Share News

Skin Care: ముఖానికి మీగడ రాస్తే...

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:54 AM

చలికాలంలో ముఖం మీద చర్మం పొడిగా మారి పగులుతుంది. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Skin Care: ముఖానికి మీగడ రాస్తే...

చలికాలంలో ముఖం మీద చర్మం పొడిగా మారి పగులుతుంది. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి మన పెద్దలు చెప్పిన పరిష్కారం పాల మీగడ రాయడమే. పాలను బాగా కాచి చల్లార్చిన తరవాత దానిపై ఒక పొర ఏర్పడుతుంది. దీనినే మీగడ అంటారు. దీనిని ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. శీతాకాలంలో చర్మ సంరక్షణకు మీగడను మించింది లేదు.

ఎలా రాయాలంటే...

ముందుగా ముఖాన్ని సున్నిపిండితో రుద్ది శుభ్రం చేసుకోవాలి. తరవాత కొద్దిగా పాల మీగడను తీసుకుని ముఖానికి రాసి వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. పావు గంట తరవాత మీగడ పూర్తిగా చర్మంలోకి ఇంకిపోతుంది. గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని మెత్తని టవల్‌తో అద్దుకోవాలి. సాధ్యమైనంత వరకు సబ్బులు వాడకపోవడం మంచిది.

మీగడ రాయడం వల్ల...

ముఖానికి, చేతులకు మీగడ రాసుకోవడం వల్ల చర్మం మీద పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. మీగడలోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మం మీద ఉన్న ఎపిడెర్మల్‌, డెర్మల్‌ పొరల్లో కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా కొత్తకాంతితో మెరిపిసోతుంది.

చలి గాలుల వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఇలాంటపుడు మీగడను తరచూ రాస్తూ ఉంటే చర్మానికి తేమ అంది పగుళ్లు ఏర్పడవు. చిన్న పిల్లల చర్మం కోమలంగా ఉంటుంది. రసాయనాలతో కూడిన క్రీమ్‌లు రాయడం అంత మంచిది కాదు. వీరికి పాల మీగడ అద్భుతంగా పనిచేస్తుంది. మీగడలోని కొవ్వు పదార్థం చర్మానికి పోషణను అందిస్తుంది.

ముఖానికి మీగడ రాసి మర్దన చేయడం వల్ల చర్మ రంధ్రాలన్నీ తెరచుకుంటాయి. వాటిలో చేరిన మురికి, ఇతర వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. చర్మం శుభ్రపడడం వల్ల మొటిమలు, గుల్లలు రావు.

బయటికి వెళ్లే ముందు ముఖానికి కొద్దిగా పాల మీగడ రాసుకుంటే ఎండ వల్ల చర్మం నల్లబడకుండా ఉంటుంది. సూర్యరశ్మిలోని ప్రమాదకర కిరణాలనుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.

మీగడలో కొద్దిగా ఓట్స్‌ పొడి లేదా పంచదార కలిపి దానితో ముఖాన్ని మెల్లగా రుద్దితే చర్మం మృదువుగా మారుతుంది. మీగడలోని పోషకాలు చర్మంలోకి చేరి ముడతలు రాకుండా కాపాడతాయి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. మీగడను చేతులకు రాసుకున్నా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

కొంతమందికి ఎండ తగలగానే ముఖం ఎర్రగా కందిపోతుంది. ఇటువంటి వారికి పాల మీగడ బాగా పనిచేస్తుంది. ఎండ వల్ల కలిగే సురుకుపోటును నివారిస్తుంది.

Updated Date - Dec 22 , 2024 | 01:16 AM