రక్తహీనతకు సిద్ధ వైద్యం
ABN , Publish Date - Sep 12 , 2024 | 04:57 AM
డాక్టర్! మా అమ్మాయికి పదిహేనేళ్లు. రక్తహీనతతో బాధపడుతోంది. వైద్యులు సూచించిన మందులు కూడా అంతగా ఫలితాన్నివ్వలేదు. బలహీనత, నిస్సత్తువలతో బాధపడుతున్న మా అమ్మాయికి సమర్థమైన సిద్ధ మందులను సూచిస్తారా?
డాక్టర్! మా అమ్మాయికి పదిహేనేళ్లు. రక్తహీనతతో బాధపడుతోంది. వైద్యులు సూచించిన మందులు కూడా అంతగా ఫలితాన్నివ్వలేదు. బలహీనత, నిస్సత్తువలతో బాధపడుతున్న మా అమ్మాయికి సమర్థమైన సిద్ధ మందులను సూచిస్తారా?
- ఓ సోదరి, హైదరాబాద్.
అనీమియాకు సిద్ధ వైద్యంలో అద్భుమైన మందులున్నాయి. ఇటీవలే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ (ఎన్‌ఐఎ్‌స), ఆయుష్ మంత్రిత్వ శాఖ, తమిళనాడులోని వెలుమైలు సిద్ధ మెడికల్ కాలేజీలకు చెందిన పరిశోధకులు, నిపుణులు అన్నపెటి సెంటురమ్, భావన కటుక్కాయ, మతులై మనప్పాకు, ఉసిరి లేహ్యాలను తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ మోతాదు పెరుగుతుందని ప్రయోగాల ద్వారా కనిపెట్టారు. ఈ సిద్ధ మందులతో ప్యాక్‌డ్ సెల్ వాల్యూమ్, మీన్ కార్ప్‌సక్యులర్ హిమోగ్లోబిన్‌లు కూడా పెరుగుతాయని, తద్వారా కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించవచ్చని కనిపెట్టారు.
45 రోజుల వైద్యం
సాధారణంగా రక్తహీనతలో అలసట, నిస్సత్తువ, తలతిరుగుడు, తలనొప్పి, ఆనొరెక్సియా మొదలైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆకలి కూడా తగ్గిపోతుంది. ఈ లక్షణాలు కనిపించిన ఆడపిల్లలు నెలసరి సమయంలో మరింత బలహీనపడిపోతూ ఉంటారు. ఇదే పరిస్థితి మరింత తీవ్రమైతే ఎదుగుదల, పునరుత్పత్తి వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి రక్తహీనతను గుర్తించిన వెంటనే సమర్థమైన జాగ్రత్తలతో సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేయాలి. పైన పేర్కొన్న సిద్ధ మందులను క్రమం తప్పకుండా 45 రోజుల పాటు అందించగలిగితే కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ 11.9 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటరు ఉండాలి. హిమోగ్లోబిన్ మోతాదు 8.0 ఎమ్‌జి/డిఎల్‌కు పడిపోతే తీవ్రమైన అనీమియాగా పరిగణించాలనీ, 8.0 నుంచి 10.9 ఎమ్‌జి/డిఎల్‌ను మధ్యస్థ అనీమియాగా పరిగణించాలనీ, 11.0 నుంచి 11.9 ఎమ్‌జి/డిఎల్‌ను స్వల్ప అనీమియాగా పరిగణించాలనీ, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కాబట్టి రక్తపరీక్షలో అనీమియాగా తేలితే, పౌష్ఠికాహారంతో పాటు సిద్ధ వైద్యం సూచించే మందులను వాడుకోవడం మొదలుపెట్టాలి. 45 రోజుల్లో కచ్చితమైన ఫలితం కనిపిస్తుంది.
- డాక్టర్ మోహన్
సిద్ధ వైద్యులు, హైదరాబాద్