యోగసాధనకు మార్గశిరం...
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:01 AM
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు. అంటే ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. మరి ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? మార్గశిర మాసాన్నే శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు? ‘శీర్షము’ అంటే శిఖరము లేదా తల....
సహజయోగ
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు. అంటే ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. మరి ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? మార్గశిర మాసాన్నే శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు? ‘శీర్షము’ అంటే శిఖరము లేదా తల. ‘మార్గము’ అంటే దారి. ‘మార్గశీర్షము’ అంటే శిఖరానికి తీసుకుపోయే దారి. మన సూక్ష్మ శరీరంలో శీర్షం అంటే తల మాడు భాగంలో ఉండే సహస్రారం. దాని దగ్గరకు తీసుకువెళ్ళే దారి... సుషుమ్న నాడి. మన వెన్నెముక అడుగు భాగాన ఉండే కుండలినీ శక్తి... ఈ నాడి ద్వారానే సహస్రారానికి చేరుతుంది. దానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి. అందుకే మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. అంతేకాకుండా... సుషుమ్న నాడి ద్వారా మానవులందరిలో ధర్మాన్ని, సంతృప్తిని, సమతుల్యతను, సత్యాన్వేషణను, జీవ పరిణామ శక్తిని శ్రీమహావిష్ణువు పరిరక్షిస్తాడు. అందుకే ‘‘మాసాలలో నేను మార్గశీర్షాన్ని’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
మనలోని ధర్మానికి ఆధారం ఆయనే...
మన సూక్ష్మశరీరంలో మూడు నాడులు ఉంటాయి, ఎడమవైపున ఉన్నదాన్ని ‘ఇడా నాడి’ అని, కుడివైపు నాడిని ‘పింగళా నాడి’ అనీ, మధ్యలో ఉండే నాడిని ‘సుషుమ్మ నాడి’ అని పిలుస్తారు. ఇడా, పింగళ నాడులు మనలో సహానుభూత నాడీ వ్యవస్థకు, సుషుమ్న నాడి మనలోని ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే పర సహానుభూతి నాడీ వ్యవస్థకు బాధ్యత వహిస్తాయి. అమీబా నుంచి మానవ దశ వరకూ మన పరిణామక్రమానికి ఈ సుషుమ్న మార్గమే కారణం. దాని వల్లనే మనం మానవులం అయ్యాం. నాభీ చక్రం నుంచి మానవులలో సత్యాన్వేషణ మొదలవుతుంది. జంతువులు ఆహారాన్ని, మానవులు దైవాన్ని వెతకడానికి ఈ చక్రమే కారణం. దైవాన్ని అన్వేషించే శక్తి మానవుల్లో అంతర్లీనంగా ఉంటుంది. ఆ అన్వేషణ నెరవేరేవరకూ అతను సంతృప్తి చెందలేడు. ‘యోగక్షేమం వహామ్యహం’ అని శ్రీకృష్ణుడు చెప్పినట్టు... భగవంతుడితో యోగం పొందిన తరువాతే మానవుడికి అన్ని వైపుల నుంచి పోషణ లభిస్తుంది. అతను సంతృప్తి చెందుతాడు అప్పటివరకూ ఏదో రూపంలో సత్యం కోసం అన్వేషణ చేస్తూనే ఉంటాడు. మన సూక్ష్మ శరీరం అంతటా విష్ణుమూర్తి ఒక్కో చక్రం దగ్గర ఒక్కో రూపంలో ఉంటాడు. నాభి చక్రం దగ్గర శ్రీమన్నారాయణుడిగా, అనాహత చక్రం దగ్గర శ్రీరామునిగా, విశుద్ధి చక్రం దగ్గర శ్రీకృష్ణుడిగా, ఆజ్ఞా చక్రం దగ్గర మహా విష్ణువుగా, సహస్రారం దగ్గర కల్కి రూపంలో ఉంటాడు. వీటిలో కల్కి అవతారం ఇంకా భూమి మీదకు రావలసి ఉంది. మనలో లోపల ఉన్న ధర్మానికి ఆధారం మహా విష్ణువు. మనలో ధర్మం ఉన్నప్పుడే మనకు సమతుల్యత లభిస్తుంది. దానిద్వారా వివేకం ఏర్పడుతుంది. అలాంటి మానవులు కుండలినీశక్తి ఉత్థానానికి చాలా అనుకూలమైనవారు. ఆత్మసాక్షాత్కారం పొంది ధ్యానం చేస్తే, కుండలినీ శక్తి ఉత్థానమై, పరిపూర్ణమైన నిరానంద అనుభూతి ప్రసాదిస్తుంది.
జీవ పరిణామక్రమం... అవతారాలు
మానవుల్లో ధర్మాన్ని పరిరక్షించి, వారిని పరిణామక్రమంలో ముందుకు తీసుకువెళ్ళినది విష్ణువు. ఆ కార్య నిర్వహణకోసమే ఆయన దశావతారాలు ధరించాడు. వాటిని గమనిస్తే... మొదటిది మత్స్యావతారం. సైన్స్‌ప్రకారం కూడా జీవరాశి మొదట నీటిలోనే ఏర్పడింది. వాటిలో కొన్ని జలచరాలు నేలమీదకు వచ్చి నడవడం మొదలుపెట్టాయి. అదే కూర్మావతారం. అలా నడవడం మొదలుపెట్టిన జీవులు మొదట నాలుగు కాళ్ళతో నడిచాయి అదే వరాహావతారం. వాటిలో కొన్ని రెండు కాళ్ళతో నడవడం ప్రారంభించాయి. కానీ వాటి పశులక్షణాలు పూర్తిగా పోలేదు. అదే నరసింహావతారం. అంటే సగం మనిషి, సగం సింహం. వాటి నుంచి కురచగా ఉండే మానవజాతి మొదలయింది. అది వామనావతారం. ఆ తరువాత పూర్తిస్థాయి మానవుడు రూపు దిద్దుకున్నా... క్రూరత్వం సంపూర్ణంగా పోలేదు. అది పరశురామావతారం. అనంతరం పూర్తిస్థాయి మానవుడు రూపుదిద్దుకున్నాడు. అదే రామావతారం. అయితే మానవులు ధర్మాన్ని కచ్చితంగా ఆచరించాలనే ఆలోచనతో... సంఘంలో అందరితో కలిసి ఆనందించడం లేదు. వారికి అది నేర్పించడానికి వచ్చిన అవతారమే శ్రీకృష్ణావతారం. అంటే పరిణామక్రమంలోని ప్రతి స్థాయిలో... ధర్మానికి భంగం కలుగుతున్నప్పుడల్లా... అధర్మాన్ని ఖండించి, ధర్మమార్గంలో ఉన్న జీవులను ఉద్ధరించడానికి భగవంతుడు స్వయంగా ఒక రూపం ధరించి భూమి మీదకు వస్తున్నాడు.
ఎప్పుడూ వర్తమానంలోనే ఉండాలి...
మానవ పరిణామ క్రమంలో తదుపరి ఉన్నత దశ... ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగులుగా మారడం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ‘నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను’ అనే విషయాన్ని తన కేంద్ర నాడీవ్యవస్థలో కలిగే అనుభూతి ద్వారా తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవాలంటే... మనలోపల సుషుమ్న నాడి పూర్తిగా తెరుచుకొని ఉండాలి. అది ఎంత తెరుచుకుంటే అంత ఎక్కువగా కుండలినీ శక్తి పైకి వచ్చి, సూక్ష్మ శరీరానికి అవసరమైన పోషణను ఇస్తుంది. సుషుమ్న నాడి విశాలంగా తెరుచుకొని ఉండాలంటే... మనం ఎల్లప్పుడూ వర్తమానంలో ఉండాలి. పని మీదనే మన ధ్యాస ఉండాలి. తీసుకొనే ఆహారం సమతుల్యతతో ఉండేలా చూసుకోవాలి. ఏది చేసినా అతి కాకుండా జాగ్రత్త వహించాలి. అరిషడ్వర్గాలలో మూడవదైన లోభం మన నాభీ చక్రాన్ని దెబ్బతీస్తుంది. దానివల్ల మన లోపల ఉన్న సుషుమ్న నాడి కూడా బలహీనపడుతుంది. లోభాన్ని అధిగమించాలంటే... దాతృత్వం కలిగి ఉండాలి. మన జీవనానికి అవసరమైన ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి. సంపాదించిన దానితో సంతృప్తి పొంది, ధార్మిక జీవనాన్ని గడపాలి.
దైవచింతనతో గడిపితే...
‘‘సహజ యోగానికి సంబంధించిన ఈ జ్ఞానం అంతా ప్రాచీన కాలంలోని ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉంది. కబీర్‌దాసు కూడా తన రచనల్లో దాని గురించి స్పష్టంగా చెప్పారు’’ అని సహజయోగ ప్రదాత శ్రీమాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు. అటువంటి ప్రాచీనమైన సహజయోగ సాధనకు మార్గశిరమాసం చాలా అనుకూల సమయం. ఈ మాసంలోనే శ్రీగోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, శ్రీరంగనాథునిలో ఐక్యమయింది. ఈ మాసంలోనే దత్తజయంతి కూడా వస్తుంది. ఈ మాసం మొదటివారంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ మాసం ఎంతో విశిష్టమైనది. దైవచింతనతో ఈ మాసాన్ని గడపడం వల్ల పరిపూర్ణమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
డాక్టర్ పి. రాకేష్ 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ