Share News

Potti Sreeramulu : తాతతో... ‘అలాగైతే నీతో రాను’ అన్నాను

ABN , Publish Date - Dec 19 , 2024 | 06:26 AM

అమరజీవిగా ఆంధ్రుల గుండెల్లో గూడు కట్టుకున్న సమరయోధుడు... ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష బూని... ప్రాణాలు అర్పించిన మహాత్ముడు... భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు... పొట్టి శ్రీరాములు. తాతతో తనకున్న జ్ఞాపకాలు, అనుబంధాలు,

Potti Sreeramulu : తాతతో...  ‘అలాగైతే నీతో రాను’ అన్నాను

అమరజీవిగా ఆంధ్రుల గుండెల్లో

గూడు కట్టుకున్న సమరయోధుడు...

ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష బూని... ప్రాణాలు అర్పించిన మహాత్ముడు... భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు...

పొట్టి శ్రీరాములు. తాతతో తనకున్న జ్ఞాపకాలు, అనుబంధాలు, నాటి పరిస్థితుల గురించి... పొట్టి శ్రీరాములు మనవరాలు... 82 ఏళ్ల

ప్రొఫెసర్‌ రేవతి తంగుడు ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘ఆ రోజు ఇంకా గుర్తుంది. అది 1952. పిఠాపురం దగ్గర గొల్లప్రోలులో ఉంటున్నాం. సత్యాగ్రహం మొదలుపెట్టే ముందు తాతగారు (పొట్టి శ్రీరాములు) మా ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. అమ్మ అనంతలక్ష్మి, నాన్న ఎన్‌ఆర్‌ గుప్తా, చెల్లి అనూరాధ, నేను... అంతా కూర్చొని ఉన్నాం. అప్పుడు... ‘నేను సత్యాగ్రహం చేయబోతున్నాను. ఆ సమయంలో నువ్వు నాతోనే ఉండాలి. నాకు మరణం సంభవించినా సరే... ఎవరూ నా దీక్షకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి’ అని తాతగారు మా నాన్నతో అన్నారు. అందుకు నాన్న సరేనన్నారు. దీక్ష ప్రారంభించే సమయానికి చెల్లిని తీసుకొని అమ్మానాన్న మద్రాసు వెళ్లిపోయారు. నా చదువు చెడిపోకూడదని నన్ను రాజమండ్రిలో తెలిసినవాళ్ల ఇంట్లో వదిలిపెట్టారు. అక్కడ స్కూల్లో చేరాను. 1952 అక్టోబరు 19న తాతగారు మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు.

మామయ్య ఇంట్లో...

నేను మా మేనమామ టీపీబీఎస్‌ గుప్తా ఇంట్లో పెరిగాను. అమ్మానాన్న అహ్మదాబాద్‌ సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు పుట్టాను. తొమ్మిది నెలల వయసులోనే నన్ను మా మామయ్యకు అప్పగించి, వాళ్లిద్దరూ స్వాతంత్య్ర ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ‘నువ్వే పెంచు. మేం బతికుంటే వచ్చి తీసుకువెళతాం’ అని మామయ్యకు చెప్పారట. అప్పట్లో వారు బ్రిటిషర్ల కంట పడకుండా రహస్య సమాచారం చేరవేసేవారట. రెండుసార్లు జైలు జీవితం కూడా గడిపారు. మా మామయ్య హైదరాబాద్‌లో డీబీఆర్‌ మిల్స్‌ మేనేజర్‌గా చేసేవారు. అక్కడి నుంచి ఆయన బాంబే మిల్స్‌కు, సూరత్‌ మిల్స్‌కు వెళ్లారు. తరువాత భివాండీలోని బిర్లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. అలా నా బాల్యం వివిధ ప్రాంతాల్లో సాగింది. మేనమామ చనిపోయాక అమ్మానాన్న వచ్చి నన్ను తీసుకువెళ్లారు. అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అంతకముందు ఒకసారి ఢిల్లీలో గాంధీ గారిని కలిసే అవకాశం లభించింది. అక్కడ పెద్ద మైదానంలో ఒక గుడిసెలాగా ఉండేది. అందులో మహాత్మా గాంధీ ఉండేవారు. అమ్మానాన్నతో కలిసి ఆయన దగ్గరకు వెళ్లాను. గాంధీ గారు నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకున్నారట. అప్పుడు ఆయన్ను అడిగానట... ‘నా భుజం మీద చెయ్యి వేసుకొని నడుస్తారా’ అని! దానికి గాంధీ ‘నువ్వు పెద్దయ్యాక అలానే నడుస్తా’ అన్నారట.


అలాగైతే నేను రానన్నాను...

స్వాతంత్య్ర వచ్చాక... నాన్న తన కుటుంబాన్ని పోషించుకొని, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలని గొల్లప్రోలుకు వచ్చారు. అక్కడి ఒక వ్యాపారస్తుడి దగ్గర ఉద్యోగంలో చేరారు. అప్పట్లో నాకు తెలుగు అస్సలు వచ్చేదికాదు. దానికోసం మహంకాళి అనే మాస్టారు దగ్గర ఏడాదిపాటు తెలుగు నేర్పించారు. నాకు ఇప్పటికీ గుర్తుంది... ఒకసారి తాతగారు గొల్లప్రోలు వచ్చినప్పుడు... ‘అలా బజారుకు వెళదాం రా’ అని అడిగితే... ‘నువ్వు ఇలానే వస్తావా బజారుకు? అలాగైతే నేను నీతో రాను’ అన్నాను. నేనేమో అప్పటివరకు మేనమామ దగ్గర పెరిగాను కదా! ఆయన సూటు బూటూ వేసుకొని టిప్‌టా్‌పగా ఉండేవారు. తాతగారు లుంగీ కట్టుకొని, పైపంచె వేసుకొనేవారు. ఎప్పుడూ ఆయన ఆహార్యం అదే. తాత అరిటాకులో భోజనం చేస్తే... అసలు తిన్నారా అనిపిస్తుంది! అంత శుభ్రంగా తినేవారు.

చెల్లి అదృష్టవంతురాలు...

తాతగారు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినప్పుడు అమ్మానాన్నతో పాటు చెల్లి కూడా అక్కడే ఉంది. ఆయన మంచం పక్కన కుర్చీ వేసుకొని కూర్చొనేది. అప్పుడు తనకు ఐదేళ్లు. తాతగారికి రోజూ కొబ్బరి నీళ్లు ఇచ్చేవారు. నీళ్లు తీసుకొని, కొబ్బరి ముక్కలు కప్పులో వేసిచ్చి చెల్లిని తినమనేవారట. దాంతోపాటు ఆయనకు తేనె, నిమ్మ రసం కలిపిన నీళ్లు కూడా ఇచ్చేవారు. దీక్ష సాగిన 58 రోజులూ చెల్లి తాత పక్కనే ఉంది. ఆ విషయంలో తను అదృష్టవంతురాలు.

మొదట చూసింది తనే...

ముప్ఫై రోజుల దీక్ష తరువాత తాతగారి ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో ఎవర్నీ లోపలకు రానీయలేదట. గడప దగ్గర నుంచే చూసి వెళ్లిపోవాలని చెప్పారట. చెల్లి గడప దగ్గర కూర్చొనేదట ఆడుకొంటూ. పక్కనే కేర్‌టేకర్‌లా ఒకరు ఉండేవారు. తాతగారి శరీరం వేడెక్కినప్పుడు చల్లబరచడానికి ఆయన ఒళ్లంతా మట్టి రాస్తుండేవారు. చివర్లో తాత చనిపోవడం చెల్లే చూసింది. ఆ రోజు 1952 డిసెంబరు 15. కేర్‌టేకర్‌ మట్టి రాస్తుంటే... తాత తల పక్కకు వాలిపోయిందట. వెంటనే పరుగెత్తుకొంటూ మేడ మీదకు వెళ్లి చెప్పిందట. దీక్ష చేపట్టి చాలా రోజులు అయింది కదా... ఏంచేద్దామనే విషయం మీద నాన్న, వైద్యులు మేడ మీద చర్చిస్తున్నారట. కిందకి వచ్చి చూసేసరికి తాతగారు చనిపోయారట. వెంటనే ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. ‘ఎందుకలా తాతను కడుతున్నారు’ అని చెల్లి అడిగితే ‘అందరికీ కనపడాలని అలా కట్టాం’ అని చెప్పారట. విషయం తెలిసి చాలామంది వచ్చి చూసిపోతూనే ఉన్నారు. తరువాత రోజు బండి మీద కూర్చోబెట్టారు. పక్కన మా నాన్న, అమ్మ, రంగయ్య గుప్తా గారు, చెల్లి కూడా కూర్చున్నారు. ఘంటసాల గారు నిరంతరాయంగా ఆవేదనతో పాడుతూనే ఉన్నారు. ఎంతోమంది జనం అంతిమయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రానికి అంతిమసంస్కారాలు ముగిశాయి.


‘దీక్ష భగ్నం కాకూడదు...’

పొట్టి శ్రీరాములు గారు సత్యాగ్రహదీక్షకు కూర్చొనేముందు ఇంట్లోవాళ్లకు ఒకటే చెప్పారట... ‘తెలుగువాళ్లకంటూ ఒక గుర్తింపు లేదు. అందరూ మనల్ని మద్రాసీలని అంటున్నారు. తెలుగువాళ్లకు రాష్ట్రం వచ్చేవరకు నేను నిరాహారదీక్ష చేస్తాను. నా ప్రాణం పోయేవరకూ పోరాడతాను. అదృష్టం ఉంటే ఆంధ్రా వస్తుంది. నా దీక్షను భగ్నం చేయడానికి ఎవర్నీ అనుమతించవద్దు’ అని మా నాన్నతో అన్నారట. నాన్న ధైర్యవంతులు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఇచ్చిన మాటకు కట్టుబడతారు. తాతగారితో పాటు అన్ని ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నారు. రాజాజీ దీక్షను వ్యతిరేకించారు. ముప్ఫై రోజుల తరువాత ‘రాష్ట్రం ఇచ్చేస్తున్నారు. దీక్ష విరమించండి’ అంటూ ఎవరితోనో సందేశం పంపారట. ఏదోరకంగా సత్యాగ్రహాన్ని ఆపేయాలనేది వారి ఆలోచన. అయితే ఆయనను కలవడానికి తాత నిరాకరించారట. 58 రోజుల దీక్ష అనంతరం శ్రీరాములు గారు మరణించాక పెద్దఎత్తున గొడవలు జరిగాయి. ఆ తదనంతర పరిణామాల్లో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది.

అది మనకే గౌరవం...

నేను పెరుగుతున్న క్రమంలో ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. 1956లో హైదరాబాద్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. చిన్నపిల్లను కావడంతో 1955 వరకు నాకు పరిస్థితుల తీవ్రత తెలియదు. ఆ తరువాతే తెలిసింది... తాతయ్య ప్రాణ త్యాగం విలువ. ఆయన పోయిన తరువాత మేం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాం. ఆస్తులు పాస్తులు ఏమీ లేవు. నాన్న ఏవేవో వ్యాపారాలు ప్రయత్నించి, వాటిల్లో నష్టం రావడంతో చివరకు పౌలీ్ట్ర ఫామ్‌ పెట్టారు. అప్పటి నుంచి మా పరిస్థితి కాస్త మెరుగుపడింది. బిర్లామందిర్‌ దగ్గర ఉండేవాళ్లం. అక్కడ తాతగగారి విగ్రహం ఉండేది. రాష్ట్ర అవతరణ దినోత్సవంనాడు నాన్న పూల మాల వేసేవారు. ఇప్పుడు అక్కడ ఆ విగ్రహం లేదు. అలాగే హైదరాబాద్‌లోని ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ పేరు మారుస్తున్నారని విన్నాను! వేరొకరికి గౌరవం ఇవ్వాలనుకొంటే... ఎన్నో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాటికి వాళ్ల పేర్లు పెట్టుకొనే అవకాశం ఉంది కదా. తాతగారి దీక్ష ఫలితంగా తెలుగు మాట్లాడేవారి కోసం ఒక రాష్ట్రం ఏర్పడింది. ఈ స్ఫూర్తితో దేశంలో మరికొన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలు అవతరించాయి. దీనికి నాంది పలికింది శ్రీరాములు గారే కదా. అలాంటప్పుడు తెలంగాణ విడిపోయినంతమాత్రాన ఆయన జ్ఞాపకాలు లేకుండా చెరిపేయడం, ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేయడం సరైంది కాదనేది నా అభిప్రాయం. మూలాలు మరిచిపోకూడదు. అందుకే హైదరాబాద్‌లో తెలుగు వర్సిటీ పేరు మార్చవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఆంధ్రాలోని తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు అలాగే కొనసాగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది సంతోషకరం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఏపీలో పలు సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వాటికి రమ్మని మాకు ఆహ్వానం అందుతుంటుంది. అలా తాతయ్యను తలచుకొనే అవకాశం మాకు లభిస్తోంది.’’

తాతతోనే నాన్న...

మా నాన్న చిన్నప్పటి నుంచి మద్రాసులో తాతగారి ఇంట్లోనే పెరిగారు. శ్రీరాములు గారికి మా నాన్న స్వయానా మేనల్లుడు. నాన్నకు రెండున్న రేళ్లప్పుడు వాళ్లమ్మ చనిపోయారు. దాంతో శ్రీరాములు గారు నాన్నను పెంచి పెద్ద చేశారు. నాన్న... తాతగారికి పెంపుడు కొడుకులాగా. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి భార్య, కొడుకు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్నను కొడుకులా చూసుకున్నారు. తాతగారి తమ్ముడు రంగయ్య గుప్తా. ఆయనకూ పిల్లలు లేరు. ఇంకో తమ్ముడు నారాయణ.

ఆ రాతలు బాధ కలిగించాయి...

కొంతమంది వాస్తవాలు తెలియకుండా ఏదేదో రాసేస్తున్నారు. చివరి దశలో తాతగారి నోట్లో నుంచి, ముక్కుల్లో నుంచి పురుగులు వచ్చాయని, మోయడానికి నలుగురు మనుషులు కూడా లేరని... ఇలా ఎవరో రాశారు. వారికి నేను గట్టిగా చెప్పాను... ‘ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్ద’ని. మా నాన్నతోపాటు ఆ రోజు అక్కడున్నవారికి తెలుసు కదా... ఏంజరిగిందో. తిండి తినక తాతగారి ఆరోగ్యం క్షీణించింది కానీ, వాళ్లందరూ చెబుతున్నట్టు ఏమీ జరగలేదు. దీక్ష చేపట్టే నాటికి ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. తాతగారు చనిపోయిన రోజు టంగుటూరి ప్రకాశంపంతులు, ఇతర ప్రముఖులంతా వచ్చారు. ఎంతోమంది ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. తరువాత నేను రాజమండ్రిలో థియేటర్‌కు వెళితే... సినిమాకు ముందు తాతగారికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించేవారు. అందులో ఆయన అంతిమయాత్ర దృశ్యాలు కూడా ఉన్నాయి. దాన్లో చాలామంది ప్రజలు కనిపిస్తారు.

ప్రొఫెసర్‌గా ప్రయాణం...

మేం 1953లో హైదరాబాద్‌ వచ్చాక తమ్ముడు పుట్టాడు. వాడికి తాత పేరు శ్రీరాములు పెట్టాం. నాకు ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. మొదటి చెల్లి అనూరాధ ఇక్కడే ఉంటోంది. రెండో చెల్లి గీత అమెరికాలో స్థిరపడింది. మావారు భాస్కర్‌రావు. కొన్నేళ్ల కిందట చనిపోయారు. రెండేళ్ల కిందట తమ్ముడు కూడా మాకు దూరమయ్యాడు. నేను రెడ్డి కాలేజీలో పీయూసీ చేశాక బీఎస్సీ హోమ్‌సైన్స్‌, ఎంఎస్సీ హోమ్‌సైన్స్‌ బరోడాలో చదివాను. తిరిగివచ్చి ఇక్కడి సెయింట్‌ఆన్స్‌లో బీఈడీ చేశాను. 1972లో ‘ఠాకూర్‌ రాజప్రసాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ద మెంటల్లీ హ్యాండీక్యా్‌పడ్‌’లో లెక్చరర్‌గా చేరాను. తరువాత దానికి డైరెక్టర్‌ జనరల్‌ అయ్యాను. రిటైర్‌ అయినా ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నాను. వృత్తిలో భాగంగా చాలా దేశాలు తిరిగాను.

హనుమా

Updated Date - Dec 19 , 2024 | 06:26 AM