Victoria’s Journey: మక్కువతో మొదలై.. పరిశ్రమగా ఎదిగింది
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:09 AM
ఆమె మక్కువతో నేర్చుకున్న జనపనార ఉత్పత్తుల తయారీ పని, వేల మందికి జీవనభృతిని కల్పించడానికి కారణమైంది.
ఆమె మక్కువతో నేర్చుకున్న జనపనార ఉత్పత్తుల తయారీ పని, వేల మందికి జీవనభృతిని కల్పించడానికి కారణమైంది. టిటిడి దేవస్థానానికీ, టప్పర్‌వేర్ కంపెనీకీ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి కూడా ఎదిగిపోయింది. ఆ వైనాన్నీ, జూట్ ఉత్పత్తుల శిక్షకురాలిగా తన అనుభవాల్నీ నవ్యతో ఇలా పంచుకుంది హైదరాబాద్‌కు చెందిన విక్టోరియా. ఆ ఆసక్తికరమైన విశేషాలు...
కుట్టు పనంటే నాకెంతో మక్కువ. ఆ మక్కువ కాస్తా జూట్ మీదకు మళ్లింది. దాంతో 17 ఏళ్ల క్రితం నేషనల్ జూట్ బోర్డులో జూట్ సంచుల తయారీలో శిక్షణ తీసుకున్నాను. నేర్చుకున్న రెండు నెలల నుంచే నేషనల్ జూట్ బోర్డు నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరయ్యే వారికి శిక్షణ ఇవ్వడం కూడా మొదలుపెట్టాను. అలా కరీంనగర్, జగిత్యాల, మెట్టుపల్లి, ఖమ్మం మొదలైన ప్రాంతాల్లో వేల మందికి శిక్షణ ఇచ్చాను. ప్రభావన మల్టీ స్టేట్ విమెన్స్ జూట్ అండ్ ఫైబర్ ప్రొడక్ట్స్ కొఆపరేటివ్ సొసైటీ తరఫున ఏడేళ్లుగా వాళ్లు నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి శిక్షణనిస్తున్నాను. అంతకు ముందు వరకూ నేషనల్ జూట్ బోర్డు తరఫున శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం ప్రభావనలో శిక్షకురాలిగా పని చేస్తూనే ప్రొడక్షన్ పని కూడా చూసుకుంటున్నాను.
అంధులకూ, ట్రాన్స్‌జెండర్స్‌కూ...
నా దగ్గర జూట్ సంచుల తయారీ నేర్చుకుని, యూనిట్లు పెట్టుకునే స్థాయికి ఎదిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్స్‌కూ, అంధులకూ కూడా సంచుల తయారీలో శిక్షణనిచ్చాను. ట్రాన్స్‌జెండర్స్‌కు నేర్పించే సమయంలో వాళ్ల మెప్పు పొందడం చాలా కష్టమని ఎంతో మంది నిరుత్సాహపరిచారు. కానీ సంచులు కుట్టడం దగ్గరి నుంచి సొంత వ్యాపారాలు నెలకొల్పే స్థాయికి ఎదిగే వరకూ మూడేళ్ల పాటు నేను వాళ్లతో ఉన్నాను. వాళ్లందరూ నన్ను అమ్మా అని పిలుస్తారు. నేను కూడా వాళ్లను పిల్లల్లాగే భావిస్తూ ఉంటాను. సాధారణంగా ట్రాన్స్‌జెండర్స్ అనగానే వాళ్లు మగవాళ్లు అనే భావన మనసులో కలుగుతుంది. కానీ నేను వాళ్లను మహిళల్లాగే పరిగణించి, అలాగే మెలగడంతో వాళ్లు నాకెంతో దగ్గరైపోయారు. ఒక ట్రాన్స్‌జెండర్ క్రిస్మస్ సందర్భంగా నాకోసం ఫలహారాలు, బియ్యం కూడా పంపించింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలోని యూనిట్‌లో అంధులకు కూడా నేను జనపనార సంచుల తయారీ నేర్పించాను. అంధులకు అర్థమయ్యేలా నేర్పించడం కోసం నేను కూడా కళ్లు మూసుకుని సంచులను కుట్టడం సాధన చేశాను. ఎలా వివరిస్తే అంధులకు సులువుగా అర్థమవుతుందో నాకు నేనుగా గ్రహించి వాళ్లకు నేర్పించాను. చేతులతో పట్టుకుని బ్యాగ్ సెంటర్ పాయింట్‌ను గుర్తించడం, అక్కడి నుంచి వేళ్లతో రెండంగులాలు కొలిచి హ్యాండిల్‌ను కుట్టడమెలాగో నేర్పించాను.
ప్రసాదం సంచులు మావే!
టిటిడి నుంచి మాకు విడతలవారీగా దాదాపు లక్ష సంచులు తయారు చేసి పంపించమని ఆర్డర్లు అందుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రసాదం సంచులే! ప్రత్యేకించి తిరుపతి లడ్డుకు జనపనార అంటుకోకుండా ఉండడం కోసం, సంచి లోపల అల్యూమినియం ఫాయిల్‌ను కూడా ఏర్పాటు చేసి కుడుతూ ఉంటాం. ఈ సంచితో పాటు ఇతరత్రా ప్రసాదాలన్నిటికీ కలిపి ఒక పెద్ద సంచీ తయారుచేస్తాం. అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కూ, టప్పర్‌వేర్ కంపెనీకీ పని చేస్తున్నాను. టప్పర్‌వేర్ లంచ్ బాక్సుల కవర్ల లోపల జనపనార లైనింగ్ కుట్టి అందిస్తూ ఉంటాను. జనపనార సంచులు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు ఎక్కువ కాలం పాటు మన్నుతాయి. ప్లాస్టిక్‌లా కాకుండా మట్టిలో పూర్తిగా కలిసిపోతాయి. పర్యావరణ హితం పట్ల అందర్లో అవగాహన పెరగడంతో వీటికి గిరాకీ కూడా బాగా పెరిగింది. నలుగురికి ఉపయోగపడేవీ, పర్యావరణానికీ హాని కలిగించని ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు, వాటి తయారీ నలుగురికీ నేర్పించి, జీవనభృతి కల్పించగలుగుతున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉంది.
గోగుమళ్ల కవిత
మా వారు ఇమ్మానుయెల్ ఆనంద్ బాబు, అమెరికన్ రీసెర్చ్ సెంటర్‌లో ప్రోగ్రామర్‌గా పని చేశారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఉన్నన్ని రోజులు నేను ఇంటికే పరిమితమైపోయాను. పెద్దగా చదువుకోలేదు కాబట్టి కుట్టుపనితో కాలక్షేపం చేసేదాన్ని. ఆయన పోయిన తర్వాత, జూట్ ఉత్పత్తుల తయారీ నేర్చుకుని, శిక్షకురాలిగా మారిపోయాను. ఇప్పటికీ పండగలు, పెళ్లి వేడుకల సందర్భాల్లో నాకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి. నాకు కూతురు, కొడుకు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. మా బాబు శామ్యుయెల్, స్నూకర్ బోర్డుల మరమ్మత్తు చేస్తూ ఉంటాడు.