Share News

పెళ్లయిన నాలుగేళ్లకు హనీమూన్‌కు వెళ్లాం

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:58 AM

ఆయన నటిస్తున్న ఒక సినిమా ఇంకా థియేటర్‌లో ఆడుతూనే ఉంటుంది. ఈలోగా ఇంకో సినిమా ప్రమోషన్స్‌ మొదలవుతాయి.

పెళ్లయిన నాలుగేళ్లకు హనీమూన్‌కు వెళ్లాం

ఆయన నటిస్తున్న ఒక సినిమా ఇంకా థియేటర్‌లో ఆడుతూనే ఉంటుంది. ఈలోగా ఇంకో సినిమా ప్రమోషన్స్‌ మొదలవుతాయి. ఆ పని జరుగుతుండగానే మరో రెండో, మూడో సినిమాల ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంటుంది. హీరోలందరూ సినిమా సినిమాకీ ఎంతో గ్యాప్‌ తీసుకుని తాపీగా సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంత టైట్‌ గా షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకుని వరుసగా సినిమాలు చేసేస్తున్న హీరో... సుహాస్‌. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. మే 3న విడుదలవుతున్న ‘ప్రసన్నవదనం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సుహాస్‌తో ‘నవ్య’ చిట్‌ఛాట్‌...

యూట్యూబర్‌ నుంచి హీరో అయ్యారు.

మీ జర్నీ ఎలా అనిపిస్తోంది?

నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. హీరో అవుదామని ఎప్పడూ అనుకోలేదు. వంద దాకా షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాను. అవి చూసి ‘మజిలి’. ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అందులోని పాత్రలు క్లిక్‌ అవడంతో జనం దృష్టిలో పడ్డాను. ఫ్రెండ్స్‌ అంతా కలసి ‘కలర్‌ ఫొటో’ తీద్దాం, అందులో నువ్వే హీరోవన్నారు. నాకు చెప్పలేనంత భయం వేసింది. సినిమాల్లో క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇప్పుడు హీరోగా నటించడమంటారేమిటి అనుకున్నాను. కానీ అందరూ ఒత్తిడి చేయడంతో కాదనలేకపోయాను. అలా ‘కలర్‌ ఫొటో’ నా కెరీర్‌ను మలుపు తిప్పింది.


షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసిన సుహాస్‌కి,

ఇప్పటి సుహాస్‌కి తేడా ఏమిటి?

ఏమీ లేదండీ. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసినప్పటి సర్కిలే ఇప్పటికీ ఉంది. అప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌కు డైరెక్ట్‌ చేసిన వారితోనే ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ‘కలర్‌ ఫొటో’ ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీ పేట..’ ఇలా నా చిత్రాలకు దర్శకత్వం వహించిన వారు ఒకప్పుడు నాతో షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసినవారే. అప్పుడెంత సిన్సియర్‌గా పని చేశామో, ఇప్పుడూ అలానే వర్క్‌ చేస్తున్నాం. ‘ఛాయ్‌ బిస్కెట్‌’లో మంచి టాలెంట్‌ ఉంది. ముందు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేద్దాం. తర్వాత సినిమాలు తీయాల్సిందే అని అనుకున్నాం. ఆ రోజుల్లో అవి వర్కవుట్‌ అయ్యాయి. లక్కీగా సినిమాలు కూడా ఆడుతున్నాయి.

పరిశ్రమలో మీకు గాడ్‌ ఫాదర్‌ ఎవరు?

ఎవరూ లేరండి. ఇక్కడ రాణించాలంటే టాలెంట్‌ ఒక్కటే చాలదు. అదృష్టం కూడా కలసి రావాలి. అది నా వెన్నంటే ఉందని నా నమ్మకం. మరో విషయం ఏమిటంటే ‘ఛాయ్‌ బిస్కెట్‌’ సంస్థలో పని చేస్తున్నప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌తో పాటు మూవీ ప్రమోషన్స్‌ కూడా చేసే వాళ్లం. ఆ రోజుల్లో విడుదలైన చిన్న, పెద్ద చిత్రాలకు ఇలా ప్రమోషన్స్‌ చేసే సమయంలో హీరోలు, దర్శకులతో పరిచయాలు కలిగాయి. వారికి సన్నిహితుడిని కాగలిగాను. నాగచైతన్య, సాయిధరమ్‌తేజ్‌, విజయ్‌ దేవరకొండ.. వీళ్లని అన్నా అని పిలుస్తూ వెంటే తిరిగేవాణ్ణి. నేను ఆర్టిస్ట్‌నయ్యాక ఆ పరిచయాలు ఉపయోగపడ్డాయి. నేనంటే ఉన్న అభిమానంతోనే వారంతా నా సినిమాలను ప్రమోట్‌ చేస్తున్నారు.


కథల ఎంపికలో ఎవరి సాయం తీసుకొంటారు?

నేను ఎవరి సాయం తీసుకోనండి. నా ఫ్రెండ్‌ సర్కిల్‌ చాలా పెద్దది. నాతో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసినవాళ్లు దాదాపు పదిహేనుమంది ఉంటారు. నేనొక సినిమా చేస్తున్నాను.. ఇదీ కథ అని వాళ్లకు చెబుతాను తప్ప చేయవచ్చా, లేదా అని సలహాలు అడగను. కథ వినగానే దానికి ఎస్‌ ఆర్‌ నో అనేది నేనే చెబుతాను. సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా నాదే.

‘అంబాజీపేట..’లో హీరో మల్లి లాంటి పాత్ర సాధారణంగా ఏ హీరో చేయరు. ఏమిటీ మీ ధైర్యం?

అదే ప్రశ్నను నాకు నేనే ఇప్పటికీ చాలాసార్లు వేసుకున్నాను. ఇంతమంది నిర్మాతలు వచ్చి సినిమాలు చేయండి, అడ్వాన్స్‌ తీసుకోండి అంటున్నా వాటిని ఒప్పుకోకుండా వాళ్లని రెండేళ్లు ఆపి, రెండుసార్లు గుండు కొట్టించుకుని ఆ సినిమా చేశాను. ‘ఏమిటీ.. ఎందుకిలా చేస్తున్నాను’ అనే ప్రశ్న నాకూ వచ్చింది కానీ కథకు న్యాయం చేయాలి, ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాలి. దాని కోసం ఏమైనా చేయాలి అనుకున్నాను. ఆ తపనతోనే ఆ సినిమా చేశాను.


ఒక సినిమా అంగీకరించిన తర్వాత ఆ క్యారెక్టర్‌ కోసం ప్రిపేర్‌ అవుతుంటారా?

ప్రతి సినిమాకూ ఓ పది రోజుల పాటు వర్క్‌షాప్‌ చేయడం నాకు అలవాటు. దర్శకుడితో కూర్చుని ఆ క్యారెక్టర్‌ బిహేవియర్‌ ఎలా ఉండాలి, ఎలా చేయాలి.. అని చర్చిస్తా. లేదంటే సెట్‌లో నటించడం కష్టం. కనుక వర్క్‌ షాప్‌లో డౌట్స్‌ క్లియర్‌ చేసుకుని షూటింగ్‌కు వెళ్లిపోతా.

కెరీర్‌ బిగినింగ్‌లో బాగా స్ట్రగుల్‌ అయ్యారా?

ఆర్టిస్ట్‌ కావాలనే ధ్యేయంతో ఆఫీసుల చుట్టూ తిరిగే వాణ్ణి. ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొన్నా. కానీ అవకాశం రాలేదు. అప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అవే నాకు గుర్తింపు తెచ్చాయి. ప్రారంభంలో రెండు మూడేళ్లు స్టగుల్‌ తప్పలేదు.

ఇంత స్ట్రగుల్‌ టైమ్‌లోనే మీ ప్రేమ, పెళ్లి జరిగాయా?

ప్రేమ విషయం ఓకే కానీ, పెళ్లి జరిగే సమయానికి ‘ఛాయ్‌ బిస్కెట్‌’లో ఉద్యోగం చేస్తున్నా. నెలనెలా జీతం వస్తుంది కనుక ఆ ధైర్యంతో పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత కూడా స్ట్రగుల్‌ ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత బెటర్‌ అయింది కానీ తక్కువ డబ్బు వచ్చేది. ‘కలర్‌ ఫొటో’ తర్వాత లైఫ్‌లో సెటిల్‌ అయ్యాయని చెప్పాలి. ఆదాయం పెరిగిన తర్వాత, అంటే పెళ్లయిన నాలుగేళ్లకి మా ఆవిడను హనీమూన్‌కు తీసుకెళ్లా. అదికూడా... మాల్దీవులకే వెళ్లాలని మొదటి నుంచి ఫిక్స్‌ అయ్యా. డబ్బు వచ్చిన తర్వాత మా తొలి విదేశీ యాత్ర అదే.

సినిమాల విషయంలో మీ శ్రీమతి సలహాలు ఇస్తుంటారా?

లేదండి. ఇంట్లో సినిమాల ప్రసక్తి రాదు. కానీ ఆర్థిక విషయాలు మాత్రం తను డీల్‌ చేస్తుంటుంది. మాకు ఓ బాబు. ఈ మధ్యే పుట్టాడు. తీరిక దొరికితే చాలు వాడితో గడుపుతుంటా.

మళ్లీ ఫారిన్‌ ట్రిప్‌ ఏమీ వేయడం లేదా?

లేదండి. విదేశాలు వెళ్లాలంటే బాగా డబ్బు కావాలి కదా.


అదేమిటండీ.. మీ పారితోషికం భారీ స్థాయిలో ఉంద’ని పరిశ్రమలో అంటున్నారు..?

ఏదో కొంచెం పెరిగింది తప్ప బయట చెబుతున్నంత స్థాయిలో లేదు. నా సినిమాలకు ఎంత మార్కెట్‌ ఉందో నాకు తెలుసు కనుక ఆ బడ్జెట్‌ దాటితే సినిమా చేయనని దర్శకనిర్మాతలకు ముందే చెప్పేస్తున్నా. ఓటీటీలో నా సినిమాను ఇంతకు కొంటున్నారు కనుక ఆ బడ్జెట్‌లోనే చేద్దాం.. థియేటర్లలో వచ్చేది మనకు బోనస్‌ అని చెబుతున్నా. దానినిబట్టి నా పారితోషికం తీసుకుంటున్నా. ‘సుహా్‌సతో సినిమా చేస్తే సేఫ్‌’ అని నా నిర్మాతలు అనుకోవాలి. బడ్జెట్‌ను అనవసరంగా పెంచుకోకుండా, కథకు తగ్గట్టు నిర్ణయిస్తున్నాం. ఓటీటీ ద్వారా వచ్చే మొత్తంతో నిర్మాత సేఫ్‌ అవ్వాలని, టేబుల్‌ ప్రాఫిట్‌ రావాలనే ఆలోచనతోనే వర్క్‌ చేస్తున్నా.


మీకు వ్యక్తిగతంగా ఏ తరహా చిత్రాలు ఇష్టం?

డ్రామా జానర్‌లో ఉండే సినిమాలు ఇష్టం. నా ఫేవరెట్‌ ఫిల్మ్‌ ఏప్రిల్‌ ఒకటి విడుదల. అలాంటి డ్రామాలు నాకు చాలా ఇష్టం.

ప్రస్తుతం చేసిన ‘ప్రసన్న వదనం’ సినిమా గురించి చెప్పండి విడుదలకు ఇంకా ఐదు రోజులే ఉంది?

సుకుమార్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అర్జున్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుకుమార్‌గారు సినిమా చూసి పదిహేను నిముషాలు మాట్లాడారు. ఎంతో అభినందించి ‘ఇంకో హిట్‌ నీ ఖాతాలో వేసుకున్నావు సుహాస్‌’ అన్నారు. ఆయన అలా అన్న తర్వాత సినిమా మీద నమ్మకం పెరిగింది.

‘హిట్‌ 2’ లో విలన్‌గా నటించారు కదా.. మళ్లీ ఆ తరహా పాత్రలు చేస్తారా?

అందులో నటించిన తర్వాత వరుసగా విలన్‌ పాత్రలే వచ్చాయి. అందుకే గ్యాప్‌ ఇచ్చాను. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు పూర్తి కావడానికి మూడేళ్లు పట్టవచ్చు. ఆ తర్వాత కచ్చితంగా విలన్‌ పాత్రలు మళ్లీ చేస్తా.

  • వినాయకరావు

Updated Date - Apr 28 , 2024 | 09:34 AM