ధ్యాన మర్మం
ABN , Publish Date - Nov 22 , 2024 | 06:23 AM
మనుగడ కోసం మాత్రమే మనసును ఉపయోగించుకోవడం, కర్మలను పరిమితంగా ఆచరించడం... ఇలా సరళమైన జీవనం గడపడమే నిజమైన ధ్యానం. ధ్యానం అంటే ఏదీ చేయకపోవడం (నాన్
మనుగడ కోసం మాత్రమే మనసును ఉపయోగించుకోవడం, కర్మలను పరిమితంగా ఆచరించడం... ఇలా సరళమైన జీవనం గడపడమే నిజమైన ధ్యానం. ధ్యానం అంటే ఏదీ చేయకపోవడం (నాన్ డూయింగ్). కేవలం ఉండడం (బీయింగ్). ఏ ఆలోచనా లేకుండా... నువ్వు నువ్వుగా ఉండే అస్తిత్వ స్థితి. ఇక్కడ ఏమీ చేయకపోవడం అంటే నిష్ర్కియాపరత్వమో, బద్ధకంగా కూర్చోవడమో కాదని గ్రహించాలి. ఆలోచనను, క్రియను అవసరమైన చోట ఉపయోగించుకొని, కేవలం మనుగడ కోసం మాత్రమే మనసును వాడుకొని, మిగిలిన సమయం అంతా వాటితో ఏమాత్రం ప్రమేయం లేని స్థితిలో ఉండగలగడమే ధ్యానం.
ఎవరి ప్రవృత్తిని బట్టి వాళ్ళు ఎక్కువగానో, తక్కువగానో పనులు చేస్తూ ఉంటారు. అవసరమైన కర్మను ఆచరించాలని, కానీ దాని ఫలితం మీద మనకు ఎటువంటి అధికారమూ లేదనీ భగవద్గీత ఉపదేశం. అయితే కర్మలు చేసుకుంటూ పోతూ... ఏ ఆసక్తీ లేకుండా ఉండడం అంత సులభమైన విషయం కాదు. అలాగే పనులు పెరిగిన కొద్దీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ‘కర్మల దొంతరే జీవితమా? అసలు కర్మలే చేయకపోతే? లేదా తక్కువగా చేస్తే?’ అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మితంగా, మనుగడ కోసమే కర్మలు చేయడం ధ్యానంలోని అసలు కీలకం.
మిత కర్మ
మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఒకవేళ శరీరంతో ఏదీ చేయకపోయినా... మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచనలు కర్మగా పరిణమిస్తాయి. కర్మలు అనుభవాలకు దారి తీస్తాయి. జ్ఞాపకాలుగా స్థిరపడతాయి. తిరిగి ఆలోచనలను ప్రేరేపిస్తాయి. కానీ పరిమితంగా పనులు చేసినప్పుడు... ఆలోచనల ఉత్పత్తి తగ్గిపోతుంది. మనో వ్యాపారం నెమ్మదిస్తుంది. వర్తమానంలో జీవించే అవకాశం ఉంటంది. మితాహారం (పరిమితంగా తినడం), మిత భాషణం (అవసరమైనప్పుడే మాట్లాడడం) లాంటి సుగుణాల గురించి మనకు తెలుసు. వీటికి కొనసాగింపుగా ధ్యానాన్ని ‘మిత చలనం’ లేదా ‘మిత కర్మ’గా చూడవచ్చు. అంటే అవసరమైన పనులు తప్పితే ఇంకేమీ చేయకపోవడం. భగవాన్ రమణ మహర్షికి తెలుగు బాగా తెలుసట. అప్పుడప్పుడు ఆయన తననుతాను ‘పనిలేనివాడు’ అని కాస్త వ్యంగ్యంగా అభివర్ణించుకొనేవారట. ఇది మనం అనుకొనే బద్ధకమో, సోమరితనమో కాదు. అహం పూర్తిగా నశించిన యోగులు ఉండే నిశ్చల ఆధ్యాత్మిక స్థితి. ‘నేను, నా శరీరం, నా మనసు’ అనే ఆలోచన పూర్తిగా అంతరించిన ఆత్మజ్ఞానులు ప్రత్యేకంగా ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. చేసేవాడే (కర్త) లేనప్పుడు ఇక పని (కర్మ) ఎక్కడిదీ?
ప్రకృతిపై భారం
అందరూ ప్రతి నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఏదో ఒక సంపద సృష్టి జరుగుతూనే ఉండాలి అనేది నేటి ఆర్ధిక వ్యవస్థ మూల సూత్రం. అయితే, సాధారణంగా మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే... ఏదో ఒక దాన్ని వినియోగిస్తున్నట్టు లేదా ఏదో ఒక దాన్ని ఉత్పత్తి చేస్తున్నట్టు. వీటిలో ఏది చేసినా ప్రకృతి మీద ఏదో విధమైన ప్రభావం ఉన్నట్టే, ఎంతో కొంత భారం పడుతున్నట్టే. కరోనా సమయంలో మనమందరం అనవసరమైన పనులు, ప్రయాణాలు మానుకోవలసి వచ్చినప్పుడు వాతావరణం ఎంత తేటపడిందో మనకు తెలుసు. కాలుష్యంతో నిండిన యమున లాంటి నదులు కూడా ఆ సమయంలో నిర్మలమైపోయాయి. ఇలా మితకర్మ ఫలాలను తాత్కాలికంగానైనా చవిచూశాం. ప్రాచీన కాలంలో ఋషులు, మునులు ఏ అనవసర చలనం లేకుండా... అలా ధ్యానంలో ఉండిపోవడంలోని ఆంతర్యం, ప్రయోజనం... దీన్ని పరిశీలించినప్పుడు మనకు బోధపడుతుంది.
సరళ జీవనం
‘ఇంకా పని చేయాలి, మరింత డబ్బు కూడబెట్టాలి, పిల్లలకు మరిన్ని ఆస్తులు, విలాసాలు సమకూర్చాలి’ అనే ఆలోచన ఆధునిక కాలంలో ఎక్కువయింది. ఇన్ని పనులు చేసి, ఇంత కాలుష్యాన్ని పెంచి, ప్రకృతిమాతను ఇంత క్షోభ పెట్టి... మనం తృప్తిగా, ఆనందంగా ఉన్నామా? అంటే ఏదీ లేదు. మన డొల్ల జీవితాలలోని వెలితిని ఎలా పూడ్చుకోవాలో తెలియక... మళ్ళీ ఇంకేవో పనులు చేయడం, ఇంకా సంపదను సృష్టించడం, మరిన్ని వస్తువులను కొనడం లాంటివి చేస్తూనే ఉన్నాం. ఈ విషయవలయం నుంచి బయటపడకుండా... రోజూ ధ్యాన సాధన పేరుతో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఫలితం శూన్యం. ఈ యాంత్రిక జీవన శైలిని వదిలి, పరిమితంగా కర్మలను ఆచరిస్తూ, సరళమైన జీవనం గడపడమే నిజమైన ధ్యానం.
ఈదర రవికిరణ్