Puppetry : తోలుబొమ్మలతో తిరుగులేని మార్పు
ABN , Publish Date - Dec 07 , 2024 | 04:16 AM
తమిళనాడు, తిరునల్వేలిలోని కీలతెంకాలం గ్రామానికి చెందిన రతికి తోలుబొమ్మలు, కథలతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది.
వర్ణ, లింగ వివక్షను ప్రదర్శించే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం వినూత్న ప్రయత్నానికి పూనుకుంది తమిళనాడుకు చెందిన రతి. కథలు, తోలుబొమ్మలాటలతో విద్యార్థులను చైతన్యపరుస్తూ, సమూల మార్పుకు దోహదపడుతున్న 39 ఏళ్ల ఆమె కథనమిది.
తమిళనాడు, తిరునల్వేలిలోని కీలతెంకాలం గ్రామానికి చెందిన రతికి తోలుబొమ్మలు, కథలతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది. తండ్రితో పాటు తోలుబొమ్మలాటలకు హాజరైన రతి వాటితో ప్రేమలో పడిపోయింది. బొమ్మల ద్వారా మనోభావాలను వ్యక్తీకరిస్తూ, వినోదాన్ని పంచే ఆ కళనే వృత్తిగా మలుచుకోవాలని కూడా భావించింది. కానీ చివరకు జీవనభృతి కోసం తోలు పరిశ్రమను ఎంచుకోక తప్పలేదు. 99.9 శాతం పురుషాధిక్యతలో కొనసాగే తోలు పరిశ్రమ మహిళలకు తగని రంగమని రతి ఆలస్యంగా గ్రహించింది. అక్కడి వాతావరణం ఇబ్బందికరంగా మారడంతో ఉద్యోగానికి స్వస్థి చెప్పి, 2009లో తనకెంతో ఆసక్తి ఉన్న నటనారంగంలోకి అడుగుపెట్టింది. అలాగే 2014లో కథలు చెప్పి అలరించే అభిరుచిని కూడా అలవాటు చేసుకుంది. అలా రతి స్టేజి యాక్టర్‌గా, స్టోరీ టెల్లర్‌గా, పప్పెటీర్‌గా 2010 నుంచి ఈరోడ్‌లోని పాఠశాలల్లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది.
మార్పు సాధ్యమే...
ఒక సందర్భంలో తనకెదురైన ఒక అనుభవం గురించి ప్రస్థావిస్తూ... ‘‘ఒక బడిలో ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఒక విద్యార్థి ‘మీరు ఆఫ్రికా నుంచి వచ్చారా?’ అని అడిగింది. రంగు తక్కువ కాబట్టి నాకిలాంటి ప్రశ్నలు మామూలే! ఆ మాటలు విన్న టీచర్ తర్వాత ఆ విద్యార్థిని దండించబోతుంటే, నేను వారించాను. ఆ తర్వాత వర్ణ వివక్ష గురించి 40 నిమిషాల నిడివి గల కథను వినిపించాను. ఆ కథ విన్న తర్వాత, తరగతిలోని కొందరు ఆడపిల్లలు నా దగ్గరకొచ్చి, వాళ్లెలా వర్ణవివక్షకు గురయ్యారో వివరిస్తూ, వాళ్ల అనుభవాలను పంచుకున్నారు. నా కథ వాళ్ల మీద ప్రభావం చూపించగలిగినందుకు ఎంతో సంతోషించాను. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ అదే బడికి వెళ్లినప్పుడు, ఆ ఆడపిల్లలందరూ నా దగ్గరకు పరుగున వచ్చి, అందరూ వాళ్లను నల్ల పిల్లా అని పిలవడం మానేశారని ఎంతో హుషారుగా చెప్తుంటే ఆనందంతో పొంగిపోయాను’’ అంటూ చెప్పుకొచ్చింది రతి. అయితే అందరు కళాకారుల్లాగే ప్రారంభంలో రతి కూడా సవాళ్లను ఎదుర్కొంది.
సవాళ్లను స్వీకరించి...
‘‘వృత్తిలోకి అడుగుపెట్టిన మొదట్లో ప్రదర్శనలకు వేదికలు దొరికేవి కావు. 30వ ఏటలోకి అడుగుపెట్టగానే నేను మానసిక కుంగుబాటుకు గురయ్యాను. దాన్నుంచి అతి కష్టం మీద కోలుకుని పట్టుదలగా ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టాను. చెన్నైకి చెందిన నటి, దర్శకురాలు సుకన్యా ఉమేష్, తాను రచించిన ఒక స్ర్కిప్ట్‌ను నాటకంగా ప్రదర్శించమని నన్ను ఆహ్వానించారు. ఆ స్ర్కిప్ట్ అచ్చంగా నా జీవితాన్నే తలపించింది. చెన్పైలో పెరిగే క్రమంలో రంగు తక్కువ అమ్మాయి ఎదుర్కొన్న అవమానాలకు సంబంధించిన కథ అది. రిహార్సల్స్ సమయంలో భోరున ఏడ్చేసేదాన్ని. ఆ నాటకానికి నాకెంతో మంచి పేరొచ్చింది. అప్పటి నుంచి నాటక ప్రదర్శననే నా వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా ఒక స్టోరీ టెల్లింగ్ కంపెనీ కోసం పని చేయడం మొదలుపెట్టాను. ఆహార, ప్రయాణ ఖర్చులు పోను, వాళ్లు నాకు రెండు వేల రూపాయలు పారితోషికంగా ఇచ్చేవారు.
ఆ తర్వాత కొవిడ్‌తో కంపెనీ మూతపడింది. లాక్‌డౌన్ కాలంలో కళాకారులందరం ఇబ్బంది పడ్డాం. ప్రదర్శనలకు అవకాశాలే లేకుండా పోయాయి. దాంతో స్టోరీ టెల్లింగ్‌తో పాటు తోలుబొమ్మలాటలను వృత్తిగా మలుకుని కొత్త జీవితం మొదలుపెట్టాను.
వెయ్యి ప్రదర్శనలతో...
కథలు చెప్పడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకోసం శిక్షణ తీసుకోవాలి. అయితే రతి యూట్యూబ్ ద్వారా శిక్షణ తీసుకుంది. ఎన్నో పుస్తకాలు చదివింది. ఆన్‌లైన్ సెషన్లకు హాజరైంది. ‘‘పిల్లల బుక్ ట్రస్ట్ నుంచి నేనెన్నో పుస్తకాలను సేకరించాను. ప్రారంభంలో అవి నాకెంతో ఉపయోగపడ్డాయి. అలాగే నేను 100 వరకూ తోలుబొమ్మలను సంపాదించుకోగలిగాను. జైపూర్ నుంచి తీగలకు వేలాడే తోలుబొమ్మలు, టిలోనియా నుంచి చేతి తొడుగుల తోలుబొమ్మలు, హంపి, తెలంగాణాల నుంచి తోలుతో తయారైన బొమ్మలు సేకరించాను. అలా వాటితో 40 నుంచి 50 నిమిషాల నిడివి కలిగిన ప్రదర్శనలను రూపొందుకుని ప్రదర్శించడం మొదలుపెట్టాను’’ అంటూ తన ప్రస్థానాన్ని వివరించిన రతి, ప్రత్యేక అవసరతలు కలిగిన వారికి టిక్కెట్ రుసుములో ప్రత్యేక రాయితీ కూడా అందిస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ తాను వెయ్యి తోలుబొమ్మలాటలను ప్రదర్శించాననీ, ఈ కళ ద్వారా తన మనోభావాలను వ్యక్తం చేయగలగడంతో పాటు వర్ణ, లింగ వ్యవక్షల పట్ల చైతన్యం తీసుకురాగలిగాననీ అంటోంది రతి.