Study : అధిక బరువుకు అదే కారణం
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:11 AM
Study Reveals Why Fat Cells Hinder Weight Loss Progress
ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడానికి కారణం మన కొవ్వు కణాల్లో ఉంటుంది. కొవ్వు కణాలు ఒబేసిటీకి సంబంధించిన జ్ఞాపకాన్ని కలిగి ఉంటాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది.
బరువు తగ్గడం ఒక ఎత్తైతే, తగ్గిన బరువును కొనసాగించడం మరొక ఎత్తు. అధిక బరువు అదుపు ఎందుకింత సమస్యగా మారుతుందో కనిపెట్టడం కోసం పరిశోధకులు అధ్యయనాలు చేపట్టారు. కొవ్వు కణాలు జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయనీ, కష్టపడి బరువు తగ్గినా, మళ్లీ బరువును పెంచేస్తూ ఉంటాయనీ. ఫలితంగా తగ్గిన బరువును కొనసాగించడం కష్టంగా మారుతుందనీ ఆ అధ్యయనంలో పరిశోధకులు కనిపెట్టారు. అలాగే అధిక బరువు, జన్యువుల పనితీరు మీద ప్రభావం చూపించే రసాయన మార్కర్లలో మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పుల వల్ల కొవ్వు కణాల పనితీరు క్రమం తప్పుతుంది. దాంతో కష్టపడి బరువు తగ్గినా, మునుపటి బరువుకు చేరుకునేలా కొవ్వు కణాలు స్పందిస్తాయి. అధిక బరువును కలిగి ఉన్న వ్యక్తులు, సాధారణ వ్యక్తుల నుంచి సేకరించిన కొవ్వు కణజాలాన్ని అధ్యయనం చేసినప్పుడు, ఆ రెండు కోవలకు చెందిన వ్యక్తుల్లో జన్యు కార్యకలాపాలు భిన్నంగా ఉన్నట్టు పరిశోధకులు కనిపెట్టారు. అధిక బరువు కలిగిన వాళ్లలో, ఇన్‌ఫ్లమేషన్ సంబంధిత జన్యువులు మరింత చురుగ్గా ఉన్నట్టు తేలింది. ఫలితంగా తేలికగా బరువు పెరగడం, పెరిగిన బరువును కోల్పోవడం కష్టతరం కావడం, కష్టపడి కోల్పోయిన బరువు తిరిగి పెరిగిపోవడం లాంటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ కోవకు చెందిన వ్యక్తులు తగ్గిన బరువును కొనసాగించడం కోసం క్రమం తప్పక వ్యాయామం, ఆహార నియమాలు పాటించక తప్పదని పరిశోధకులు సూచిస్తున్నారు.