కిచెన్‌లో వస్తువుల అమరిక ఇలా...
ABN , Publish Date - Sep 25 , 2024 | 11:13 PM
కిచెన్‌లో స్టోరేజ్ సమస్య చాలామందికి ఎదురయ్యేదే. ఏది ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడో ఓ చోట పెట్టేస్తారు. మళ్లీ దాని కోసం కిచెన్ మొత్తం వెతుకుతారు.
కిచెన్‌లో స్టోరేజ్ సమస్య చాలామందికి ఎదురయ్యేదే. ఏది ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడో ఓ చోట పెట్టేస్తారు. మళ్లీ దాని కోసం కిచెన్ మొత్తం వెతుకుతారు. అయితే కాస్త ఓపికగా కిచెన్‌ను సర్దుకుంటే ఇలాంటి ఇబ్బందులు దరిచేరకుండా ఉంటాయి. కిచెన్‌లో వస్తువుల అమరికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
కిచెన్‌లో స్టోరేజ్ సమస్య తీరాలంటే ముందుగా పనికిరాని వస్తువులను తీసేయాలి. ఇందుకోసం క్యాబినెట్స్‌లో నుంచి వస్తువులన్నీ తీసి బయటపెట్టాలి. వాటిని మూడు రకాలుగా విభజించాలి. ఒకటి ట్రాష్ బిన్‌లో వేసేవి. రెండో రకం డొనేట్ చేసేవి. మూడో రకం అవసరమైనవి. ఈ మూడో కేటగిరీకి చెందిన వస్తువులను మాత్రమే క్యాబినెట్‌లో సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల కిచెన్‌లో సగం పనికిరాని వస్తువులు బయటకు వెళ్లి స్థలం కలిసొస్తుంది.
క్యాబినెట్స్, షెల్ఫ్‌లు క్లీన్ చేశాక కిచెన్ వస్తువులను కేటగిరీలుగా విభజించుకోవాలి. అంటే కుక్‌వేర్, డిన్నర్‌వేర్, తినే ఆహారపదార్థాలు.. ఇలా కేటగిరీలుగా విభజించుకోవాలి. వంట పాత్రలు, ప్యాన్‌లు, కటింగ్‌బోర్డ్, ప్లేట్లు, గ్లాసులు... ఇవన్నీ కుక్‌వేర్‌లోకి వస్తాయి. వీటిని ఒక క్యాబినెట్‌లో సర్దుకోవాలి. డ్రింక్‌లు, బేకింగ్‌కు ఉపయోగించే పదార్థాలు, స్నాక్స్ వంటివన్నీ మరో కేటగిరీగా విభజించి సర్దుకోవాలి. మసాలా దినుసులు, పప్పులు, రకరకాల పిండిపొడులను మరోచోట ఈజీగా దొరికేలా అమర్చుకోవాలి.
రోజులో ఎక్కువ సార్లు ఉపయోగించే వస్తువులను సులభంగా తీసుకునేలా అమర్చుకోవాలి. ఉదాహరణకి రోజులో నాలుగైదు సార్లు కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ కప్పులు, కాఫీ పొడిని సులభంగా తీసుకునేలా పెట్టుకోవాలి.
ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే ఉపయోగించే వస్తువులను పై క్యాబినెట్‌లలో అమర్చుకోవాలి. ఆహారాన్ని నిలువ ఉంచే పాత్రలను కౌంటర్ పైభాగంలో పెట్టుకోవాలి.
కింది క్యాబినెట్‌లలో దోశ, ఫ్రై ప్యాన్‌లు, బేకింగ్ షీట్లు, కటింగ్ బోర్డ్‌లు, మిక్సింగ్ బౌల్స్ వంటివి అమర్చుకుంటే అనువుగా ఉంటుంది.
పాత్రలు శుభ్రం చేసేందుకు ఉపయోగించే సబ్బులు, లిక్విడ్‌లను సింక్ కింద అమర్చుకుంటే స్థలం కలిసి వస్తుంది. స్పాంజ్‌లు, డిష్ వాషర్ పాడ్‌లను కూడా ఇక్కడే పెట్టుకోవాలి.
క్యాబినెట్ డోర్లపై లేబుల్స్ అంటించుకోవడం ద్వారా ఏ క్యాబినెట్‌లో ఏమున్నాయో సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. పప్పులు, మసాలా దినుసులు భద్రపరచుకున్న సీసాలపై కూడా లేబుల్స్ అంటించుకోవడం ద్వారా సమయం వృథా కాకుండా ఈజీగా తీసుకోవచ్చు.