వ్యాపకంగా మొదలై... ఎందరికో ఆదర్శమై
ABN , Publish Date - Nov 23 , 2024 | 06:22 AM
ఆమె సాధారణ గృహిణి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టింది. వ్యాపకంగా మొదలై... ఇప్పుడు ఏడాదికి ముప్ఫై లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది.
ఆమె సాధారణ గృహిణి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టింది. వ్యాపకంగా మొదలై... ఇప్పుడు ఏడాదికి ముప్ఫై లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. విభిన్నమైన ఔషధ రకం పుట్టగొడుగులను పెంచుతూ... లాభాల పంట పండిస్తోంది. పారిశ్రామికవేత్తగా తనలాంటి మహిళలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న సుమన్ సాఖీజా ప్రయాణం ఇది..
సుమన్‌ది ఢిల్లీలోని ద్వారక. ఆమెకు తన పిల్లలే ప్రపంచం. వాళ్ల ఆలనాపాలనతోనే రోజులు గడిచిపోయేవి. క్రమంగా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ల చదువులేవో వాళ్లు చదువుకుంటున్నారు. దాంతో సుమన్‌కు ఖాళీ సమయం దొరికింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది ఆమె. ఇంటివద్ద ఉంటూనే ఏదైనా చేయాలని భావించింది. అదే సమయంలో పుట్టగొడుగుల పెంపకం గురించి తెలిసింది. హరియాణాలోని హైక్ మష్రూమ్ అండ్ అగ్రికల్చరల్ డెవల్‌పమెంట్ సెంటర్ వాళ్లు శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని... అందులో చేరింది. అక్కడ శిక్షణ తీసుకుంటూనే, వివిధ మాధ్యమాల ద్వారా పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించింది.
అరుదైన రకం...
సైన్స్‌పై ఏ మాత్రం అవగాహన లేని సుమన్ బటన్ పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ తీసుంది. ఈ క్రమంలోనే ఆమెకు కార్డిసెప్స్ మిలిటరీస్ అనే ఔషధ గుణాలున్న పుట్టగొడుగుల గురించి తెలిసింది. వీటిపై పరిశోధన ప్రారంభించింది. ఇవి హిమాలయాల్లో మాత్రమే లభించే ప్రత్యేకమైన ఫంగ్‌సలని తెలుసుకుంది. కాస్త శ్రద్ద పెడితే వీటిని ప్రయోగశాలల్లో కూడా పెంచవచ్చని ఆమెకు అర్థమైంది. దీనితో వీటి పెంపకాన్ని ఇంట్లోనే నిర్వహించాలని నిర్ణయించుకుంది సుమన్.
ఎదురు చూడక్కర్లేదు...
‘‘కార్డిసె్‌ప్సను పెంచడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. కేవలం 200 చదరపు అడుగుల స్థలంలో నాలుగు లక్షల పెట్టుబడితో ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నా. థాయ్‌లాండ్ నుంచి కార్డిసెప్స్ విత్తనాలను తెప్పించుకుని పుట్టగొడుగుల పెంపకం ప్రారంంభించాను. ఇవి చాలా తక్కువ సమయంలోనే చేతికి అందివస్తాయి. అంతేకాదు... చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. వెంటనే అమ్ముడుపోవాలన్న ఆందోళన అక్కర్లేదు. ఏడాదికి నాలుగు పంటలు పండించుకోవచ్చు. ఈ కార్డిసె్‌ప్సలో అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, మలబద్దకం, మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల నివారణకు వీటిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది సుమన్.
పుష్కలంగా ఔషధ గుణాలు...
‘‘నేను కార్డిసెప్స్ పుట్టగొడుగుల పెంపకం గురించి పరిశోధించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. వీటిని సేకరించడం చాలా కష్టం. అంతేకాదు... వీటి కోసం పర్వత ప్రాంతాల్లో మనుషుల తిరగడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆ ప్రాంతాల్లో మరలా ఈ పుట్టగొడుగులు ఉత్పత్తి కాకపోవచ్చు. వీటికి ఉన్న ఔషధ గుణాలవల్ల రకరకాల మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. డిమాండ్ కూడా అధికంగానే ఉంది. ఒక కేజీ కార్డిసెప్స్ మూడు లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. సహజంగా లభించే కార్డిసెప్స్ కంటే ప్రయోగశాలల్లో పెంచేవి సరసమైన ధరకు లభిస్తాయి. వీటి అమ్మకాల కోసం ఇటీవలే ఆరెంజ్ హెర్బ్ బ్రాండ్ పేరిట సంస్థను ప్రారంభించాం’’ అంటారు సుమన్. ఈ సంస్థ ద్వారా వినూత్న సాగు పద్ధతులను పరిచయం చేసి, మరింతమంది మహిళలను సాధికారత వైపు అడుగులు వేయించాలన్నది ఆమె ఆశయం.
మహిళలకు శిక్షణ...
పుట్టగొడుగుల పెంపకంలో ఆసక్తిగల ఔత్సాహిక మహిళలకు సుమన్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. ప్రతి నెలా 20 నుంచి 30 మంది వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకొంటున్నారు. సొంత ప్రయోగశాలలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్డిసెప్స్ పెంపకంతోపాటు సుమన్ కుంకుమ పూల సాగును కూడా నిర్వహిస్తోంది. ఏడాదికి 600 గ్రాముల కుంకుమ పువ్వు ఉత్పత్తి చేసి, మూడు లక్షల టర్నోవర్ సాధించింది. ఆగస్టు నుంచి నవంబరు వరకు కుంకుమ పువ్వు సాగుకు అనుకూలంగా ఉంటాయని, మిగతా సమయమంతా కార్డిసెప్స్‌ను పెంచుతానని సుమన్ చెప్పుకొచ్చింది.