Share News

Manasa: మా త్యాగాల కంటే నితీష్‌ శ్రమే ఎక్కువ

ABN , Publish Date - Dec 16 , 2024 | 03:47 AM

‘‘చిన్నప్పుడు నితీష్‌ యానిమేషన్‌ వీడియోలు, సినిమాలు విపరీతంగా చూసేవాడు. ఆ సమయంలో ‘వీడు క్రికెట్‌ను సీరియ్‌సగా తీసుకొంటాడా’ అనే సందేహం కలిగేది.

Manasa: మా త్యాగాల కంటే నితీష్‌ శ్రమే ఎక్కువ

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట... అలవోకగా అతడు బౌండరీలు బాదాడు. బౌన్సీ పిచ్‌లు అయినా... బౌలర్‌ ఎవరైనా... సొగసైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతడి విజయం వెనుక తల్లి అలుపెరుగని కృషి ఉంది. ఆమె నింపిన ఆత్మవిశ్వాసం ఉంది. ఆస్ర్టేలియా పర్యటనతో భారత టెస్టు జట్టులోకి వచ్చి... అరంగేట్రం సిరీ్‌సలోనే అద్భుతంగా రాణిస్తున్న ఆల్‌రౌండర్‌ నితీ్‌షకుమార్‌రెడ్డి తల్లి మానసతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

‘‘చిన్నప్పుడు నితీష్‌ యానిమేషన్‌ వీడియోలు, సినిమాలు విపరీతంగా చూసేవాడు. ఆ సమయంలో ‘వీడు క్రికెట్‌ను సీరియ్‌సగా తీసుకొంటాడా’ అనే సందేహం కలిగేది. అంతేకాదు... బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టినప్పుడు... ‘ఆల్‌రౌండర్‌గా వాడి కెరీర్‌ ఎలా ఉంటుందో’నని భయమేసింది. కానీ ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీ్‌సలో నితీష్‌ ఆటను ఉద్దండులు సైతం మెచ్చుకొంటుంటే మనసు ఉప్పొంగుతోంది. విశాఖపట్టణం ‘హిందుస్థాన్‌ జింక్‌ స్కూల్‌’లో మూడో తరగతి చదువుతున్నప్పుడే వాడికి క్రికెట్‌ మీద మోజు మొదలైంది. రోజూ బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌కు వెళ్లేవాడు. మావారు ముత్యాలరెడ్డికి కూడా ఆటలపై ఆసక్తి ఉండడంతో కొడుకును మంచి క్రికెటర్‌ను చేయాలనుకున్నారు. దగ్గరుండి గ్రౌండ్‌కు తీసుకువెళ్లేవారు. క్రికెట్‌లో లీనమై చదువును నిర్లక్ష్యం చేస్తాడేమోనని అనిపించేది నాకు. అయితే కోచ్‌లందరూ నితీష్‌ ఆటను మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉండేది. ‘భవిష్యత్తులో మంచి క్రికెటర్‌ అవుతాడ’ని వాళ్లు ఎప్పుడూ అంటుండేవారు.

ఆర్థికంగా ఇబ్బందులు పడినా...

మావారిది ‘హిందుస్తాన్‌ జింక్‌’లో ఉద్యోగం. ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగానే సాగిపోయేది. అయితే నితీష్‌ క్రికెట్‌ కెరీర్‌ను బాగా తీర్చిదిద్దాలనే తపనతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అయినా నితీష్‌ కెరీర్‌కు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. దానికోసం ఆటుపోట్లు ఎన్నిటినో తట్టుకుంటూ ముందుకుసాగాం. కాస్త పెద్దయ్యాక మా అబ్బాయికి మేము పడుతున్న కష్టాలు అర్థమయ్యాయి. కెరీర్‌పై మరింత శ్రద్ధ పెట్టాడు. కఠోర సాధన చేశాడు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదల వాడిలో ఉంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరదతో సెలెక్టర్లను, కోచ్‌లను ఆకర్షించాడు. నితీష్‌ కోసం మేము చేసిన త్యాగాల కంటే... మా నమ్మకాన్ని నిలబెట్టడానికి వాడు పడిన శ్రమే ఎక్కువ.

fgdn.jpg


అకాడమీలో వదల్లేకపోయాం...

కడప ‘ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌’ (ఏసీఏ) అకాడమీలో నితీ్‌షకు అవకాశం వచ్చింది. అక్కడైతే వాడి ఆటతీరు మరింత మెరుగుపడుతుందని, కెరీర్‌ బాగుంటుందని చెప్పడంతో కడప తీసుకువెళ్లాం. అయితే అకాడమీలో వాడిని వదిలిపెట్టేందుకు మాకు మనసు రాలేదు. రెండు రోజులు అక్కడే ఉండి ప్రాక్టీస్‌ సెషన్‌కు బస్సులో వెళుతున్నప్పుడు చూసేవాళ్లం. నేనైతే తిరిగి రాలేకపోయాను. అక్కడ సాధన చేస్తే నితీష్‌ కెరీర్‌ బాగుంటుందని చెప్పి మావారు నన్ను ఓదార్చారు.

నాన్న పేరు చెబితే...

నాన్నంటే నితీ్‌షకు చిన్నతనం నుంచి భయం. భోజనం తినేందుకు మారాం చేస్తే... ‘నాన్న వస్తున్నార’ని చెప్పి తినిపించేదాన్ని. స్కూల్‌ హోమ్‌వర్కు చేయకపోయినా నాన్న పేరు చెబితే చాలు... చేసేసేవాడు. వాళ్ల అక్క తేజస్విని బాగా ఆటపట్టించేవాడు. తనంటే వాడికి ఎంతో ప్రేమ. మా అమ్మాయి మంచి ఆర్టిస్టు. తను వేసే చిత్రాలు చూసి సరదాగా ఏదో ఒకటి అనేవాడు. కానీ మ్యాచ్‌ల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫోన్‌ చేసి అక్క గురించే ఎక్కువగా అడుగుతాడు. అలాగే నితీ్‌షకు తన మామయ్య నరేందర్‌రెడ్డి అన్న చాలా ఇష్టం. ఆయనన్నా వాడికి భయం. కెరీర్‌లో ముందుకువెళ్లే క్రమంలో ఇద్దరూ మంచి స్నేహితుల్లా మారిపోయారు.

yh.jpg

మాకు నమ్మకం కుదరలేదు...

‘జింబాబ్వేలో టీ20 సిరీ్‌సకు వెళ్లే భారత జట్టుకు ఎంపికయ్యా’నని మావారికి నితీష్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. అయితే వాళ్ల నాన్న నమ్మలేదు. ఆ విషయం తను నాతో చెప్పి... ‘నితీష్‌ సరదాగా చెప్పాడా’ అని అడిగారు. ‘సరదాకు మీకు అలా చెప్పడు కదా’ అన్నాను. ఆయనకే కాదు... నాకూ నమ్మకం కుదరలేదు. మరుసటి రోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో నితీ్‌షకు స్థానం లభించినట్టు వార్తలు వచ్చాయి. అవి చూసి ఎంతో సంబరపడ్డాం. కానీ ఆ మర్నాడే గాయం కారణంగా నితీష్‌ జట్టు నుంచి తప్పుకోవాల్సిరావడం వాడినే కాదు... మమ్మల్ని కూడా ఎంతో బాధకు గురి చేసింది. గాయం తగ్గడానికి ఐదు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో తర్వాత జరిగిన శ్రీలంక పర్యటనకు కూడా సెలక్టర్లు నితీ్‌షను ఎంపిక చేయలేదు.


ఆటకు ముందు ఫోన్‌ చేస్తాడు...

చివరకు ప్రస్తుత ఆస్ర్టేలియాలో టెస్ట్‌ సిరీ్‌సకు జాతీయ జట్టులో నితీ్‌షకు స్థానం లభించింది. అతడి ఆరాధ్య క్రికెటర్‌ విరాట్‌ కొహ్లీ నుంచి వాడు క్యాప్‌ అందుకోవడం, తనతో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. ఈ సిరీ్‌సలో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌తో రాణించడం చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో దిగే ముందు తప్పనిసరిగా నాకు ఫోన్‌ చేస్తాడు. నేను ఆల్‌ ద బెస్ట్‌ చెబుతాను. అది మా ఇద్దరికీ సెంటిమెంటుగా మారిపోయింది. మ్యాచ్‌ తర్వాత కూడా ఫోన్‌ చేస్తాడు. ఆటలో రాణించినా... విఫలమైనా సరే... నాతో తన అనుభవాలను పంచుకొంటాడు.

జాలి గుణం ఎక్కువ....

నితీ్‌షకు జాలిగుణం ఎక్కువ. రోడ్ల మీద వృద్ధులు, దివ్యాంగులు, మానసిక రోగులను చూస్తే చలించిపోతాడు. అప్పటికప్పుడు ఏదో ఒక సాయం చేసేస్తాడు. సినిమాల్లో సెంటిమెంట్‌ సన్నివేశాలు కూడా చూడలేడు. ఒకవేళ చూసినా... కళ్ల వెంట నీళ్లు కారిపోతుంటాయి. ఈ మధ్య మా ఇంటి దగ్గరున్న అనాథ శరణాలయంలో నితీష్‌ పుట్టిన రోజు వేడుకులు చేశాం. మంచి వంటకాలతో మధ్యాహ్న భోజనం పెట్టాం. కార్యక్రమం పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేశాం. ఆ తరువాత నితీష్‌ బయటకు వెళ్లి అనాఽథలందరికీ ఐస్‌క్రీమ్‌లు కొని ఇచ్చాడు. ‘ఇంతగా చలించిపోయేవాడు... బౌండరీలు బాదినప్పుడు పొరపాటు బౌలర్‌ ముఖంలో బాధ కనిపిస్తే జాలితో అవుటైపోతాడా’ అనిపించేది.

వాడి కోసం క్రికెట్‌ తెలుసుకున్నా...

ఒకప్పుడు నాకు క్రికెట్‌పై కనీస అవగాహన ఉండేది కాదు. నితీష్‌ బాగా ఆడుతున్నాడని మావారితోపాటు బయటవాళ్లు చెప్పినప్పుడు సంతోషించేదాన్ని. కెరీర్‌ కోసం వాడు చూపుతున్న శ్రద్ధ, పడుతున్న శ్రమ గ్రహించి, నా వంతుగా క్రికెట్‌ కోసం కొంతైనా తెలుసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు బ్యాట్‌ పట్టుకుని ఆడలేను కానీ తప్పొప్పులు చెప్పగలను.’’

పి.భాస్కర్‌, విశాఖపట్నం


కెరీర్‌ గురించి ఆలోచిస్తాడా..!

చిన్నప్పటి నుంచి యానిమేషన్‌ వీడియోలు, పవర్‌ రేంజర్స్‌ సినిమాలు అంటే నితీ్‌షకు ఎంతో ఆసక్తి. ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే యానిమేషన్‌ ఫిలిమ్స్‌ చూస్తూ ఆస్వాదిస్తాడు. ‘పవర్‌ రేంజర్స్‌’ సిరీ్‌సలు వదలకుండా చూస్తాడు. ‘వీడు యానిమేషన్‌ వీడియోలు తెగ చూస్తున్నాడు. క్రికెట్‌ కెరీర్‌ గురించి సీరియ్‌సగా ఆలోచిస్తాడా’ అని ఒక్కోసారి నాకు సందేహం కలిగేది. కానీ దేని సమయం దానికి కేటాయించేవాడు. యానిమేషన్‌ వీడియోలు చూడడంవల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నాడని కొంతకాలానికి నాకు అర్థమైంది.

పవన్‌, మహేష్‌ అభిమాని...

నితీ్‌షకు క్రికెట్‌లో విరాట్‌ కొహ్లీ ఆరాధ్య దైవం. సినిమాల్లో పవన్‌కల్యాణ్‌, మహే్‌షబాబు అంటే చాలా ఇష్టం. వాళ్లద్దరి సినిమాలు వదలకుండా చూస్తాడు. మిగిలినవాళ్ల చిత్రాలంటే అంతగా ఆసక్తి చూపడు.

వంకాయ వండొద్దు ప్లీజ్‌...

నితీష్‌ మితాహారి. కాయగూరలు తినడానికి ఇష్టపడేవాడు కాదు. మాంసాహారం ఇష్టం. కాయగూరలు వండితే కాదనలేక తినేవాడు. బయటకు వెళ్లే ముందు... ‘అమ్మా... వంకాయ, బెండకాయ వండొద్దు ప్లీజ్‌’ అని బతిమలాడేవాడు. ‘వండను’ అని చెప్పినా, చిన్న పిల్లాడిలా గెడ్డం పట్టుకొనిమరీ మళ్లీ అదే చెప్పేవాడు... ‘ప్లీజ్‌ అవి వండకమ్మా’ అని. ఇప్పటికీ అందులో ఎలాంటి మార్పూ రాలేదు.

అక్క చాక్లెట్లు లాక్కొని...

నితీ్‌షకు చాక్లెట్లంటే చాలా ఇష్టం. బడికి వెళ్లినప్పుడు తనతోపాటు అక్కకు పెట్టిన చాక్లెట్స్‌ కూడా బలవంతంగా లాక్కొని తినేవాడు. ఇప్పటికీ చాక్లెట్స్‌ ఇష్టంగా తింటాడు.

Updated Date - Dec 16 , 2024 | 03:47 AM