Share News

Bone Setting : ఈ కట్టు బెస్టు

ABN , Publish Date - Aug 12 , 2024 | 11:33 PM

పిల్లల లేత ఎముకలు చిన్న పాటి ఒత్తిడికే పుటుక్కున విరిగిపోతాయి, అంతే తేలికగా అతుక్కుంటాయి కూడా! కాబట్టి ఎముకలు అతుక్కోవడం కోసం వేసే కట్టు మన్నికదై, పిల్లల ఆటపాటలకు అడ్డురానిదై ఉండాలి.

Bone Setting : ఈ కట్టు బెస్టు

పిల్లల లేత ఎముకలు చిన్న పాటి ఒత్తిడికే పుటుక్కున విరిగిపోతాయి, అంతే తేలికగా అతుక్కుంటాయి కూడా! కాబట్టి ఎముకలు అతుక్కోవడం కోసం వేసే కట్టు మన్నికదై, పిల్లల ఆటపాటలకు అడ్డురానిదై ఉండాలి. అలాంటి అత్యాధునిక వాటర్‌ప్రూఫ్‌ కాస్ట్‌లు, వాటి ఉపయోగాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.

పిల్లల్లో ఫ్రాక్చర్లకు ఆస్కారం తక్కువ అనుకోవడం పొరపాటు. పోషణ తగ్గినా పిల్లల ఎముకలు పెళుసుగా మారతాయి. ఇలాంటి పిల్లల ఎముకలు చిన్నపాటి దెబ్బలకే విరిగిపోతాయి. పిల్లలను ఎత్తుకునే తప్పుడు పద్ధతుల వల్ల కూడా భుజాలు, మోచేతుల్లోని కీళ్లు పట్టు తప్పుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ముంజేతుల్లోని ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. వీటికి తోడు ప్రమాదాల వల్ల కూడా పిల్లల ఎముకలు విరుగుతూ ఉంటాయి. కొందరు చేత్లో పిల్లల కాళ్లు పట్టుకుని తలకిందులుగా పైకెత్తి వెన్ను మీద తట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు తుంటి కీలు జారుతుంది.

అవన్నీ గ్రీన్‌ స్టిక్‌ ఫ్రాక్చర్లే!

ఎండుకొమ్మను మధ్యకు విరిస్తే అది చక్కగా, సమంగా రెండు ముక్కలవుతుంది. అదే పచ్చని కొమ్మను విరిస్తే, అది పూర్తిగా విరిగిపోకుండా ఒక వైపు అతుక్కునే ఉంటుంది. పిల్లల్లో ఎముకలు విరిగితే ఇదే పరిస్థితి ఉంటుంది. తేలికగా అతుక్కునే స్వభావం ఉంటుంది కాబట్టి జనరల్‌ అనస్తీషియాలో భాగంగా సెలైన్‌ ద్వారా నొప్పి తగ్గించే ఇంజక్షన్‌ ఇచ్చేసి, విరిగిన ఎముకను సరిచేసి కట్టు వేస్తే సరిపోతుంది. పిల్లల్లో గాయాలు నయమయ్యే స్వభావం ఎక్కువ కాబట్టి 3 నుంచి 4 వారాల్లోనే ఎముక అతుక్కుపోతుంది. ఒకవేళ ఎముక రెండుగా విరిగిపోతే, ఎముకల లోపలి నుంచి మెత్తని వైర్లను చొప్పించి, వాటిని టెన్స్‌ నెయిల్స్‌తో కదలకుండా బిగించే విధానాన్ని అనుసరించవలసి వస్తుంది. చిన్నపాటి రంధ్రాల ద్వారానే సర్జరీ పూర్తవుతుంది. కాబట్టి కోతలు లాంటివి కనిపించవు. సర్జరీ తర్వాత వేసిన కట్టు మూడు వారాల పాటు ఉంచితే, విరిగిన ఎముకలు చక్కగా అతుక్కుంటాయి. ఎముక పూర్తిగా అతుక్కున్న తర్వాత 8 వారాలకు టెన్స్‌ నెయిల్స్‌ను తొలగించవలసి ఉంటుంది. తొడ ఎముక విరిగినప్పుడు కూడా ఇదే రకమైన సర్జరీతో ఎముకను అతికించి, నడుముకు స్పైకాను బిగించాల్సి ఉంటుంది. దీంతో ఎముక కదలికలకు గురి కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రాక్చర్‌ మధ్యలో కండ విరుక్కున్నప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఓపెన్‌ సర్జరీ అవసరమవుతుంది. '

main-01-(1).jpg

ఎముకను పెంచే టెన్స్‌ నెయిల్స్‌

పెద్ద ప్రమాదాల్లో ఎముక పూర్తిగా ఛిద్రమైపోయి, కొంత ఎముకను కోల్పోయిన సందర్భాల్లో విరిగిన ఎముకను అలాగే కలిపి అతికిస్తే, అవయవం కురచగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. పూర్వం ఈ సమస్యకు ప్రత్యామ్నాయాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు కోల్పోయిన ఎముక స్థానంలో కొత్త ఎముక పెరిగే వీలు కల్పించే వెసులుబాటు తాజాగా అందుబాటులోకొచ్చింది. టెన్స్‌ నెయిల్స్‌తో రెండు ముక్కలైన ఎముకను సరిపడా జాగాతో దగ్గరకు చేర్చడం వల్ల, ఆ జాగాలో ఎముక పెరిగి, మునుపటి స్థితికి తీసుకురావచ్చు. బోన్‌ లాస్‌ను భర్తీ చేయడం కోసం రూపొందిన ఈ సర్జరీ, ఎత్తును పెంచడానికి కూడా ఉపయోగపడుతోంది.

సౌకర్యవంతమైన ‘డెల్టా డ్రై’ కాస్ట్‌

పూర్వం ఎముక విరిగితే పిండికట్టు వేయించుకునేవాళ్లం. రోలర్‌ బ్యాండేజీల మీద పిఒపి చల్లి నీళ్లతో తడిపి పిండి కట్టు కట్టేవాళ్లు. కానీ ఈ కట్లు నీరు తగిలితే పిగిలిపోతాయి. కాబట్టి ఎముకలకు అవసరమైన ఒత్తిడి దక్కకపోగా, పిల్లల ఆటపాటలకు కూడా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. వీటి తర్వాత సింథటిక్‌ కాస్ట్స్‌ అందుబాటులోకొచ్చాయి. విరిగిన ప్రదేశం పైన కాటన్‌ రోల్‌ చుట్టి, దాని పైన సింథటిక్‌ కాస్ట్‌ను వేయడం వల్ల ఎముకలు కదలికలు లేకుండా చక్కగా అతుక్కుంటాయి. దీన్ని మించిన అత్యాధునికమైన కట్టు... ‘డెల్టా డ్రై’. దీన్లో కాటన్‌కు బదులుగా డెల్టా డ్రై అనే మెటీరియల్‌ను చుట్టి, దాని పైన సింథటిక్‌ కాస్ట్‌ వేయడం వల్ల తడికీ, నీళ్లకూ కూడా దూరంగా ఉండవలసిన అవసరం ఉండదు. ఈ కట్టుతో స్నానం చేయవచ్చు. స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టవచ్చు. చర్మానికి అంటుకునేలా చుట్టే మెటీరియల్‌ మెత్తగా ఉండాలి, త్వరగా ఆరిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి డెల్టా డ్రైని ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. దీని పైన వేసే సింథటిక్‌ రాయిలా గట్టిగా ఉండి అతుక్కునే ఎముకకు రక్షణ కల్పిస్తుంది. పిల్లలకు ఇలాంటి కట్లు ఎంతో ప్రయోజనకరం, సౌకర్యవంతం.

పిండి కట్టు ఎప్పుడు?

కొన్ని కట్టు బిగుసుకోడానికి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సమయ నిడివి ఉంటుంది. కాబట్టి ఏదైనా పొరపాటు జరిగినా ఆ సమయంలోగా సరిదిద్దుకునే వెలుసుబాటు ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల ఫ్రాక్చర్లకు ఈ కట్లు ఉపయోగకరంగా ఉంటాయి. పుట్టుకతోనే వంకర కాళ్లతో పుట్టిన పిల్లలకు, ఆ వంకరను సరిచేయడం కోసం వారానికో కట్టు చొప్పున పిండి కట్టు వేసుకుంటే కాళ్ల వంకర తగ్గిపోతుంది. ఇలా కొన్ని సందర్భాల్లో పిండి కట్ల అవసరం ఇప్పటికీ ఉంది.

ఎముకలు విరిగిన వెంటనే...

  • వాపు, నొప్పి ఎముక విరిగిందనడానికి సంకేతాలు. ఇలాంటప్పుడు ఆస్పత్రికి వెళ్లేలోగా విరిగిన ఎముక మరింత దెబ్బ తినకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే....

  • విరిగిన ప్రదేశంలో మర్దన చేయకూడదు, రుద్దకూడదు

  • స్వయంగా ఎముకలను సరిచేసే ప్రయత్నం చేయకూడదు

  • కార్డ్‌బోర్డులను విరిగిన అవయవానికి ఆసరాగా ఉంచి, టవలు చుట్టి కదల్చకుండా ఆస్పత్రికి చేర్చాలి

  • ఎముక చర్మాన్ని చీల్చుకుని బయటకు వస్తే, అదే స్థితిలో ఆస్పత్రికి చేర్చాలి

main-01-(3).jpg

పసరు కట్టు ప్రమాదకరం

ఆకు పసరును పిండి, అట్ట ముక్కలతో కట్టు కట్టేసే పసరు కట్లు ప్రమాదకరం. కొన్ని సందర్భాల్లో పూర్తిగా అవయవాలనే కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చు. ఒక ఐదేళ్ల పాపకు చేతి ఎముక విరిగి, బయటకు పొడుచుకు వచ్చిన సందర్భంలో ఆ పాప తల్లితండ్రులు పసరు కట్టును ఆశ్రయించారు. ఆ కట్టు వేసిన వ్యక్తి బయటకు పొడుచుకువచ్చిన ఎముకలను లోపలికి నెట్టి, సరిచేసి ఆకు పసరు పిండి, ఆకులను ఉంచి, కట్టు కట్టేశాడు. కానీ కండర గాయం అలాగే ఉండిపోవడంతో, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి జ్వరం, భరించలేని నొప్పితో పాప విలవిల లాడిపోయింది. దాంతో తల్లితండ్రులు పసరు కట్టు వేసిన వైద్యుని సూచన మేరకు ఆస్పత్రికి వచ్చినప్పుడు, కట్టు విప్పి చూస్తే అక్కడ మాంసాన్ని తింటున్న పురుగులు కనిపించాయి. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ చేతిని తొలగించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. చేతిని తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదమనే విషయాన్ని తల్లితండ్రులకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. కాబట్టి ఎముకలు విరిగినప్పుడు ఇలాంటి నాటు వైద్యాలను ఆశ్రయించకూడదు.

dr-manoj-kumar.jpg

డాక్టర్‌ గుడ్లూరు మనోజ్‌ కుమార్‌

కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌

అండ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌,

ఎమ్‌జిఎమ్‌ మెడికల్‌ సెంటర్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - Aug 12 , 2024 | 11:33 PM