. మాదొక మధ్య తరగతి కుటుంబం. నాన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. అమ్మ ఇంట్లోనే కుట్టు పని చేసేది. నాకు అక్క, అన్నయ్య ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ చదవాలన్నది చిన్నప్పటి నుంచి నా కోరిక. కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించక... పెద్దల ఒత్తిడితో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సరిగ్గా అదే సమయంలో నా అస్తిత్వం బహిర్గతమైంది. నాదైన రూపం మా కుటుంబం కంట పడింది. దాన్ని చూసి వాళ్లు భరించలేకపోయారు. నా అభిమతాన్ని నిరాకరించారు. దాంతో నాకు ఇష్టమైనట్టు బతకడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నిజానికి అది నాకొక పెద్ద పరీక్షా సమయం.
సుబ్బలక్ష్మిగా మారిన తర్వాత...
ట్రాన్స్‌గా మారతానన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించే మా అక్క కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ట్రాన్స్ మహిళలు అనగానే సెక్స్‌వర్క్ లేదంటే యాచకవృత్తి చేసుకొని బతికేవాళ్ళనేది మా కుటుంబ సభ్యుల అభిప్రాయం. నేనలా కానని అన్నాను. ‘‘సమాజం వాళ్ళను అలానే చూస్తుంది కదా’’ అన్నారు. అప్పుడు నన్ను నేను నిరూపించుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. శారీరకంగా ట్రాన్స్‌గా మారడాన్ని కొద్దిరోజులు వాయిదా వేసి, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. ఏడాది వరకు ఉద్యోగంలో చేసి, ఆ జీతంలో మిగిలించుకున్న కొద్దిపాటి డబ్బుతో 2018లో బోటిక్ ప్రారంభించాను. కొన్నాళ్ళకే వ్యాపారం వృద్ధి కావడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఒకరోజు మా సిబ్బందిని పిలిచి... ‘‘ఇప్పటి వరకు మీరు చూస్తున్న నేను ఒక అబద్ధం. ఇకమీదట నాదైన రూపంలోకి మారుతున్నాను. మీకేమైనా అభ్యంతరాలున్నాయా?’’ అనిఅడిగాను. ‘‘మేము మీ సంస్థలో పనిచేస్తున్నాం, అందుకు తగిన జీతం మాకు ఇస్తున్నారు. అంతకుమించి మీ లైంగికతతో, మీ జెండర్‌తో మాకు పనిలేదు. మాకెలాంటి అభ్యంతరం లేదు’’అని వారంతా చెప్పారు. ఒక పెద్దాయన ‘‘ఇన్నాళ్లు నీలో నా కొడుకును చూసుకున్నాను, ఇకమీదట నువ్వు నా కూతురు అనుకుంటాను’’ అన్నారు. అదే ప్రశ్న మా ఇంటి ఓనర్‌ను కూడా అడిగాను. ఆమె నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని, మరింత ధైర్యాన్ని ఇచ్చారు. సుబ్బలక్ష్మిగా మారిన నాకు ఎన్నడూ సమాజం నుంచి అవమానాలు, ఛీత్కారాలు ఎదురుకాలేదు. ఇదివరకు ‘‘అన్నా’’ అని పిలిచిన వారు ఇప్పుడు ‘అక్కా’’ అని పిలుస్తున్నారు. ‘‘సర్’’ అని సంబోధించేవారు కాస్తా ‘‘మేడమ్’’ అంటున్నారు. మా కస్టమర్లు కూడా నా లైంగికతకన్నా నేను రూపొందించిన డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉంది.
అదే నా ప్రత్యేకత...
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదవని నాకు... దుస్తుల డిజైనింగ్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రధాన కారణం దానిమీద నాకున్న ఆసక్తి మాత్రమే. ఇంట్లో అమ్మ మిషన్ కుట్టడం, క్లాత్ కత్తిరించడం లాంటివి చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. మా అక్కతో షాపింగ్‌కు వెళ్లినప్పుడు డ్రెస్సుల రంగులు, వాటి మీద డిజైన్లను క్షుణ్ణంగా చూడటం యుక్త వయసులోనే నాకు ఒక వ్యాపకం అయింది. దానికితోడు సినిమాల్లోని కథానాయికల కాస్ట్యూమ్స్‌ను పరిశీలిస్తుండేదాన్ని. బొటిక్ పెట్టాలన్న ఆలోచన నాకు మొదటి నుంచి ఉంది కనుక... ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ లాంటివన్నీ యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేర్చుకున్నాను. నాకు మొదటి నుంచి మన సంప్రదాయ వస్త్రాలంటే చాలా ఇష్టం. వాటిని ప్రస్తుత కాలానికి తగినట్టుగా కస్టమర్లు ఇష్టపడేలా డిజైన్ చేయడం మొదలుపెట్టాను. ఒక కొత్తదనాన్ని పరిచయం చేశాను. అది ఇవాళ నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది.
కావాల్సింది గౌరవ మర్యాదలు కాదు...
కాదంబరీ స్టూడియోస్ ఫ్రాంఛైజీ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు. వారందరికీ నిర్మొహమాటంగా కుదరదని చెబుతున్నాను. నా వస్త్ర వ్యాపారాన్ని మరింత విస్తరింపచేయాలి. తద్వారా మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది నా లక్ష్యం. మా కమ్యూనిటీలో కుట్టుపనిలాంటివి తెలిసినవారు పెద్దగా లేకపోవడంతో ముగ్గురు ట్రాన్స్ మహిళలకు మాత్రమే నా పరిశ్రమలో ఉద్యోగం ఇవ్వగలిగాను. ట్రాన్స్ వ్యక్తులను అర్థంచేసుకొనేంతగా ఈ సమాజం ఎదగలేదు. కనుక వారికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా అరుదు. ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినా, తోటి ఉద్యోగులు వారిని సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా. అందుకే ట్రాన్స్ వ్యక్తులకు ఉద్యోగాలకన్నా ఆత్మగౌరవంతో బతికేందుకు చిన్నదైనా వ్యాపారమే ఉత్తమం. కాబట్టి వారికి జీవన నైపుణ్యాల శిక్షణ ఇప్పించడం తక్షణ అవసరం. దీన్ని మనమంతా గుర్తించాలి. ట్రాన్స్ మహిళలుగా మాకు ఈ సమాజం నుంచి ప్రత్యేక గౌరవ మర్యాదలేమీ అక్కర్లేదు, వాటిని ఆశించడం లేదు కూడా. సాటి మనుషుల్లా మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు.
చిన్నతనంలో ఇంటా, బయటా, బడిలో... ఇలా ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులకు గురికాని ట్రాన్స్ మహిళ ఉండదు. ప్రతి ట్రాన్స్ మహిళ టీనేజీలో శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు లోనైన బాధితురాలే.! మా జీవితాల్లోని ఆ పార్శ్వాన్ని పట్టించుకునే వారెవరు? మా బాధకు ఉపశమనం కలిగించే చోటెక్కడుంది? కాలేజీలు, మరీ ముఖ్యంగా అబ్బాయిల హాస్టళ్ళలో లైంగికత విభిన్నంగా ఉన్నవారిపై జరిగే హింస మాటలతో చెప్పేది కాదు. ఒకవైపు వేధింపులు, మరోవైపు తామేంటో తమకు తెలియకపోవడం... ఈ మనో వ్యధతో చదువు మీద శ్రద్ధ పెట్టలేక చాలామంది పదో తరగతి, ఇంటర్‌తోనే చదువు మానేస్తున్నారు. వారి అస్తిత్వాన్ని కుటుంబం అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి బయటకువస్తున్నారు. బతుకుదెరువు కోసం యాచకవృత్తి లేదంటే సెక్క్‌వర్క్ లాంటివాటిని ఆశ్రయిస్తున్నారు.