Share News

బియ్యపు జావలు అనేక రకాలు

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:16 AM

మనం బియ్యపు అన్నాన్ని ముద్దగా తింటాం. కానీ అలా కాకుండా జావ రూపంలో రకరకాలుగా కూడా స్వీకరించవచ్చు. వాస్తవానికి జావ అంటే అన్నం రసం. అన్నంలో ఉన్న సారమంతా దీనిలో ఉంటుంది. ఇలాంటి జావలు ఎన్ని రకాలో తెలుసుకుందాం.

బియ్యపు జావలు అనేక రకాలు

మనం బియ్యపు అన్నాన్ని ముద్దగా తింటాం. కానీ అలా కాకుండా జావ రూపంలో రకరకాలుగా కూడా స్వీకరించవచ్చు. వాస్తవానికి జావ అంటే అన్నం రసం. అన్నంలో ఉన్న సారమంతా దీనిలో ఉంటుంది. ఇలాంటి జావలు ఎన్ని రకాలో తెలుసుకుందాం.

బియ్యపు కడుగు: బియ్యాన్ని నీళ్లలో వేసి కడిగి తేర్చిన నీటిని బియ్యపు కడుగు అంటారు. ఈ కడుగులో దుమ్ము, బియ్యాన్ని అంటి ఉండే చిట్టు, తవుడు అన్నీ కొట్టుకు వస్తాయి. చేటతో చెరిగి బియ్యాన్ని శుభ్రపరచి కడిగితే ఆ కడుగులో చిట్టు, తవుడు మాత్రమే ఉంటాయి, దీన్ని ‘ఆరనాళకము’ అంటారు. ఈ నీటిని ఒక రాత్రంతా నిలవుంచితే పులుస్తుంది. ఈ పుల్లని ద్రవం తరవాణి లాంటిదే. బీరుతో సమానమైన గుణాలుంటాయి. దీన్ని ‘కలి’ అని కూడా అంటారు.

చిట్టుడుకు నీళ్లు: అన్నం వండటానికి బాగా పొంగులొచ్చేలా కాగబెట్టిన నీటిని ఎసరు అంటారు. కడిగి శుభ్రపరచిన బియ్యాన్ని ఎసట్లో వేసి ఉడికిస్తారు. బియ్యం ఉడుకుతూ ఉండగా చిన్న గ్లాసుతో అందులో నీళ్లను ఇవతలకు తీస్తే ఆ నీటిని చిట్టుడుకు నీళ్లు అంటారు. ఈ నీళ్లు తాగితే అమితమైన చలవ నిస్తాయి. బియ్యంలో సారవంతమైన బాగం చిట్టు తవుడే! ఇవి బియ్యపు పైపొరలు. మనం ప్రస్తుతం ఈ పొరలను తొలగించిన నిస్సారమైన బియ్యాన్ని అన్నం పేరుతో తింటున్నాం. దంపుడు బియ్యంతో అన్నం వండేప్పుడు తీసిని చిట్టుడుకు నీళ్లలో ఈ చిట్టు, తవుడు ఎక్కువగా ఉంటాయి.

గంజి: బియ్యానికి రెండు నుంచి మూడు రెట్లు నీళ్లు పోసి ఉడికించిన అన్నంలో అదనపు నీటిని వారుస్తారు. ఇది అన్నరసం. దీన్నే ఇంగ్లీషులో స్టార్చి అంటారు. దీనిని బట్టలు ఫెళఫెళలాడటానికి ఉపయోగిస్తారు. ఈ గంజినీళ్ళని కదలకుండా ఉంచితే దానిపైన తెట్టు కడుతుంది దీన్ని గంజి తొరక అని, మాసరం అనీ పిలుస్తారు. మెతుకు లేని గంజిని గొడ్డంబలి అంటారు. ఈ గంజిలో పిండిపదార్థాలు, కొంచెం కొవ్వు, విటమిన్లు కూడా ఉంటాయి. గంజి ద్వారా పిండి పదార్థాలు కొంత వరకు బయటకు పోతాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కుక్కర్లో వండిన అన్నం కన్నా గంజివార్చిన అన్నమే గొప్పది. గంజి వార్చకుండా వండిన అన్నాన్ని ఇగిరిక అంటారు. ఇందులో అసృతాన్నదోషం ఉంటుందని.. అందువల్ల వార్చిన అన్నాన్నే తినాలని పాకదర్పణం గ్రంథం పేర్కొంది..

జావ: బియ్యానికి ఆరు రెట్లు నీళ్లు పోసి పలుచగా కాచినది జావ. దీన్నే అంబలి, గటక అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద గ్రంథాలు యవాగువు అన్నాయి. భోజన కుతూహలం గ్రంథం ఈ యవాగువు బలకరమైందని, సంతృప్తి నిస్తుందని, వాత దోషాన్ని పోగొడ్తుందని పేర్కొంది. దీన్నే ’మండం‘ అని కూడా పిలుస్తారు.

విలేపి: బియ్యానికి నాలుగు రెట్లు నీళ్లు పోసి కొంచెం చిక్కగా కాచినట్టైతే దాన్ని విలేపి అంటారు. ఇది ఎక్కువ బలకరమైనది. వేడిని తగ్గిస్తుంది. పురుషత్వాన్ని పెంచుతుంది.

పేయం: బియ్యంలో చాలా ఎక్కువ నీళ్లు పోసి పలుచగా కాచినట్లైతే దాన్ని పేయం అంటారు. బార్లీ, జొన్న, రాగి లాంటివాటితోపేయం (పారిజ్‌)తయారు చేసుకుని ఉదయం టిఫిన్లకు బదులుగా తీసుకుంటారు. దీన్ని పాలు పోసి కాస్తారు లేదా మజ్జిగ కలుపుకుని తాగుతారు. ఇది విరేచనాల్లో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. తేలికగా అరుగుతుంది. కఫ దోషాన్ని పోగొడుతుంది.

- గంగరాజు అరుణాదేవి

Updated Date - Nov 30 , 2024 | 12:16 AM