పోరు బాట... గెలుపు బావుటా
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:55 AM
బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన తొలి తమిళ సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు ఉమా కుమరన్. నలభై రెండేళ్ళ క్రితం... శ్రీలంక నుంచి బ్రిటన్‌కు వలస వెళ్ళిన కుటుంబానికి చెందిన ఆమె సామాజిక సమస్యలపై తన స్వరాన్ని
బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన తొలి తమిళ సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు ఉమా కుమరన్. నలభై రెండేళ్ళ క్రితం... శ్రీలంక నుంచి బ్రిటన్‌కు వలస వెళ్ళిన కుటుంబానికి చెందిన ఆమె సామాజిక సమస్యలపై తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూ ఉంటారు. ‘‘తిరుగుబాటు, ఉద్యమశీలత నా రక్తంలోనే ఉన్నాయి’’ అంటున్న ఉమ మార్పు సారథిగా తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
‘‘గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ మీ ప్రతినిధినే. ఎప్పటికీ మీ గళాన్నే. ఇప్పుడు నన్ను ఎన్నుకొని నా బాధ్యత మరింత పెంచారు. నా ద్వారా సమాజంలో మీరు కోరుకుంటున్న మార్పును సాధించడమే లక్ష్యంగా పని చేస్తాను’’... ఇటీవల ముగిసిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఉమా కుమరన్... ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతూ అన్న మాటలివి. బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి తమిళ సంతతి మహిళగా ఆమె చరిత్రలో నిలిచారు. అంతేకాదు, కిందటి ఏడాది కొత్త పార్లమెంటరీ స్థానంగా ఏర్పాటైన స్ట్రాట్‌ఫోర్డ్ అండ్ బౌ నుంచి ఎన్నికైన తొలి ఎంపీ కూడా ఆమే కావడం విశేషం.
వాతావరణ మార్పులపై అవగాహన అత్యవసరం...
ముప్ఫై ఆరేళ్ళ ఉమ పుట్టిందీ, పెరిగిందీ లండన్ నగరంలోనే. ఆమె పూర్వీకులు శ్రీలంకలోని జాఫ్నాలో ఉండేవారు. శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా కల్లోల పరిస్థితులు ఏర్పడడంతో... నలభై రెండేళ్ళ కిందట ఆమె కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్ళింది. ‘‘మా తాతయ్య జాఫ్నాలో ప్రభుత్వోద్యోగి. అలాగే తొలి ట్రేడ్ యూనియన్ నాయకుల్లో ఒకరు. అప్పట్లో శ్రీలంకలోని గౌరవప్రదమైన కుటుంబాల్లో మాదీ ఒకటి. పారిశుధ్య కార్మికుల హక్కుల కోసం మా తాతయ్య ఆందోళనలు చేస్తున్నారని తెలుసుకున్న మా ముత్తాత... ఆయనను ఇంటినుంచి వెళ్ళగొట్టారు. అయినా తాతయ్య వెనక్కి తగ్గలేదు. ప్రజలకోసం ఏదైనా చెయ్యాలనే ఎంతో తపన పడేవారు. ఈ విధంగా తిరుగుబాటు, ఉద్యమశీలత నాకు వారసత్వంగా వచ్చాయి’’ అంటారు ఉమ. లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక... ‘నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎ్‌స) ప్రొఫెషనల్స్’లో రెండేళ్ళపాటు పని చేశారు. ఆ తరువాత లేబర్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ డాన్ బట్లర్ దగ్గర పార్లమెంటరీ రీసెర్చర్‌గా, ఆ తరువాత పార్టీ నాయకులకు ప్రచార సలహాదారుగా, పార్టీ కమిటీలు, సంస్థల్లో పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ అడ్వైజర్... ఇలా పలు బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో... సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని, స్థానికులతో మమేకమయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ప్రణాళికా సంఘంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ‘సి40 సిటీస్ క్లైమెట్ లీడర్‌షిప్ గ్రూప్’నకు దౌత్య, అంతర్జాతీయ సంబంధాల డైరెక్టర్‌గా రెండేళ్ళు పని చేశారు. ‘‘వాతావరణ మార్పుల గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించడం అత్యవసరం. ప్రజలు చైతన్యవంతులైతేనే పాలకుల్లో, అధికారుల్లో క్రియాశీలత పెరుగుతుంది. ఇది ఏదో ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదు. ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు. ఆ కోణంలోనే దీనికి పరిష్కారాలను వెతకాలి’’ అని చెబుతారు ఉమ. చట్టసభల్లో తన వాణిని వినిపించాలనేది ఆమె ఆకాంక్ష. కానీ అది అంత త్వరగా నెరవేరలేదు.
వాళ్ళను ఏమనాలి?
ఉమ 2010లో... వాయవ్య లండన్‌లోని హారోలో... పిన్నెర్ సౌత్ వార్డు నుంచి పోటీ చేసి... పరాజయం పాలయ్యారు. ఆ తరువాత... 2015 సార్వత్రిక ఎన్నికల్లో హారో ఈస్ట్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రచార సమయంలో... కన్సర్వేటివ్ పార్టీ సభ్యుడైన ముఖేశ్ నాకెర్ నాయకత్వంలోని ‘ధర్మ సేవా పూర్వపక్ష’ అనే సంస్థ ప్రతినిధులు ఆమెపై దాడి చేశారు. కుల వివక్షను నిషేధించే (2013) చట్టానికి లేబర్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని ఆ సంస్థ తప్పు పడుతూ... దానివల్ల సమాజంలో ద్వేషం, వేర్పాటువాదం మరింత పెరుగుతాయనీ, కాబట్టి ఉమకు ఓటు వేయవద్దనీ ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లోనూ ఉమ ఓటమి చెందారు. మరోవైపు మత రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖేశ్ నాకెర్ బృందం చేసిన ప్రచారం ఆమెను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ‘‘ఆ సమయంలో నేను ఎంతో క్షోభ అనుభవించాను. ‘అందరూ సమానమే’ అనే భావనను వ్యతిరేకించేవాళ్ళను ఏమనాలి? నా మీద జరిగిన ప్రచారంతో నా కుటుంబం, నా స్నేహితులు ఆందోళనకు గురయ్యారు’’ అని గుర్తుచేసుకున్నారు ఉమ. దాంతో... రెండేళ్ళ తరువాత... 2017లో వచ్చిన ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే... ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కృషిని కొనసాగించారు. లండన్‌లో... ముఖ్యంగా కిందటి ఏడాది నూతన నియోజకవర్గంగా ఏర్పాటైన స్ట్రాట్‌ఫోర్డ్ అండ్ బౌ నియోజకవర్గ పరిధిలో తమిళుల సంఖ్య గణనీయంగా ఉంది. ప్రత్యేకించి... శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చిన ఎంతోమంది అక్కడ స్థిరపడ్డారు. కాబట్టి ఉమ సరైన అభ్యర్థి అని లేబర్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ‘‘గతంలో ఎదురైన చేదు అనుభవాలను పక్కకునెట్టి... ఈసారి ఎలాగైనా గెలిచి చూపించాలనుకున్నాను’’ అని చెప్పిన ఉమ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక తమిళుల శ్రేయస్సు, నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో గృహ వసతి, త్వరితమైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన లాంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. మరోవైపు పాలస్తీనా సమస్య, వాతావరణ మార్పులపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతానని కూడా వాగ్దానం చేశారు. ఇటీవలి పోలింగ్‌లో... 40 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. ‘‘ఇది 15 ఏళ్ళు ప్రజాక్షేత్రంతో నేను చేసిన పోరాటానికి గుర్తింపు. ఈ నియోజకవర్గ మొదటి ఎంపీగా సేవ చేసే అవకాశాన్ని ప్రజలు నాకు ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా మీద వారు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను’’ అని చెబుతున్న ఉమకు ప్రపంచవ్యాప్తంగా తమిళ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.