Share News

నిజాం కోడలైన టర్కీ రాకుమారి

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:13 AM

కొందరిని ఒక్క సారి కలిస్తే చాలు... మనపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో ప్రిన్సెస్‌ దురేషేవార్‌ ఒకరు. ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఒకరుగా, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ మొదటి టెర్నినల్‌కు శంకుస్థాపకురాలిగా హైదరాబాద్‌ చరిత్రలో ఆమెకు ఒక సుస్థిరమైన

నిజాం కోడలైన టర్కీ రాకుమారి

కొందరిని ఒక్క సారి కలిస్తే చాలు... మనపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో ప్రిన్సెస్‌ దురేషేవార్‌ ఒకరు. ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఒకరుగా, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ మొదటి టెర్నినల్‌కు శంకుస్థాపకురాలిగా హైదరాబాద్‌ చరిత్రలో ఆమెకు ఒక సుస్థిరమైన స్థానం ఉంది. నాకు 11 ఏళ్లు ఉన్నప్పుడు- నేను తొలి సారి ప్రిన్సెస్‌ దురేషేవార్‌ను చూశాను. ఆ తర్వాత ఆమెతో నా పరిచయం పెరిగింది. ఓటోమన్‌ సామ్రాజ్యానికి వారసురాలైన ప్రిన్సెస్‌ దురేషేవార్‌ హైదరాబాద్‌కు రావటం, ఇక్కడ స్థిరపడటం ఒక ఆసక్తికరమైన కథ.

ఓటోమన్‌ సామ్రాజ్యంపై తిరుగుబాటుదారులు దాడి చేసినప్పుడు- సుల్తాన్‌ ముజీబ్‌ తన ముద్దుల కూతురు దురేషేవార్‌తో, ఇతర కుటుంబ సభ్యులతో కలిపి ఇస్తాంబుల్‌ నుంచి లండన్‌కు చిన్న బోటులో వెళ్లిపోయారు. ఈ ప్రయాణం దురేషేవార్‌ జీవితాన్నే మార్చేసింది. టర్కీలో యువరాణిగా దురేషేవార్‌ అసలైన రాజభోగాలు అనుభవించేది. కానీ లండన్‌కు వచ్చే ముందు తన నగలను, తనకు ఇష్టమైన వస్తువులను వదిలేసి వచ్చేయాల్సి వచ్చింది. ఆఖరికి తను ధరించే వజ్రాల కిరీటాన్ని కూడా వదిలేయాల్సి వచ్చింది. లండన్‌లో సుల్తాన్‌ ముజీబ్‌కు, ఆయన కుటుంబానికి సాయం చేసేంది హైదరాబాద్‌ నిజామే! లండన్‌లో ఉన్న హైదరాబాద్‌ హౌస్‌లో వారికి బస ఏర్పాటు చేయటమే కాకుండా- వారి హోదాకు తగినట్లు పరివారాన్ని, ఇతర సౌకర్యాలను కూడా నిజాం అందించారు. ఇలా కొద్ది కాలం గడిచింది. దురేషేవార్‌ పెద్దదయింది. ఆ సమయంలో ఆమెను ప్రపంచంలోని అందగత్తెలలో ఒకరిగా చెప్పుకొనేవారు. ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్ట్‌ల నుంచి అనేకమంది రాజకుమారులు ఆమెను పెళ్లిచేసుకోవటానికి ముందుకు వచ్చారు. రాయబారాలు పంపారు. కానీ సుల్తాన్‌- తనకు నిజాం చేసిన సాయాన్ని మర్చిపోలేదు. నిజాం కుమారుడు ప్రిన్స్‌ ఆజాంతో ఆమెకు వివాహం చేశారు. లండన్‌లో జరిగిన ఆ వివాహానికి ప్రపంచంలోని ముఖ్యమైన రాజకుటుంబాలకు చెందిన వారందరూ హాజరయ్యారు.

ప్రిన్సెస్‌ దురేషేవార్‌ హైదరాబాద్‌కు తొలిసారి వచ్చినప్పుడు- హైదరాబాద్‌లో అనేక ఉత్సవాలు జరిగాయి. ప్రిన్స్‌ ఆజంకు, ప్రిన్సెస్‌ దురేషేవార్‌కు హైదరాబాద్‌ ప్రజలు ఘన స్వాగతం చెప్పారు. తొలి రోజుల్లో వారు బెల్లా విస్టా ప్యాలెస్‌లో నివాసం ఉండేవారు. నిజాం ఆమెకు ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ బీరర్‌’ అనే బిరుదు కూడా ఇచ్చారు. ప్రిన్సెస్‌ను నేను తొలిసారి చూసింది మా ఇంట్లోనే! నాన్న ధన్‌రాజ్‌గిరి వారి గౌరవార్థం ఒక పార్టీ ఇచ్చారు. నాకు అప్పుడు 11 ఏళ్లు అనుకుంటా. ప్రిన్స్‌ ఆజాం, ప్రిన్సెస్‌ దురేషేవార్‌ వస్తున్నారనే వార్త మాకు ముందే తెలిసింది. ఆమె గురించి ఇంట్లో వారు మాట్లాడుకుంటుంటే విన్నామేమో... ఆమెను చూడాలనే ఆతృతతో పిల్లలందరం డైనింగ్‌ రూమ్‌ పైన ఉన్న రూమ్‌లో చేరాం. అక్కడ నుంచి ఆమెను తొలిసారి చూశా! ‘నిజంగానే ప్రిన్సెస్‌లా ఉంది’ అనుకున్నా! ఆ తర్వాతి కాలంలో ప్రిన్సెస్‌ దురేషేవార్‌ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొవటం మొదలుపెట్టారు. మహిళలకు విద్య అవసరమని వాదించిన వారిలో, పరదాకు వ్యతిరేకంగా కూడా మాట్లాడినవారిలో ఆమె కూడా ఒకరు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ప్రిన్సెస్‌ నిలోఫర్‌కు ప్రిన్సెస్‌ దురేషేవార్‌ కజిన్‌ అవుతారు. దాంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ రోజుల్లో సాధారణంగా రాజకుటుంబాలలో మహిళలు బయటకు వచ్చేవారు కారు. కానీ నిజాం తన కోడళ్లకు స్వేచ్ఛను ఇచ్చారు. వారు ఫ్రెంచ్‌ పత్రికల్లో వ్యాసాలు రాసినట్లు జ్ఞాపకం.

ప్రిన్సెస్‌ దురేషేవార్‌ను నేను ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాలలో కలిసాను. ఒకసారి మహబూబియా కాలేజీలో బహుమతి ప్రదానోత్సవానికి ఆమె వచ్చారు. నిజాం రాజవంశానికి చెందిన మహిళ ఒక బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రావటం అదే తొలిసారి. చాలా మందికి అది ఒక మరచిపోలేని సందర్భం. లండన్‌లో ప్రిన్సెస్‌ ఎస్రా ఒకసారి పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి నేను వెళ్లాను. నాకు దేరేషేవార్‌ కనిపిస్తే- ఆదాబ్‌ చేశా. ఆమె నవ్వుతూ నన్ను పలకరించారు. తన పక్క కూర్చోమని పిలిచారు. ప్రిన్సెస్‌ ఇస్రా స్నేహితురాలినని తెలుసుకొని నాతో సంభాషించటం ప్రారంభించారు. నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడారు. ఆ సంభాషణ తర్వాత నాకు ఆమెపై ఉన్న గౌరవం మరింత పెరిగింది. చౌమహల్లా ప్యాలెస్‌ ప్రారంభోత్సవంలో కూడా ఆమె నన్ను గుర్తుపట్టి పలకరించిన జ్ఞాపకం ఉంది. నేను ఆల్‌ ఇండియా ఉమెన్‌ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో అనేకసార్లు ఆమెను మీటింగ్‌లలో కలిసాను. ఆ మీటింగ్‌ల తర్వాత ప్రిన్సెస్‌ దురేషేవార్‌ నాకు రాసిన అనేక ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర పదిలంగా ఉన్నాయి.

ఎక్కడో టర్కీలో పుట్టి, లండన్‌లో గడిపి, హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన దురేషేవార్‌- మన సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. ఎప్పుడూ మన చీరలోనే కనిపించేవారు. రచయితలను, కళాకారులను ప్రొత్సహించేవారు. ఒకసారి ఆమె నాకు ఒక పుస్తకాల షాపులో కనిపించారు. ఆమెకు ఆదాబ్‌ చెప్పాలో, నమస్కారం పెట్టాలో తెలియక ఒక క్షణం తటపటాయించి... నమస్కారం చేశాను. ఆమె వెంటనే నవ్వుతూ నాకు నమస్కారం చేశారు. నిజాం కుటుంబీకులు నమస్కారం చేయటం అరుదైన విషయం. కానీ ప్రిన్సెస్‌ దురేషేవార్‌- హైదరాబాద్‌ సంస్కృతిలో మమేకం అయిపోయారనటానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె లండన్‌లో స్థిరపడ్డారు. అక్కడే మరణించారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో అనేక మంది పాత్ర పరోక్షంగా ఉంది. అలాంటి వారిలో ప్రిన్సెస్‌ దురేషేవార్‌ ఒకరు. అందుకే ఆమె గురించి తలుచుకోవాల్సిన అవసరం ఉంది.

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Apr 21 , 2024 | 04:13 AM