Golf Journey : సరదాగా మొదలెట్టి... సత్తా చూపుతోంది
ABN , Publish Date - Dec 19 , 2024 | 06:21 AM
గోల్ఫ్ అనగానే వాణిజ్యవేత్తలు తమ స్నేహితులతో ఆడే ఆట గుర్తుకొస్తుంది. గోల్ఫ్ ఆడే మహిళలు అరుదు. అలాంటి అరుదైనా గోల్ఫర్ వాణీకపూర్. గోల్ఫ్‌తో ముడిపడిన వాణీ ప్రస్థానం ఆమె మాటల్లోనే...
గోల్ఫ్ అనగానే వాణిజ్యవేత్తలు తమ స్నేహితులతో ఆడే ఆట గుర్తుకొస్తుంది.
గోల్ఫ్ ఆడే మహిళలు అరుదు.
అలాంటి అరుదైనా గోల్ఫర్ వాణీకపూర్. గోల్ఫ్‌తో ముడిపడిన వాణీ ప్రస్థానం
ఆమె మాటల్లోనే...
‘‘నాన్న మంచి గోల్ఫర్. చిన్నప్పటి నుంచి నాన్నతో పాటు క్లబ్‌కు వెళ్తూ ఉండేదాన్ని. నాకు ఆడాలనే ఉత్సుకత ఉండేది. కానీ ఎక్కడ చూసినా పురుషులే ఉండేవారు. అమ్మాయిలు కనిపించేవారు కాదు. వారి కోసం శిక్షణ ఇచ్చేవారు కూడా లేరు. దీనితో చాలా కాలం సరదాగా గోల్ఫ్ ఆడేదాన్ని. నా ఉత్సాహం చూసి అమ్మ,నాన్న నన్ను గోల్ఫ్ ఆడమని ప్రొత్సహించారు. పదేళ్ల వయస్సులో గోల్ఫ్ నేర్చుకోవటం కోసం కోచ్ దగ్గర చేరాను. ఆ సమయంలో ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్ గోల్ఫ్‌క్లబ్‌లో నెనొక్కదాన్నే అమ్మాయిని ఉండేదాన్ని. మా కోచ్ దగ్గర మిగిలిన వారందరూ అబ్బాయిలే! గోల్ప్ వ్యక్తిగతంగా ఆడాల్సిన క్రీడ. దీనికి ఓపిక , ఏకాగ్రత ఎక్కువగా కావాలి. ఎక్కువ సమయం గ్రౌండ్‌లో వెచ్చించాల్సి వస్తుంది. దీనితో అమ్మ,నాన్న నన్ను మా కోచ్‌కు అప్పచెప్పారు. నాకు గోల్ఫ్ నేర్పటంతో పాటుగా నన్ను కనిపెట్టుకొని ఉండటం కూడా ఆయన పని. నేను గోల్ఫ్ ఆడటం ప్రారంభించిన సమయంలో అత్యున్నత స్థానాల్లో అందరూ పురుషులే ఉండేవారు. మహిళలు అతి తక్కువగా ఉండేవారు.
సహనం నేర్పింది...
చిన్నప్పుడు నేను చాలా చురుకుగా ఉండేదాన్ని. ఒక చోట కూడా కుదురుగా కూర్చోలేకపోయేదాన్ని. అటూ ఇటూ తిరుగుతూ ఉండేదాన్ని. గోల్ఫ్ నా వ్యక్తిత్వానికి పూర్తిగా భిన్నమైన క్రీడ. దీనిలో సహనమే ప్రధానం. లక్ష్యం చేరుకొనే దాకా గంటల తరబడి ఒకే బంతిని కొడుతూ ఉండాలి. కొద్దిగా ఏకాగ్రత కోల్పోయినా ఓడిపోతాం. అందువల్ల క్రమశిక్షణతో ప్రతి రోజూ సాధన చేయాల్సిందే! ఈ క్రమశిక్షణ నాలో సహనం నేర్పించింది. ఇప్పుడు గంటల కొలది సమయం ఏకాగ్రతతో ఉండగలుగుతాను. మొదటి సారి నేను అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొన్నప్పుడు విపరీతంగా భయపడ్డాను. కానీ నాకు ఆ సమయంలో కొన్ని వేల గంటల శిక్షణ ఎంతో పనికొచ్చింది. ఇక్కడ ఇంకో విషయాన్ని నేను ప్రస్తావించాలి. మిగిలిన క్రీడల మాదిరిగానే గోల్ప్‌లో కూడా మహిళలు తక్కువే! అయితే పురుషులతో పోలిస్తే భారతీయ మహిళా గోల్ఫర్స్ మంచి ప్రజ్ఞ కనబరుస్తున్నారు. యూరప్ సర్క్కూట్స్‌లో కూడా పాల్గొంటున్నారు. నేను ఆడటం మొదలుపెట్టినప్పుడు అంతర్జాతీయ పోటీలకు అతి కొద్ది మంది మాత్రమే వెళ్లేవారు. ఆస్ట్రేలియా లేడీస్ పీజేఏ టూర్‌లో పాల్గొన్నప్పుడు- అక్కడ చాలా మంది నన్ను ఆశ్చర్యంగా చూశారు. దానికి వారికి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు అప్పటి దాకా అలాంటి ముఖ్యమైన టూర్‌లలో భారతీయ మహిళా క్రీడాకారులను ఎవరిని చూడలేదు. ఈ మధ్యకాలంలో అదితి అశోక్ వంటి గోల్ఫర్లు అంతర్జాతీయ పోటీలలో కూడా తమ సత్తా చూపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ గోల్ఫర్లకు మంచి రోజులు వస్తున్నాయి.
అయినా వివక్షే...
టెన్నీస్, బ్యాడ్మింటన్, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ వంటి అనేక క్రీడా విభాగాలలో మహిళలు అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్నారు. ఒలింపిక్స్ వంటి కఠినమైన పోటీలలో కూడా పతకాలు సాధిస్తున్నారు. అయినా ఇప్పటికీ క్రీడలలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే కనిపిస్తుంది. ఎక్కువ మంది మహిళలకు క్రీడలంటే ఆసక్తి కనిపించదు. బహుశా అది మన సంస్కృతి, సంప్రదాయాల వల్ల కలిగే భావన కావచ్చు. కానీ నా ఉద్దేశంలో మహిళలు మంచి క్రీడాకారిణులుగా ఎదగగలుగుతారు. మన దేశానికి పేరు తేగలుగుతారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం.
సాధారణంగా పురుషుల కన్నా మహిళలలో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. సహనం కూడా ఎక్కువే. అందువల్ల వారు మంచి గోల్ఫర్స్ అవుతారు. అయితే ఈ క్రీడ ఇంకా అందరికీ అందుబాటులో లేదు. కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మధ్యకాలంలో అనేక పట్టణాలలో గోల్ఫ్ క్లబ్‌ల నిర్మాణం ప్రారంభమయింది. అందువల్ల భవిష్యత్తులో మహిళా గోల్ఫర్స్ అనేక మంది పోటీలలో మెరుస్తారనుకుంటున్నా! ‘టైగర్ ఉడ్స్, రోరీ మెక్‌ల్రాయ్, జేసన్ డే నాకిష్టమైన గోల్ఫ్ క్రీడాకారులు.