Share News

Feeling alone : ఒంటరితనం వేధిస్తోందా!

ABN , Publish Date - Nov 21 , 2024 | 06:01 AM

నేను ఒంటరిని అనుకోవడం ఒక మానసిక భావన. చుట్టూ పదిమంది ఉన్నప్పటికీ కొంతమంది ఎవరితోనూ కలవలేక ఎవరినీ అర్థం చేసుకోలేక ఒంటరిగా భాధపడుతుంటారు. ఇటువంటి ప్రవర్తన నుంచి బయటపడేందుకు ఏం చేయాలంటే...

 Feeling alone : ఒంటరితనం వేధిస్తోందా!

నేను ఒంటరిని అనుకోవడం ఒక మానసిక భావన. చుట్టూ పదిమంది ఉన్నప్పటికీ కొంతమంది ఎవరితోనూ కలవలేక ఎవరినీ అర్థం చేసుకోలేక ఒంటరిగా భాధపడుతుంటారు. ఇటువంటి ప్రవర్తన నుంచి బయటపడేందుకు ఏం చేయాలంటే...

  • మంచి స్నేహితులు: ప్రతి ఒక్కరికీ చాలామంది పరిచయస్తులు ఉంటారు. వారిలో మనసుకు దగ్గరగా వచ్చినవారిని గుర్తించాలి. మనసులోని భావాలను వారితో పంచుకోగలమనే ధీమా ఉండాలి. అటువంటివారితో ఎక్కువగా మాట్లాడుతూ స్నేహం పెంచుకోవాలి. వారితో కష్ట సుఖాలు చెప్పుకోవడం, వారి నుంచి సలహాలు తీసుకోవడం, వారికి అవసరమైన సలహాలు ఇవ్వడం చేస్తూ ఉంటే మనసులో ఒంటరితనమనే భావన రాదు.

  • కించపరచుకోవద్దు: ఒంటరిగా ఉండేవాళ్లు నాకు ఏమీ రాదు, ఏమీ చేయలేను అనుకుంటూ బాధపడుతుంటారు. ఇలా తమను తాము కించపరచుకోవడం వల్ల మానసిక వేదన అధికమవుతుంది. అలాకాకుండా మీ ఆలోచనలను ఒక పుస్తకంలో రాయండి. మీలో మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. ఇలా చేయడంవల్ల మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది.

  • అతి మంచితనం వద్దు: ఒంటరిగా ఉండేవాళ్లు సహజంగా ఎదుటివారి నుంచి గుర్తింపు కోరుకుంటారు. దీంతో చుట్టూ ఉన్నవాళ్లను పరిశీలిస్తూ వారికి అవసరమైనదానికంటే ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే వారినుంచి ప్రశంసలు, గుర్తింపు ఆశిస్తారు. ఇవి అందని పక్షంలో మనసులో వెలితి భావనలు మొదలై బాధపడుతుంటారు. అలాకాకుండా ఎవరైనా సహాయం అడిగినపుడు మాత్రమే కాదనకుండా చేయాలి. అతి మంచితనం ప్రదర్శించాలని అనుకోకూడదు.


  • హోదా ప్రదర్శించవద్దు: సమాజంలో మంచి హోదాలో ఉంటేనే గుర్తింపు లభిస్తుందనుకుంటారు కొంతమంది. ఇది నిజం కాదు. మంచి వ్యక్తిత్వం, ఆకర్షణీయమైన ప్రవర్తన, అందరినీ కలుపుకొనే మృదు స్వభావంవల్లనే ఒంటరితనం అనే భావన దూరమవుతుంది.

  • ఉత్సాహంగా ఉండాలి: నిరంతరం ఉత్సాహంగా ఉండాలనే భావన ఒంటరితనాన్ని దగ్గరికి రానీయదు. కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడడం, స్నేహితులతో సరదాగా గడిపే ప్రయత్నం చేయడం, ఇరుగు-పొరుగువారితో ఆటలు ఆడడం, కలిసి వంటలు చేయడం వంటివి మనసుని సంతోషంతో నింపేస్తాయి. క్రమంగా బంధాలు కూడా బలపడతాయి.

  • మీలో మీరు: నచ్చిన పని చేయడం, నచ్చిన వ్యక్తులతో గడపడం అలవాటు చేసుకుంటే మనసు సేదతీరుతుంది. ఎక్కువసేపు ఖాళీగా ఉండకుండా ఏదైనా వ్యాపకంలో నిమగ్నమైతే ఆత్మన్యూనత భావనలు దరిచేరవు. మంచి పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం, తోటపని, పిల్లలతో గడపడం, సంగీతం వినడంవల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తేలికపాటి వ్యాయామం, యోగా, ధ్యానంవల్ల మానసిక ఆందోళన తగ్గి ఒంటరితనం అనే భావనే ఉండదు.

Updated Date - Nov 21 , 2024 | 06:02 AM