Weight Gain: బరువు పెరగాలంటే..!
ABN , Publish Date - Dec 08 , 2024 | 05:29 AM
బరువు తగ్గడం కంటే బరువు పెరగడం సులభం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇష్టమైన అహారపదార్థాలన్నీ తినేస్తే లావు అయిపోవచ్చు అనుకుంటారు.
బరువు తగ్గడం కంటే బరువు పెరగడం సులభం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇష్టమైన అహారపదార్థాలన్నీ తినేస్తే లావు అయిపోవచ్చు అనుకుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. కొంతమంది ఎంత తిన్నా బరువు పెరగరు. బరువు పెరగాలంటే జీవక్రియలు నియంత్రణలో ఉండాలి. సహజంగా ఆరోగ్య రీతిలో బొద్దుగా మారాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.
గింజలు: సాయంత్రం టీ లేదా కాఫీ తాగేముందు, రాత్రి పడుకునేముందు కొన్ని గింజలు తినడం అలవాటు చేసుకోండి. బాదాం, జీడిపప్పు, వాల్‌నట్స్, గుమ్మడి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. శరీరంలో జీవక్రియల వేగాన్ని తగ్గించి హార్మోన్ల పనితీరును నియంత్రిస్తాయి. దీనివల్ల క్రమంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
స్మూతీలు: ఎక్కువ క్యాలరీలు ఉండే స్మూతీలు తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. చిక్కని పాలు, అరటి పండ్లు, వేరుశనగ వెన్న, ఓట్స్ తదితరాలతో తయారు చేసిన స్మూతీలు తరచుగా తీసుకోవాలి. ఇవి కడుపులో తేలికగా ఉన్న భావనను కలిగిస్తాయి. కానీ అధిక మొత్తంలో క్యాలరీలు, పోషకాలు, కొవ్వులు, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఇవి జీవక్రియలను తటస్థంగా ఉంచుతాయి. ఎక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు తినలేనివారికి ఈ స్మూతీలు ఉపయుక్తంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్ పొడి కలుపుకుని తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది.
ఆలివ్ నూనె: రోజూ తినే సలాడ్స్, తాగే సూప్‌లలో ఆలివ్ ఆయిల్ చేర్చుకోవడం వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు అందుతాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తాయి. దీనివల్ల సులభంగా బరువు పెరగవచ్చు
సమతుల ఆహారం: ప్రతి మూడు గంటలకు ఒకసారి విటమిన్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో శరీరంలో క్యాలరీలు తగ్గకుండా జీవక్రియ తటస్థంగా ఉంటుంది. శరీరానికి విటమిన్లు, ఖనిజలవణాలు అధికంగా అందుతాయి కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగవచ్చు.
నెమ్మదిగా తినాలి: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా జరిగి శరీరం పోషకాలను గ్రహిస్తుంది. ఆకలిని పెంచే హార్మోన్‌లు ఉత్తేజితమవుతాయి.
ఆకలి అనిపించినపుడల్లా ఏదో ఒకటి తినడం వల్ల సహజంగా ఆరోగ్యకరమైన విధానంలో శరీరం బరువు పెరుగుతుంది.
వ్యాయామం: కండరాల శక్తిని, ఉత్పత్తిని పెంచే ప్రత్యేక వ్యాయామాలు చేయాలి. వివిధ రకాల ఆటలు ఆడడం, బరువులు ఎత్తడం, ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల్లో సాంద్రత, కండరాల బరువు పెరుగుతాయి. శరీరానికి అందే శక్తి అంతా బరువు పెరిగేందుకు తోడ్పడుతుంది.