Share News

Perumal Temple : కాళింగ నర్తన పెరుమాళ్‌ ఆలయం

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:29 PM

ఏ ఆలయమైనా... గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ పేరిట ప్రాచుర్యం పొందడం సర్వసాధారణం. కానీ ఉత్సవమూర్తి పేరుతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకటుంది. అదే శ్రీకాళింగ నర్తన పెరుమాళ్‌ ఆలయం. తమిళనాడులోని ఊతుక్కాడులోని ఈ ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా

Perumal Temple : కాళింగ నర్తన పెరుమాళ్‌ ఆలయం

ఏ ఆలయమైనా... గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ పేరిట ప్రాచుర్యం పొందడం సర్వసాధారణం. కానీ ఉత్సవమూర్తి పేరుతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఒకటుంది. అదే శ్రీకాళింగ నర్తన పెరుమాళ్‌ ఆలయం. తమిళనాడులోని ఊతుక్కాడులోని ఈ ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి ప్రధాన దైవం... శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేదనారాయణ పెరుమాళ్‌. ఈ కోవెలను శ్రీకాళింగ నర్తన పెరుమాళ్‌ సన్నిధిగా వ్యవహరించడానికి కారణాన్ని స్థలపురాణం వివరిస్తోంది.

పూర్వం ఊతుక్కాడ్‌లో అతి పురాతనమైన వేదనారాయణస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి నారద మహర్షి వచ్చాడు. ఆలయంలోకి వెళ్ళే ముందు... కళింగమాడు అనే పేరుతో అక్కడ ఉన్న చిన్న కొలనులో స్నానం చేశాడు. అప్పుడు ఆయనకు... కాళీయ మర్దన భంగిమలో ఉన్న కృష్ణుడి విగ్రహం దొరికింది. దాన్ని ఆయన ఆలయంలోకి తీసుకువెళ్ళి... వేదనారాయణుడి సన్నిధిలో ఉంచాడు. తమిళంలో కాళీయుణ్ణి కాళింగుడిగా వ్యవహరిస్తారు. కాళీయుడి (కాళింగుడి) పడగల మీద నర్తిస్తున్నట్టున్న ఆ విగ్రహం... శ్రీకాళింగ నర్తన పెరుమాళ్‌గా... రుక్మిణీ, సత్యభామా సమేతంగా పూజలు అందుకుంటోంది. కాగా, కాళీయ మర్దన నృత్య దృశ్యాన్ని... కామధేనువు పిల్లలైన నందిని, పట్టి అనే దివ్యమైన గోవుల ముందు, నారదుడి ముందు శ్రీకృష్ణుడు ప్రదర్శించాడనే మరో కథ ఉంది. దానికి గుర్తుగా... తాండవ కృష్ణుడి సమీపంలో ఆ రెండు గోవులు కూడా కనిపిస్తాయి. పడగ మధ్యలో మానవరూపం కలిగిన అయిదు తలల సర్పం మీద ఎడమపాదాన్ని ఉంచి, కుడి పాదాన్ని పైకి లేపి నర్తించే కృష్ణుడు... ఒక చేత్తో పాము తోకను తాకుతూ, మరో చేత్తో భక్తులకు అభయం ఇస్తూ ఉంటాడు. సాక్షాత్తూ నారదుడి అవతారంగా పేరుపొందిన శ్రీ వెంకట సుబ్బ అయ్యర్‌ (వెంకటకవి) ... ఈ స్వామిని స్తుతిస్తూ అనేక గీతాలను రాశారు.


ఈ ఆలయ ప్రధాన గోపురం ఆదిశేషుణ్ణి పోలి ఉంటుంది. ఈ ప్రాంగణంలో మహాలక్ష్మి ఆలయం ఉంది. ప్రధానద్వారానికి ఎడమవైపు నర్తించే వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయం లోపల పంచముఖ ఆంజనేయుడు, ఆండాళ్‌, వరదరాజస్వామి, ఊతుక్కాడు వెంకటకవి మందిరాలు ఉన్నాయి. రోహిణీ నక్షత్రం రోజున ఈ ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. మే, జూన్‌ నెలల మధ్యలో వసంతోత్సవం, శ్రావణమాసంలో కృష్ణాష్టమి ఉత్సవం జరుగుతాయి.

ఎలా వెళ్ళాలి?: తమిళనాడులోని కుంభకోణానికి సుమారు పధ్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కుంభకోణం నుంచి బస్సులు, పైవ్రేటు వాహనాల్లో చేరుకోవచ్చు.

Updated Date - Jun 27 , 2024 | 11:29 PM