భరణం అంటే భర్తను దోచుకోవడం కాదు
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:01 AM
విడాకుల అనంతరం భరణానికి సంబంధించిన నిబంధనలు భార్య సంక్షేమానికి ఉద్దేశించినవే తప్ప భర్తను భయపెట్టేందుకో, బెదిరించేందుకో, శిక్షించేందుకో, దోపిడీ చేసేందుకో ఉద్దేశించినవి కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ

న్యూఢిల్లీ, డిసెంబరు 20: విడాకుల అనంతరం భరణానికి సంబంధించిన నిబంధనలు భార్య సంక్షేమానికి ఉద్దేశించినవే తప్ప భర్తను భయపెట్టేందుకో, బెదిరించేందుకో, శిక్షించేందుకో, దోపిడీ చేసేందుకో ఉద్దేశించినవి కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె అవసరాలకు తగ్గట్టుగానే మనోవర్తి ఉంటుందని తెలిపింది. భర్తకు సంపద ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా మనోవర్తి ఇవ్వాలని అడగలేరని తెలిపింది. ‘‘విడాకుల అనంతరం భర్త హోదా పెరిగి ఉండవచ్చు. అంతమాత్రాన జీవితకాలమంతా అదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. అందువల్ల ఆయన హోదా పెరిగింది కాబట్టి భరణం కూడా పెంచాలని అడగలేరు. ఆయన వ్యక్తిగత అభివృద్ధిపై భారం మోపలేరు’’ అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. సరిదిద్దలేని పరిస్థితికి చేరుకోవడంతో ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లయిన కొద్ది కాలానికే ఆ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. భార్యకు శాశ్వత మనోవర్తి కింద రూ.12 కోట్లు ఇవ్వాలని, నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని భర్తను ఆదేశించింది.
మొదటి భార్యకు రూ.500 కోట్లు మనోవర్తి కింద ఇచ్చారని, అందువల్ల ఆయన సంపదకు తగ్గట్టుగా తనకూ భరణం ఇవ్వాలంటూ ఆ భార్య చేసిన వినతిని తిరస్కరించింది. తన భర్తకు రూ.5,000 కోట్ల ఆస్తి ఉందని చెప్పిన విషయాన్నీ ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహ వ్యవస్థ పవిత్రమైనదని, కుటుంబానికి పునాది అని తెలిపింది. ఇదేమీ వ్యాపార సంస్థ కాదని పేర్కొంది. కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు అత్యాచారం, క్రిమినల్ వేధింపులు, క్రూరత్వం తదితర ఆరోపణలతో ‘కంబైన్డ్ ప్యాకేజీ’ రూపంలో కేసులు పెడుతుండడాన్ని పలుమార్లు సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేసింది. కఠినమైన ఈ నిబంధనలన్నీ వివాహితల సంరక్షణకు ఉద్దేశించినవే తప్ప భర్తను వేధించడానికి కాదని మహిళలు గుర్తుంచుకోవాలని తెలిపింది. భర్త, అత్తింటివారి నుంచి సొమ్ములు వసూలు చేయాలన్న లక్ష్యంతోనే తీవ్రమైన ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెడుతున్నారని పేర్కొంది. భర్త హోదాకు తగ్గట్టుగా తన జీవన శైలి కూడా ఉండాలని కోరుకోవడం తగదని పేర్కొంది. ఒకవేళ విడాకులు తీసుకున్న తరువాత భర్త పేదగా మారితే అప్పుడేమైనా బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించింది. భర్తపై ఆమె పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను కొట్టివేసింది.