Navya : ఆమే అతడి విజయం
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:40 AM
దేవిషా శెట్టి పేరు ప్రపంచానికి తెలిసింది భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జీవిత భాగస్వామిగానే కావచ్చు... కానీ ఆమెకంటూ ఒక గుర్తింపు ఉంది.
భారత క్రికెట్‌లో పెను తుపాను సూర్యకుమార్ యాదవ్. అతడు క్రీజ్‌లోకి వచ్చింది మొదలు పెవిలియన్‌కు వెళ్లేదాకా... బౌండరీల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఒకప్పటి సాధారణ ఆటగాడు నేడు ఆసా ధారణ ఆటతో చెలరేగుతున్నాడంటే... అది అతనొక్కడి విజయం కాదు. అన్నింటా తోడై... స్ఫూర్తి మంత్రమై... సూర్యలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిం చిన అతడి సహచరి... దేవిషా శెట్టికీ అందులో భాగం దక్కుతుంది. జాతీయ టీ20 జట్టు కెప్టెన్‌గా అతడు అపురూప విజయాలు అందిస్తున్నా డంటే... దాని వెనుక ఆమె కృషి వెల కట్టలేనిది.
దేవిషా శెట్టి పేరు ప్రపంచానికి తెలిసింది భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జీవిత భాగస్వామిగానే కావచ్చు... కానీ ఆమెకంటూ ఒక గుర్తింపు ఉంది. ముంబయిలో పుట్టి పెరిగిన దేవిషా బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంశక్తితో ఎదిగిన పారిశ్రామికవేత్తగా, మంచి నర్తకిగా, నాట్య గురువుగా, సామాజిక కార్యకర్తగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ‘బాంబే స్కాటిష్ స్కూల్’లో ప్రాథమికోన్నత విద్య పూర్తి చేసిన ఆమె... ‘ఆర్‌ఏ పొదార్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజీ’ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ‘హెచ్‌ఆర్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్’లో మాస్టర్స్ చదివారు. ఆమె తండ్రి దేవ్‌దాస్ శెట్టి హోటల్ రంగంలో పని చేస్తున్నారు. తల్లి లత గృహిణి. వీరి ఇద్దరు కూతుర్లలో రెండో సంతానం దేవిషా.
నాట్య గురువుగా మొదలై...
బాల్యం నుంచి దేవిషాకు కళలంటే మక్కువ. అందుకే చదువుతూనే సంప్రదాయ నాట్యం అభ్యసించారు. కళాకారిణిగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తరువాత నాట్య గురువుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇప్పుడామె ముంబయిలో పేరుపొందిన డ్యాన్స్ కోచ్. అంతేకాదు... సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. చదువుకొనే రోజుల్లో స్వచ్ఛంద సంస్థ అయిన ‘లైట్‌హౌస్ ప్రాజెక్ట్’తో కలిసి రెండేళ్లపాటు వాలంటీర్‌గా పని చేశారు. అనాథలు, అణగారిన వర్గాల పిల్లలకు అండగా నిలిచే సంస్థ అది. ఆ సంస్థ తరుఫున పలు మురికివాడల్లో పర్యటించారు.
పరిచయం అలా...
సూర్యకుమార్ యాదవ్‌ను దేవిషా తొలిసారి చూసింది తన కాలేజీ వేడుక(2012)లో. ఆ వేడుకలో ఆమె నాట్యం చూసి ముగ్ధుడయ్యాడు సూర్య. అక్కడే ఇద్దరికీ పరిచయమైంది. తరువాత స్నేహితులయ్యారు. కొన్నాళ్ల స్నేహంలో మనసులు కలిశాయి. దేవిషా డ్యాన్స్‌ను ఆస్వాదిస్తూ సూర్య... మైదానంలో అతడి సొగసరి షాట్లకు చప్పట్లు కొడుతూ ఆమె... ఒకరి కోసం ఒకరన్నట్టు నాలుగేళ్లు వారి ప్రేమాయణం సాగింది. ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని... ఇకపై కలిసి జీవిద్దామని నిర్ణయించుకుని... 2016లో ఇద్దరూ ఒక్కటయ్యారు.
అండగా... ఆత్మస్థైర్యంగా...
భార్యంటే భర్తలో సగం. దాన్ని అక్షర సత్యం చేసి చూపారు దేవిషా. పెళ్లి నాటి నుంచి జీవిత భాగస్వామిగా సూర్య కెరీర్‌కు ఆమె మూల స్తంభం అయ్యారు. ఇప్పుడైతే కళ్లు చెదిరే షాట్లతో అలరిస్తున్నాడు కానీ... కెరీర్ ఆరంభంలో సూర్య ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఎత్తుపల్లాలను చూశాడు. అలాంటి సమయంలో అతడికి అండగా నిలిచారు దేవిషా. ఒక దశలో తన ప్రతిభపై తనకే సందేహపడినప్పుడు... అతడిలో ఆత్మస్థైర్యం నింపారు. శారీరకంగానే కాకుండా... మానసికంగానూ సూర్యను దృఢంగా మార్చడంలో దేవిషా కృషి అమూల్యం. భారత జట్టులో చోటు కోసం ప్రయత్నించి విఫలమైనప్పుడు... ఇక తనకు అది అందదని అనుకున్నప్పుడు ఆమే ధైర్యం చెప్పారు. అతడి ఆటపై అతడికి నమ్మకం కలిగించి, బలహీనతలను అధిగమించేలా ఆత్మవిశ్వాసాన్ని నింపి... తిరుగులేని ఆటగాడిగా తీర్చిదిద్దడంలో సఫలం అయ్యారు. అందుకే సంతోషమైనా... బాధైనా... విజయమైనా... వైఫల్యమైనా సూర్య తొలుత తన భార్యతోనే పంచుకొంటాడు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లినప్పుడు, మానసికంగా కుంగిపోయినప్పుడు... అతడికి గుర్తుకువచ్చేది దేవిషా మాత్రమే. అలాగే ఆమె కెరీర్‌కు ఏమేం కావాలో అవన్నీ సూర్య చేసి పెడతాడు. అడిగినవ్నీ సమకూర్చుతాడు. ఇద్దరి మధ్య ఎలాంటి బేషజాలు, ఎక్కువ తక్కువ అనే భావనలు లేవు.
ప్రతి సందర్భంలోనూ...
2021లో జాతీయ జట్టుకు ఎంపికైన సూర్య... ఆ మరుసటి ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో దుమ్ము రేపే బ్యాటింగ్‌తో పతాక శీర్షికలకు ఎక్కాడు. అతడి కెరీర్‌ను మలుపు తిప్పిన ఇన్నింగ్స్ అది. 360 డిగ్రీల ఆటగాడిగా పేరు గడించిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలర్స్ సైతం అతడి బ్యాటింగ్‌కు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఏబీలా 360 డిగ్రీల ఆటగాడిగా పోలుస్తూ సూర్యను సీనియర్లు, అభిమానులు ఆకాశానికి ఎత్తినప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషపడింది దేవిషానే. తన ఆనందాన్ని నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానం నుంచి భార్యకు వీడియో కాల్ చేసిన సూర్య... భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో బౌండరీ లైన్‌పై అద్భుతమైన క్యాచ్‌ను అందుకొని... భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. అప్పుడూ తన భార్యను పొగడకుండా ఉండలేకపోయాడు. దేవిషాతో ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ... ‘నిజానికి అత్యంత విలువైన క్యాచ్ నేను ఎనిమిదేళ్ల కిందటే పట్టాను’ అని రాసుకొచ్చాడు. ఆమెతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయనే ఉద్దేశం అతడిది. దేవిషా లేనిదే తాను లేనని ప్రతి సందర్భంలోనూ అతడు గుర్తు చేస్తూనే ఉంటాడు.
జంతు ప్రేమికులు...
దేవిషా అందించిన ప్రోత్సాహం, సహకారం, ప్రేమే నేడు సూర్యను జాతీయ టీ20 జట్టుకు సారథిని చేసింది. పలు ఇంటర్వ్యూల్లో సూర్య ఈ విషయం పంచుకున్నాడు. దేవిషాకు భర్త అంటే ప్రాణం. అతడి గెలుపే ఆమె గెలుపు. అతడి కల ఆమె కల. ఒకరిపై ఒకరికున్న ప్రేమానురాగాలే తమ అన్యోన్య దాంపత్యానికి పునాది అంటున్న ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు ఏడు లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ ఎక్కువగా సూర్యతో కలిసివున్న మధుర క్షణాలనే ఆమె పంచుకొంటారు. వంటలు, కేక్‌లు చేయడం ఆమె అభిరుచి. జంతువులంటే ఇద్దరికీ ప్రాణం.